‘సిరివెన్నెల’లో.. టాలెంట్ ఉందని.. మొదటగా గుర్తించింది ఆయనే..

ప్రముఖ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ చిన్నబోయింది. దాదాపు 3000కు పైగా పాటలు రాసిన ఆయన.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారనడంలో అతిశయోక్తి లేదు. 11 నంది అవార్డులు, ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఆయన్ను.. పద్మశ్రీ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్న సిరివెన్నెలలో టాలెంట్ ఉందని మొట్టమొదటగా గుర్తించింది, ఎవరనేది చాలా మందికి తెలీదు.

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించిన సిరివెన్నెల.. విద్యాభ్యాసం మొత్తం  అనకాపల్లి, కాకినాడలో జరిగింది. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని కోరిక ఉండేదట. చాలా సార్లు పాటలు పాడేందుకు ప్రయత్నించారట. అయితే తన వాయిస్ అందుకు సరిపోలేదనే నిరాశలో ఉన్న ఆయన్ను.. సోదరుడు చెంబోలు వెంకట రామ శాస్త్రి ఓదార్చేవారట. ఆ సమయంలో ఆయన సోదరుడు మరో సలహా కూడా ఇచ్చారట. ‘‘ అన్నయ్యా.. పాటలు పాడే సమయంలో కొత్త కొత్త పదాలను ఉపయోగిస్తున్నావు.. కవిత్వం కూడా బాగా రాస్తావు.. సాహిత్యం వైపు ప్రయత్నాలు ఎందుకు చెయ్యకూడదు.. ఒకసారి ఆలోచించండి’’.. అని సలహా ఇచ్చారట.

దీంతో ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌ బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారట సిరివెన్నెల. అప్పట్లో సీతారామ శాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారట. ఆయన ఎంఏ చదువుతున్న రోజుల్లో దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. అలా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టి తనదైన శైలిలో పాటలు రాస్తూ.. తెలుగు ప్రేక్షకులపై ‘సిరివెన్నెల’ కురిపించారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ పలువురు సినీ పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.