అనవసర ఎక్స్‌పోజింగ్‌ నా వల్లకాదు: వర్ష

ABN , First Publish Date - 2020-04-20T05:00:12+05:30 IST

కన్నడ భామలు తెలుగు తెరమీద మెరవడం, ప్రేక్షకులను మురిపించడం కొత్తేమీ కాదు. అలనాటి సౌందర్య దగ్గర నుంచి, నిన్నటి అనుష్కశెట్టి, నేటి పూజా హెగ్డే వరకూ

అనవసర ఎక్స్‌పోజింగ్‌ నా వల్లకాదు: వర్ష

కన్నడ భామలు తెలుగు తెరమీద మెరవడం, ప్రేక్షకులను మురిపించడం కొత్తేమీ కాదు. అలనాటి సౌందర్య దగ్గర నుంచి, నిన్నటి అనుష్కశెట్టి, నేటి పూజా హెగ్డే వరకూ ఎందరో కన్నడ భామలు తెలుగు ప్రేక్షకులను తమ నటనతోనూ, అందచందాలతోనూ అలరిస్తున్నారు. వారి చెంతకు చేరింది వర్ష బొల్లమ్మ. తెరమీద ‘చూసి చూడంగానే’ తెలుగువారిని ఆకట్టుకున్న వర్ష బొల్లమ్మతో...


మీ గురించి

మైక్రోబయాలజీ చదివాను. నాకు చిన్నప్పట్నుంచే నటన అంటే చాలా ఇష్టం. కాలేజీలో స్టేజ్‌పై నటించాలనుకున్నాను. కానీ మా కాలేజీ డ్రామా అసోసియేషన్‌వారు నన్ను సెలక్ట్‌ చేయలేదు. తొలిసారి తమిళంలో ‘వెట్రివేలన్‌’ అనే సినిమా చేశాను. ఆ తర్వాత తమిళ హిట్‌ ‘96’లో నటించాను. మలయాళంలో కూడా సినిమాలు చేశాను. ‘96’లో నా నటనను చూసి శేష సింధు, రాజ్‌ కందుకూరి నాకు ‘చూసీ చూడంగానే’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. 


నటనలో ప్రత్యేకించి శిక్షణ తీసుకున్నారా?

ప్రత్యేకించి ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. సినిమాల్లోకి రాకముందు డబ్‌స్మాష్‌ వీడియోలు చేసిన అనుభవం మాత్రమే ఉంది. సినిమా సినిమాకూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ నా నటనను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నాను. సినిమాల్లో అవకాశం కూడా నా డబ్‌ స్మాష్‌ వీడియో చూసే ఇచ్చారు. 


ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

ఇది గ్లామర్‌ రంగమే అయినా, గ్లామర్‌ ఒక్కటే సరిపోదు. నటన వస్తేనే ఎక్కువ కాలం ఇక్కడ ఉండగలుగుతాం. అవసరమైతే డీగ్లామర్‌ పాత్రలైనా చేస్తాను. కొంతమంది అలాంటి పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ నేను మాత్రం అలాంటి పాత్రలైనా ఓకే.


డీగ్లామర్‌ పాత్రలు చేస్తే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతాయన్న భయం లేదా?

గ్లామర్‌గా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయంటే నేను నమ్మను. గ్లామర్‌తో పాటు నటన తప్పనిసరి. కథ బాగుండకపోతే సినిమా ఎలా ఆడదో...నటన రాకపోతే అవకాశాలు రావు. 


అయితే తెరమీద గ్లామర్‌గా కనిపించనంటారా?

డీగ్లామర్‌ పాత్రలు కూడా చేస్తానంటే గ్లామర్‌గా నటించనని కాదు కదా. సినిమాకు, పాత్రకూ అనుగుణంగా అవసరమైతే గ్లామర్‌గా కనిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగని అన్నీ గ్లామర్‌ పాత్రలే చేయమంటే చేయను. అనవసర ఎక్స్‌పోజింగ్‌ నా వల్లకాదు. 


‘చూసీ చూడంగానే’లో డ్రమ్మర్‌గా కనిపించారు కదా? దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ ఏమైనా తీసుకున్నారా?

కథ విన్నప్పుడు నా పాత్ర డ్రమ్మర్‌ అని చెప్పగానే నేను చేయగలనా? అని కొంచెం భయపడ్డాను. డ్రమ్మింగ్‌ గురించి అసలు ఏం తెలియకుండా చేయడం చాలా కష్టం. ఓ డ్రమ్‌ బ్యాండ్‌ నుంచి డ్రమ్మర్‌కి కావాల్సిన బేసిక్స్‌ నేర్చుకున్నాను కానీ చేసేటప్పుడు కష్టంగానే అనిపించింది. నా వరకూ నేను బాగానే చేశానని అనిపించింది. 


కన్నడ అమ్మాయి కదా తెలుగు, తమిళ భాషలు కష్టంగా అనిపించలేదా?

కష్టపడలేదు అని మాత్రం చెప్పను. కోలీవుడ్‌లో మొదటిసారి సినిమా చేస్తున్నప్పుడు కష్టంగానే అనిపించింది. ఇప్పుడు అంతకష్టంగా లేదు. కొద్దిగా తమిళ్‌ నేర్చుకున్నాను. తెలుగు కూడా షూటింగ్‌ సమయంలో కొద్దికొద్దిగా నేర్చుకోగలిగాను.


మీరు చేయబోతున్న తెలుగు సినిమాలు?

ఆనంద్‌ దేవరకొండ సినిమాలో గుంటూరు అమ్మాయిగా కనిపించబోతున్నాను. తెలుగులో చాలా కథలు విన్నాను. ఇంకా వేటికీ ఓకే చెప్పలేదు. తమిళంలో కూడా రెండు సినిమాలు చేయబోతున్నాను.

Updated Date - 2020-04-20T05:00:12+05:30 IST