తను నాతోనే ఉంది..: సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు సినీ చరిత్రలో హీరో కృష్ణది ఓ సాహసోపేతమైన ఘట్టం.

సినిమా రూపకల్పన కొత్త పుంతలు తొక్కిన ప్రతి దశలోనూ ఆయన ముద్ర ఉంది.

ఐదు పదుల నటజీవితంలో ఎన్నెన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన 

కృష్ణ ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 

78 వసంతాలు పూర్తి చేసుకుని సోమవారం 79లోకి అడుగుపెడుతున్న 

కృష్ణ ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు.


ఈసారి పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి?

కరోనా అందరినీ చాలా ఇబ్బంది పెడుతోంది. లాక్‌డౌన్‌ కూడా ఉంది. అందుకే ఈసారి ఎలాంటి హడావిడి లేదు. అభిమానులెవ్వరినీ రావద్దని చెప్పా. నేను కూడా మా చిన్నమ్మాయి పద్మినీ ప్రియదర్శిని ఇంటికి వెళుతున్నాను. కుటుంబ సభ్యుల మధ్య అక్కడే కేక్‌ కట్‌ చేస్తాను.


లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం అవడం ఎలా ఉంది?

నేను రిటైర్‌ అయ్యాను కనుక నాకు పెద్దగా తేడా తెలియడం లేదు. ఇంతకుముందు సాయంత్రం పూట ఆఫీసుకు, గండిపేట ఇంటికి వెళుతుండేవాణ్ణి. కానీ కరోనా వచ్చిన తర్వాత ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. గండిపేట ఇంటికి వెళుతున్నాను. ఇక కాలక్షేపం అంటారా.. రకరకాల పేపర్లు, బుక్స్‌ చదువుతా. టీవీ చూస్తుంటా.. కాలం గడిచిపోతోంది. 


మీ జీవితంలో  విజయనిర్మలగారు  చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆమె లేని లోటు ఎలా అనిపిస్తోంది? 

చాలా ఒంటరిగా అనిపిస్తోంది. ఆవిడ ఉండగా టైమ్‌ తెలిసేది కాదు. మేమిద్దరం భార్యాభర్తలమే కాదు మంచి స్నేహితులం కూడా. నన్ను సంతోషపెట్డడంలోనే నిర్మల తన ఆనందం వెదుక్కునేది. మేము ఒకరిని అడగకుండా మరొకరం ఏ పని చేసేవాళ్లం కాదు. తను నాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకొనేది. మేము ప్రతి రోజూ రాత్రి భోజనం చేశాక నిద్ర వచ్చేవరకూ కబుర్లు చెప్పుకొనేవాళ్లం. అందుకే ఆవిడ లేని లోటు చాలా ఎక్కువగా ఫీలవుతున్నా. 


తరచూ ఆవిడ గుర్తుకు వస్తుంటారా?

మరిచిపోతే కదా గుర్తుకు రావడానికి. లైఫ్‌ అంతా నాతోనే ఉంది. తను నాతో నటించినా, నటించకపోయినా ఎప్పుడూ నా వెంట ఉండేది. ఔట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్లినా తనే నాకు స్వయంగా వండి వడ్డించేది. మన దేశంలోనే కాదు.. ‘హరేకృష్ణ హలో రాధ’ చిత్రం షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లినప్పుడు అక్కడ కూడా నిర్మల వంట చేసింది. అమెరికాలో ఉన్న నెల రోజులూ తను వండి పెట్టింది. అమెరికాలో మాకు ఒక డాక్టర్‌ ఫ్రెండ్‌ ఉండేవారు. ఆయన మాకు అమెరికాలో అనేక ప్రదేశాలు తిప్పి చూపించేవాడు. ఒక రోజు పొద్దున్నే ఆయన మా రూమ్‌కి వచ్చే సరికి - నిర్మల ఇడ్లీలు, దోసెలు పెట్టింది. వాటిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరు కాని ఊరు వచ్చి పొద్దునే ఇంత మంచి టిఫెన్‌ పెడతారా అని నిర్మలను ఎంతో ప్రశంసించాడు.! 


ఇంట్లో విజయనిర్మల గారి విగ్రహం ప్రతిష్టించినట్లున్నారు..

మొదట ఈ విగ్రహాన్ని మా తోటలో ఏర్పాటు చేయాలనుకున్నాం. అయితే నిర్మల తిరిగిన ప్రదేశం ఇది. అందుకే మా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశాం. తాడేపల్లి గూడెంలో ఉంటున్న దేవికారాణి వడయార్‌ అనే శిల్పి దీనిని తయారుచేశారు. ఆవిడది చిన్న వయసే కానీ అద్భుతమైన ప్రతిభావంతురాలు. విగ్రహాన్ని చూస్తే నిర్మలను చూసినట్లే ఉంటుంది. 


