అవకాశాల కోసం కాంప్రమైజ్‌ కాలేకపోయా: పవన్ హీరోయిన్

ABN , First Publish Date - 2020-03-28T04:56:14+05:30 IST

తెలుగు తెర మీద మెరిసినట్టే మెరిసి మాయమైన హీరోయిన్ నికీషా పటేల్. బ్రిటన్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ నటించిన పులి చిత్రంతో తెలుగు పరిశ్రమకు

అవకాశాల కోసం కాంప్రమైజ్‌ కాలేకపోయా: పవన్ హీరోయిన్

తెలుగు తెర మీద మెరిసినట్టే మెరిసి మాయమైన హీరోయిన్ నికీషా పటేల్. బ్రిటన్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ నటించిన పులి చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా దక్షిణాదిలో ఆఫర్లు చేజిక్కించుకొంటూ ఓ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. తెలుగు, తమిళం, కన్నడ అనే భేదం లేకుండా సినిమాలు చేసింది. అయితే ఉన్నట్టుండి ఆమె కెరీర్‌పై దెబ్బ పడింది. ఇంతకు అలా కనుమరుగు కావడానికి కారణమేమిటో ఆమె మాటల్లోనే...


తెలుగులో అవకాశాలు తగ్గడానికి కారణం మీరిచ్చిన ఓ ఇంటర్వ్యూ అంటారు ఎంత వరకు నిజం?

ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఒకటి. బయటకు వచ్చింది ఒకటి. దాని మీద అప్పట్లో చాలా సార్లు వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. నా మీద పడిన ముద్ర నుంచి ఇప్పటి వరకూ బయటకురాలేకపోయాను.


దక్షిణాదిన సక్సెస్‌ కాకపోవడానికి కారణం?

అది నాకు ఎప్పటికీ అంతుపట్టని విషయమే! ఇప్పటి వరకూ తమిళం, తెలుగు భాషల్లో కలిపి 25 చిత్రాలు చేశాను.. ఇక ఓ విధంగా చెప్పాలంటే నేను చేసిన సినిమాల్లో అన్ని పాత్రలు ఒకే విధంగా ఉండేవి. దాంతో అవి పదే పదే చేసి బోర్ కొట్టేసింది. అయినా నేను సినిమాల్లో, ఎంత బాగా చేసినా నా సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను కోరుకున్న విధంగా ఇక్కడ నాకు అవకాశాలు రాలేదు. దాంతో నాలోని నటనని పూర్తిస్థాయిలో బయట పెట్టలేకపోయాను. వచ్చిన అవకాశాలతోనే అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. అందుకే హిందీలో నటించేందుకు నిర్ణయించుకున్నాను.


స్టార్‌ హీరో పక్కన నటించినా, గుర్తింపు రాకపోవడానికి కారణం?

అదృష్టం మెయిన్ డోర్ కొడితే.. బ్యాక్ డోర్ నుంచి దుర‌దృష్టం వ‌చ్చి తిష్ట వేసింద‌ట‌. నా విషయంలో ఇదే జరిగిందని అనిపిస్తుంది. నా అదృష్టాన్ని చూసి అప్ప‌ట్లో చాలా మంది కుళ్లుకున్నారు కూడా. తొలి సినిమానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించే అవ‌కాశం వ‌స్తే కుళ్లుకోరా మరి. కానీ ఏం చేస్తాం. అదృష్టం వెంటే దురదృష్టం కూడా వచ్చింది. ఆ సినిమా సరిగా ఆడలేదు. దాంతో నా మీద ఓ ముద్ర పడిపోయింది, అసలు స్టార్‌ హీరోలతో సినిమాలు చేయడానికే ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చాను. నేను కోరుకున్న విధంగానే తెలుగులో మొదటి సినిమానే స్టార్‌ హీరోతో చేసే అదృష్టం దక్కింది. అదే నా పాలిట దురదృష్టమైంది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో నటిగా నన్ను ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. మెగా హీరోయిన్‌గానే గుర్తించారు. ఆ గుర్తింపైనా కలిసి వచ్చిందా? అంటే అదీ లేదు. మెగా హీరోయిన్‌ గుర్తింపు నుంచి బయటకు రావడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. 


మధ్యలో చిన్న సినిమాలు చేయడానికి కారణం?

