హృదయంతో చేసిన సినిమా ‘జై భీమ్‌’

ABN , First Publish Date - 2021-11-02T08:46:20+05:30 IST

‘‘సినిమా అనేది బలమైన మాధ్యమం. కొన్ని విలువైన విషయాలు చెప్పడానికి సినిమాని వేదిక చేసుకుంటే భావితరాలకు ఏదో చేశామన్న తృప్తి కలుగుతుందని నా నమ్మకం. చాలా సినిమాలు లెక్కలు వేసుకునే చేస్తాం...

హృదయంతో చేసిన సినిమా ‘జై భీమ్‌’

‘‘కొన్ని సినిమాలు మెదడుతో ఆలోచించి చేస్తాం. ఇంకొన్ని మనసు పెట్టి చేస్తాం. ‘జై భీమ్‌’ మాత్రంహృదయంతో చేసిన సినిమా’’ అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన ‘జై భీమ్‌’ మంగళవారం నుంచి ఆమేజాన్‌ ప్రైమ్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా సూర్య విలేకరులతో ముచ్చటించారు.



‘‘సినిమా అనేది బలమైన మాధ్యమం. కొన్ని విలువైన విషయాలు చెప్పడానికి సినిమాని వేదిక చేసుకుంటే భావితరాలకు ఏదో చేశామన్న తృప్తి కలుగుతుందని నా నమ్మకం. చాలా సినిమాలు లెక్కలు వేసుకునే చేస్తాం. కొన్ని కథలకు లెక్కలు అవసరం లేదు. ‘జై భీమ్‌’ అలాంటి కథే. చంద్రూ అనే న్యాయవాది జీవితం ఈ సినిమా. ఆయన తన జీవిత కాలంలో 96 వేల కేసుల్ని వాదించారు. వాళ్లందరికీ న్యాయం చేశారు. ఆయన వాదించిన కేసుల్లో అత్యంత వివాదాస్పదమైన, ముఖ్యమైన కేసుకి సంబంధించిన కథ ఇది. రాజ్యాంగాన్ని అందించిన బి.ఆర్‌. ఆంబేద్కర్‌ ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఈ కథకు మూలం. అందుకే ‘జై భీమ్‌’ అనే టైటిల్‌ పెట్టాం. నిజానికి ఈ టైటిల్‌ మా దగ్గర లేదు. పా.రంజిత్‌ ఇది వరకే ఈ టైటిల్‌ ని రిజిస్టర్‌ చేయించారు. ఆయన్ని అడిగి ఈ టైటిల్‌ తీసుకున్నాం’’


‘‘ఈ సినిమా కోసం హై కోర్టు సెట్‌ వేశాం. ఇప్పటి వరకూ మన సినిమాల్లో ఇలాంటి కోర్టు సెట్‌ చూసి ఉండరు. అత్యంత సహజంగా ఉంటుంది. ‘నిజ జీవితంలో కోర్టు ఇలా ఉంటుందా’ అని ఆశ్చర్యపోతారు. కోర్టులో వాద ప్రతివాదనలు కూడా నాటకీయంగా ఉండవు. కథంతా నా చుట్టూ తిరగాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాలో నా ఒక్కడి పాత్రే కాదు... రెండు నిమిషాల పాటు కనిపించే చిన్న పాత్ర కూడా కథకు కీలకం. అడ్వకేట్‌ జనరల్‌గా రావు రమేష్‌ నటించారు. ఆయన నటన తప్పకుండా నచ్చుతుంది. తమిళంలో ఆయనే డబ్బింగ్‌ చెప్పారు. చివరి రోజు ఆయన ఓ లెంగ్తీ డైలాగ్‌ చెప్పాల్సి వచ్చింది. ఆ డైలాగ్‌ పూర్తవ్వగానే సెట్లోవాళ్లంతా క్లాప్స్‌ కొట్టారు. తమిళంలో ఆయన మరిన్ని మంచి సినిమాలు చేస్తారని అనిపించింది’’


‘‘ఈ సమాజంలో ఎవరైనా మార్పు తీసుకురాగలరు. ప్రయత్నించాలంతే. కనీస హక్కుల గురించి అవగాహన లేని కొంతమంది సమూహం తరపున పోరాడే ఓ న్యాయవాది కథ ‘జై భీమ్‌’లో చూపించాం. సినిమా చూశాక చాలామందిలో మార్పు వస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మా సినిమా చూశారు. ఆయన సినిమా చూశాక స్పందించిన తీరు.. అమోఘం. ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశాం. ఆ సినిమా విజయం మాకెంతో నమ్మకాన్ని కలిగించింది. అందుకే ఈసారి కూడా ఓటీటీలోనే విడుదల చేస్తున్నాం’’.

Updated Date - 2021-11-02T08:46:20+05:30 IST