పద్మాలయ సంస్థ మళ్లీ నిర్మాణ రంగంలోకి వస్తుందా?

ఒకప్పుడు పద్మాలయా సంస్థ తెలుగు, హిందీలలో నంబర్‌వన్‌గా ఉండేది. ఎంత పెద్ద హీరోలైనా అడగ్గానే డేట్స్‌ ఇచ్చేవారు. అయితే ఈ మధ్య కాలంలో చిత్రనిర్మాణంలో గ్యాప్‌ వచ్చింది. త్వరలోనే ‘ప్రేమకథాచిత్రమ్‌’ సినిమాను హృతిక్‌ రోషన్‌ హీరోగా రీమేక్‌ చేయాలనుకుంటున్నాం. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ కొవిడ్‌ వల్ల ఆలస్యమయింది. దీనితో పాటుగా గతంలో మేము జితేంద్రతో నిర్మించిన ‘పాతాళ భైరవి’ చిత్రాన్ని కూడా మళ్లీ హిందీలో తీయాలనుకుంటున్నాం. ‘మీరు, మేం కలసి ఆ సినిమా తీద్దాం’ అని జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్‌ చాలా కాలంగా అడుగుతోంది. దీనిని కూడా హృతిక్‌తోనే తీస్తాం. 


మహేశ్‌ను హిందీకి పరిచయం చేసే ఆలోచన లేదా?

‘పాతాళభైరవి’ చిత్రాన్ని మొదట అతనితోనే హిందీలో తీయాలనుకున్నాం. కానీ తను చేయనన్నాడు. నేను కూడా చాలాసార్లు అడిగాను. కానీ ఒప్పుకోలేదు. బాలీవుడ్‌కు వెళ్లటం మహేష్‌కు ఇష్టం లేదు. ఇక్కడ నంబర్‌ వన్‌గా ఉండి.. హిందీలోకి వెళ్లి నలుగురిలో ఒకడిగా ఎందుకు ఉండాలనేది అతని వాదన.


చాలా ఒంటరిగా అనిపిస్తోంది. ఆవిడ ఉండగా టైమ్‌ తెలిసేది కాదు. మేమిద్దరం భార్యాభర్తలమే కాదు  మంచి స్నేహితులం కూడా.  నన్ను సంతోషపెట్డడంలోనే నిర్మల తన ఆనందం వెదుక్కునేది.జగ్గయ్యగారితో మాకు మంచి అనుబంధం ఉంది. దీనికి రెండు కారణాలున్నాయి. చాలా మందికి తెలియని విషయమేమిటంటే - నేను తొలిసారి తెరమీద కనిపించిన సినిమా జగ్గయ్యగారు నిర్మించిన ‘పదండి ముందుకు’ . ‘ఈ సినిమాలో ప్రత్యేకమైన వేషం అంటూ లేదు. కాంగ్రెస్‌ వాలెంటీర్‌గా జనం అందరితో పాటు ఉండే పాత్ర ఉంది. కొన్ని సీన్లలో కనిపిస్తావు కానీ డైలాగులు చాలా తక్కువ. నువ్వు వేస్తానంటే ఇస్తా’ అన్నారు జగ్గయ్యగారు. సరేనన్నాను. ఆ తర్వాతే ‘తేనె మనసులు’ చిత్రంలో హీరోగా నటించాను. 


ఇక మేం నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లో ఆయన నటించారు. జగ్గయ్యగారు మంచి ఆర్టిస్టే కానీ షూటింగ్‌కు లేట్‌గా వచ్చేవారు. అయితే ‘దేవుడు చేసిన మనుషులు’ మల్టీస్టారర్‌ మూవీ కావడం, ఎక్కువ మంది ఆర్టిస్టులు సెట్‌లో ఉండడంతో ఆయన కూడా తొందరగా వచ్చేవారు. ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్‌ చింతపల్లి అడవుల్లో చేశాం. మేం ఏడు గంటలకు స్పాట్‌లో ఉంటే జగ్గయ్యగారు మాత్రం తొమ్మిది గంటలకు  షూటింగ్‌కు వచ్చేవారు. మద్రాసులో షూటింగ్స్‌ చేసేటప్పుడు మాత్రం పదిన్నర, పదకొండు గంటలకు ఆయన సెట్‌కు వచ్చేవారు. అయినా మేం చూసీ చూడనట్లు ఉండేవాళ్లం.

-వినాయకరావు 

ఫొటోలు: లవకుమార్

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.