చెప్పానుగా పెద్ద హీరోలతో చేయాలని వచ్చాను. కానీ నా కల ఫలించలేదు. సినిమాల విషయంలో సర్దుకుపోవలసి వచ్చింది. కొన్ని బడ్జెట్‌ సినిమాలలో అవకాశమొచ్చింది. అందుకే వాటికి ఓకే చెప్పాను. అప్పటి నుంచి నన్ను చిన్న సినిమాల హీరోయిన్‌గానే ట్రీట్‌ చేసేవారు. ఇది కూడా నా కెరీర్‌కి మైనస్‌గా మారింది. ఇక నుంచి అలాంటి సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. 


లండన్‌ అమ్మాయి అయి ఉండి అక్కడే సినిమాలు చేసుకోకుండా ఇక్కడి వరకూ ఎందుకు రావలసి వచ్చింది?

లండ‌న్ నుంచి ఇండియాకు వ‌చ్చింది బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనే. నిజానికి బాలీవుడ్‌లోనే సెటిల్‌ కావాలనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితులు నన్ను దక్షిణాదికి షిఫ్టు అయ్యేటట్టు చేశాయి. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో చేసిన సినిమాలు నన్ను నటిగా నిలబెట్టలేకపోయాయి. దాంతో తెలుగుకు గుడ్‌ బై చెప్పేసి తమిళం, క‌న్న‌డ చిత్రాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టాను. ఇక మీదట బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే హాలీవుడ్‌లో కూడా నటిస్తాను. మొదట అక్కడ అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు నేను కొన్ని చోట్ల అతిగా చేసానని అన్నారు. అందుకే మొదట అక్కడ నాకు అవకాశాలు రాలేదు. హాలీవుడ్‌ అనేకాదు, బాలీవుడ్‌లో కూడా కొందరు నన్ను అలాగే విమర్శించారు. 


నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట?

నా నటనను మరింత మెరుగు పరుచుకునేందుకు లండన్‌ వెళ్ళాను. ఇది నేను తీసుకున్న ఓ కష్టమైన నిర్ణయం. లండన్‌ నా స్వస్థలం అన్న సంగతి అందరికీ తెలుసు. అక్కడే ఓ ఇల్లు కూడా తీసుకున్నాను. ఓ అంతర్జాతీయ ఏజెన్సీతో కలిసి పనిచేస్తున్నాను అక్కడ. బ్రిటీష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ కోర్స్ చేసాను. నాకు నటన అంత బాగా రాదు. చూడడానికి అందంగా ఉంటాను. ఆ ఒక్క క్వాలిఫికేషన్‌తోనే సినీ రంగంలోకి వచ్చాను. కానీ ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది. హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడానికి అందం ఒక్కటే సరిపోదు. నటన కూడా చాలా అవసరమని. ఇదే విషయాన్ని, బాలీవుడ్‌ వాళ్ళూ, హాలీవుడ్‌ వాళ్ళు కూడా చెప్పారు. అందుకే నా నటనను మెరుగు పరుచుకోవడానికే లండన్‌కు వెళ్ళాను.


ఇండియాలో మీకు నటన గురించి చెప్పేవారే లేరంటారా?

నేను లండన్‌ అమ్మాయిని. అక్కడ నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చి చాలా సంవత్సరాలే అయినా, నాకు సరైన పరిచయాలు లేవు. ఎక్కడ శిక్షణ తీసుకుంటే బాగుంటుందన్న విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. గందరగోళం మధ్య ఇక్కడ ఉండడం కన్నా లండన్‌ వెళ్ళిపోవడమే బెటరని అక్కడకు వెళ్ళాను. అంతే తప్ప ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు లేరని అంత దూరం వెళ్ళలేదు. నేను తీసుకున్న ట్రైనింగ్‌ వృధా కాలేదని నా ఉద్దేశం. గతంలో కన్నా నా నటనలో మెచ్యురిటీ వచ్చింది. అదే నాకు అవకాశాలను తెచ్చిపెడుతుందన్న నమ్మకం నాకుంది. 


అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారా?

