తెలిసి తెలిసి ఆ తప్పు చేయను: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ABN , First Publish Date - 2020-05-03T04:05:37+05:30 IST

పడిలేచే కెరటంలా తయారైంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కెరీర్‌. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన రకూల్‌ ఆ తరువాత వరుస ఫ్లాపులతో

తెలిసి తెలిసి ఆ తప్పు చేయను: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

పడిలేచే కెరటంలా తయారైంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కెరీర్‌. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన రకూల్‌ ఆ తరువాత వరుస ఫ్లాపులతో డీలా పడింది. తనకన్నా వెనుక వచ్చిన వారు కెరీర్‌ పరంగా దూసుకుపోతుంటే, తను మాత్రం తప్పు మీద తప్పు చేస్తూ కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. ఇదేదో సినీ జనాలో, లేక ఆమె అంటే పడనివారో అంటున్న మాట కాదు. ఇది స్వయంగా ఆమె చెప్పిన మాటలే! తన కెరీర్‌ గురించీ, భవిష్యత్‌ ప్రణాళిక గురించి రకుల్‌ మాటల్లోనే...


కెరీర్‌ డల్‌ కావడానికి కారణం?

ఎవరినో నిందించడం నాకు నచ్చదు. ఓ విధంగా చెప్పాలంటే నా చేజేతులా నా కెరీర్‌ను నాశనం చేసుకున్నాను. కెరీర్‌ ప్రారంభంలో అన్నీ కమర్షియల్‌, గ్లామర్‌ పాత్రలే వచ్చాయి. అవకాశం వచ్చింది కదా అని అన్నీ అవే చేసుకుంటూపోయాను. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు చేయలేకపోయాను. ఇవి చేసి ఉంటే నా కెరీర్‌ ఈ రోజు వేరే విధంగా ఉండి ఉండేది. ఇది నా స్వయంకృతాపరాధం. 


లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయకపోవడం వల్లనే కెరీర్‌ ఇలా అయిందంటారా?

నా ఉద్దేశం అది కాదు. చాలా మంది లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు ఎందుకు చేయరని అంటారు. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనే కథా బలం ఉంటుందని కాదు. అన్ని సినిమాల్లో  కథ ఉంటుంది. కథ లేకుండా సినిమా ఉండదు. కాకపోత హీరోయిన్‌ పాత్రకి నటనకు అవకాశముంటేనే హీరోయిన్‌కి గుర్తింపు వస్తుంది. కేవలం గ్లామర్‌ ఒలకబోసినంత మాత్రాన గుర్తింపు రాదు. అయినా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు నా ఫేస్‌ సూట్‌ కాదని నా అభిప్రాయం. అందుకే అలాంటి సినిమాల జోలికి వెళ్ళలేదు.


ఉత్తరాదిన మంచి గుర్తింపు వస్తోందని భావిస్తున్నారా?

గతంలో ఉత్తరాదిన సినిమాలు చేసినా రావలసినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. నటిగా మంచి గుర్తింపు కూడా వస్తోంది. 


కథల ఎంపిక ఎలా చేసుకుంటారు?

కథల ఎంపిక బాధ్యత ఎప్పుడూ నాదే. ఈ విషయంలో ఎవరూ కల్పించుకోరు. ఓ కథ వినగానే అందులోని పాత్ర నచ్చింది అనిపిస్తే వెంటనే ఒప్పుకుంటాను. నా మనసుకు నచ్చితే తప్పకుండా చేస్తాను. ఇప్పటి వరకు అన్నీ అలాగే చేశాను. కాకపోతే కొన్ని ఫెయిల్యూర్‌లు వచ్చాయి. చెప్పానుగా దానికి నేనేమీ బాధపడడం లేదు. ఒక్కో పాత్రలో నటించడం ఒక కొత్త జీవితాన్ని అనుభవించిన దానికి సమం. అలా చూసుకుంటే నా సినీ పయనంలో ఎన్నో జీవితాలను అనుభవించాను. ఇక ముందు అనుభవిస్తాను కూడా.


రోజూ వర్కవుట్లు చేస్తుంటారు కదా? బోర్‌ అనిపించదా?

రోజూ భోజనం చేస్తాం. అది బోర్‌ అనిపించదు కదా, అలాగే వర్కవుట్లు కూడా. వర్కవుట్లు అనేవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మనల్ని అందంగా చూపిస్తాయి కూడా. వాటిని మానమంటే అస్సలు మానను. నేను సినిమాల్లోకి రాకముందు నుంచీ వర్కవుట్లు చేస్తున్నాను. కొందరు రోజూ ఏం చేస్తాంలే...ఒకరోజు స్కిప్‌ చేద్దామని బద్ధకిస్తారు. అదే వారి అనారోగ్యానికి కారణమవుతుంది. మన ఆరోగ్యం కోసం రోజులో గంట సేపన్నా కేటాయించలేకపోతే మన జీవితమే వేస్ట్.


కథ డిమాండ్‌ చేస్తే బరువు పెరుగుతారా?

ఆ పని అస్సలు చేయను. పాత్ర డిమాండ్‌ చేసిందని బరువు పెరగడం, ఆ తరువాత తగ్గడానికి తిప్పలు పడడం నాకు నచ్చదు. బరువుగా కనిపించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తానే తప్ప సహజంగా బరువు పెరగను. బరువు పెరగడం, తగ్గడం అనేది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తెలిసి తెలిసి అలాంటి తప్పు ఎలా చేస్తాను?


అపజయాలు వచ్చినప్పుడు ఎలా ఫీలవుతారు?

జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే మనల్ని మరిన్ని విజయాలు పలకరిస్తాయి. ఏ పనైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో మొదలుపెడతాను. నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు మనల్ని పలకరిస్తాయి. అలాంటప్పుడు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు. ఆ వైఫల్యాలు మన గురించి మనం ఆలోచించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మన బలాలను గుర్తు చేస్తాయి. అపజయాలు మంచికే! అవి లేకపోతే మనం ఏమీ నేర్చుకోకుండా మిగిలిపోతాం. గమనించుకోవాలే కానీ వైఫల్యాల ద్వారానే మనకు జీవిత పాఠాలు బోధపడతాయి.


ఇప్పటి వరకూ చాలా ప్రేమ కథ సినిమాల్లో నటించారు కదా? ప్రేమ మీద మీ అభిప్రాయం?

ప్రేమ గురించి చెప్పాలంటే అది చాలా అందమైనదే కాదు అంతకన్నా చాలా లోతైనది కూడా!. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ఇప్పుటి వరకూ ఎవరినీ ప్రేమించకపోయినా, ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. ఒక్కో చిత్రంలోని ప్రేమ నాకు ఎప్పటికప్పుడు కొత్త అనుభవాన్ని కలిగిస్తోంది. అలా నాకు ప్రేమలో చాలా అనుభవం వచ్చేసింది. ఈ రంగంలోకి రాకుండా ఉంటే, ప్రేమ గురించి తెలుసుకునే అవకాశం ఉండేది కాదు.. ప్రేమ కథా సినిమాల్లో నటించడం ఒక కొత్త జీవితాన్ని అనుభవించిన దానికి సమానం. అలా నా సినీ పయనంలో ఎన్నో జీవితాలను అనుభవించాను. ఇక ముందు కూడా అనుభవిస్తాను.


ఈ రంగంలో వచ్చిన తరువాత మరిచిపోలేని అనుభవం?

నా ప్రతి సినిమా ఓ మరిచిపోలేని అనుభవమే. కానీ ఈ రంగంలోకి వచ్చిన కొత్తల్లో నేను ఊహించని ఓ సంఘటన జరిగింది. ఓ సినిమా షూటింగ్‌లో నా కో స్టార్‌ చిన్నగా నన్ను దెబ్బ వేశారు. ఆయన చర్యకి ముందు నేను ఆశ్చర్యపోయాను. ఓ రెండు నిమిషాలు నా నోట్లోంచి మాట కూడా రాలేదు. కానీ ఆయన ఆ పని దురుద్దేశంతో చేయలేదని అర్ధమయింది. తన చర్యకి ఆయన చాలా సార్లు సారీ చెప్పారు. కానీ నేను దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. షూటింగ్‌లో ఉన్నవారు మాత్రం దాన్ని లీక్‌ చేయడంతో బయట బాగానే గొడవ అయింది. 


వేగాన్‌ డైట్‌లోకి మారారట? ప్రత్యేక కారణముందా?

కారణమంటూ ఏదీ లేదు. వేగాన్‌ డైట్‌ గురించి తెలుసుకున్న తరువాత నేను కూడా దాన్ని ఫాలో అవుదామని డిసైడ్‌ అయ్యాను. ఒకసారి ఓ విషయంలో నిర్ణయం తీసుకున్న తరువాత నేను దానికే కట్టుబడి ఉంటాను. ఈ డైట్‌ని ఫాలో అయిన తరువాత నాన్‌వెజ్‌, గుడ్లు పూర్తిగా మానేశాను. ఇప్పుడు నా శరీరమే కాదు మనస్సు కూడా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. నిజంగా ఈ డైట్‌ ఓ అద్భుతంలా అనిపించింది.


టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి షిఫ్టు అవుతున్నారట నిజమేనా?

ఆ వార్తలో ఎంత మాత్రం నిజం లేదు. ఇల్లు, వ్యాపారాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా ఇక్కడికి వస్తూనే ఉన్నాను. కాకపోతే గతంలోలాగా ఇక్కడే ఉండిపోవడానికి వీలుండడం లేదు. బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్నాను. మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాల్సి ఉంది. దాంతో అక్కడే ఎక్కువ కాలం ఉండిపోతున్నాను. 


బాలీవుడ్‌లో ఇద్దరు సీనియర్‌ హీరోయిన్లతో చేశారు కదా... వారితో స్క్రీన్‌ షేరింగ్‌ ఎలా అనిపించింది?

హేమమాలినీగారితో, టబుగారితో చేశాను. హేమమాలినిగారు ఎంత పెద్ద సీనియర్‌ అయినా చక్కగా మాట్లాడతారు. నటన పరంగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇక టబుగారిది కూడా హైదరాబాద్‌ కావడం, నాదీ ఈ ప్రాంతమే కావడంతో బోలెడన్ని సంగతులు మాట్లాడుకునేవారం. ఆవిడ తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరూ మంచి నటులే కాదు, మంచి వ్యక్తులు కూడా.


తెలుగులో చేస్తున్న సినిమా గురించి?

ఓ సినిమా ఒప్పుకోవడం జరిగింది. దాని గురించి ఇప్పుడే చెబితే బాగుండదు. దాని వివరాలు తరువాత చెబుతాను.

Updated Date - 2020-05-03T04:05:37+05:30 IST