లండన్‌లో ఓ టీవీ షో కోసం ఆడిషన్‌కు వెళ్ళాను. బాలీవుడ్‌లో కూడా కొందరు దర్శకనిర్మాతలను కలవడం జరిగింది. కొందరు కథలు చెప్పారు. కానీ వేటికీ ఓకే చెప్పలేదు. ఇది ఓ విధంగా నాకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లాంటిది. ఈసారి ఎలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఉత్తరాదిని అయినా, దక్షిణాదిని అయినా ఓ మంచి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. 


ఇక్కడ సినిమాలు చేస్తూ టీవీ షోలో చేయడం ఇబ్బంది కదా?

నేనేమీ బిజీ నటిని కాదు కదా? రెండు వైపులా మేనేజ్‌ చేసుకోగలను. ఆ నమ్మకం నాకుంది. 


మిమ్మల్ని కొందరు సోనాక్షి సిన్హాతో పోల్చడం ఎంత వరకు సమంజసం అంటారు?

ఆ పోలిక అస్సలు నాకు నచ్చదు. ఆమెతో నన్ను పోలిస్తే నేను ఇంకా ఎక్కువ సేపు జిమ్‌లో కసరత్తులు చేయాల్సి ఉంటుంది. నేను కొద్దిగా బొద్దుగా ఉంటానే తప్ప ఆమె అంత లావుగా ఉండను. ఆమెతో నన్ను ఏ విషయంలో పోలుస్తున్నారో నాకు అస్సలు అర్ధంకాదు. ఆమెకూ నాకూ ఏ విషయంలోనూ పోలిక లేదు. 


తరచూ చిట్టి పొట్టి దుస్తులతో ఫోటోషూట్లు చేయడానికి కారణం అవకాశాల కోసమేనా?

అటు ప్రేక్షకులు, ఇటు దర్శకనిర్మాతలు నన్ను గుర్తు పెట్టుకోవాలంటే గ్యాప్‌ లేకుండా సినిమాలన్నా చేయాలి. లేదా...ఇలాంటి ఫోటో షూట్లన్నా చేయాలి. నేనేమీ కొత్తగా చేయడం లేదుగా, స్టార్‌ హీరోయిన్లే చేస్తున్నారు. నేను చేస్తే తప్పేంటి?


మీ పెళ్ళి మీద వస్తున్న వార్తల గురించి?

నేను ఏం చెప్పకుండానే వార్తలు సృష్టించేస్తున్నారు. నేను సరదాకి అన్న మాటలు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఏం చెప్పినా, మరో వార్త అవుతుందే తప్ప నిజం కాదు. నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటాను. ఎవరికీ చెప్పకుండా చేసుకునే అవసరం నాకు లేదు. సినిమాల్లోకి రాకముందు నాకొక బాయ్‌ ఫ్రెండ్‌ ఉండేవాడు. నేను నటిని కావడం అతనికి ఇష్టంలేదు. సినిమా వాళ్ళని నేను పెళ్ళి చేసుకోను అంటూ నాకు బ్రేకప్‌ చెప్పేసాడు. ఇక అప్పటి నుంచీ ప్రేమా, పెళ్ళి మీద నాకు నమ్మకం పోయింది. 


క్యాస్టింగ్‌ కౌచ్‌ మీద మీ అభిప్రాయం?

నటీమణులను వేధించేవారు ఇక్కడా ఉన్నారు. అవకాశాలు కావాలంటే కాంప్రమైజ్‌ కావాలని చాలామంది నాతోనూ అన్నారు. కానీ ఆ విషయంలో నేను కాంప్రమైజ్‌ కాలేకపోయాను. నాకు అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమని నా నమ్మకం. ఎన్నో కలలతో ఇక్కడకు వచ్చేవారికి ఈ వేధింపులు చాలా బాధకు గురిచేస్తాయి. అయితే అందరికీ ఇలాంటివి ఎదురవుతాయని నేను అనుకోవడం లేదు. వారసత్వంగా వచ్చేవారికి ఈ వేధింపులు ఉండకపోవచ్చు. అలాగే సీనియర్‌ హీరోయిన్లకు, గుర్తింపు తెచ్చుకున్న వారికి ఇందులో మినహాయింపు ఉంటుంది. కొందరు వ్యక్తులయితే కొత్త వారికి కనీస మర్యాద కూడా ఇవ్వరు. ఎందుకు వచ్చామా? అని బాధపడే విధంగా ప్రవర్తిస్తుంటారు. 

–స్పందనరెడ్డి

Updated Date - 2020-03-28T04:56:14+05:30 IST