సినిమా పోస్టర్లు చూసి కథ చెప్పేవాణ్ణి
ABN , First Publish Date - 2022-11-29T09:31:09+05:30 IST
‘నా అనలు పేరు తిరుపతిరెడ్డి. ఆర్టిస్ట్ రఘువీర్‌గారిని నేను గురువుగా భావిస్తాను. అందుకే నా పేరులోని మొదటి రెండు అక్షరాలు ‘తిరు’, రఘవీర్‌లోని...

‘నా అనలు పేరు తిరుపతిరెడ్డి. ఆర్టిస్ట్ రఘువీర్‌గారిని నేను గురువుగా భావిస్తాను. అందుకే నా పేరులోని మొదటి రెండు అక్షరాలు ‘తిరు’, రఘవీర్‌లోని చివరి రెండు అక్షరాలు ‘వీర్’ తీసుకుని ‘తిరువీర్’గా నా పేరు మార్చుకున్నా. మా అమ్మ పేరు వీరమ్మ కావడం కూడా నాకు సెంటిమెంట్‌గా మారింది’ అన్నారు ‘మసూద’ చిత్రహీరో తిరువీర్. ఆ చిత్రం విజయవంతంగా ఆడుతున్న సందర్భంగా సోమవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ‘ప్రతి ఒక్కరిలోనూ ఏవో భయాలు ఉంటుంటాయి. నాకు కూడా చీకటి అంటే భయం. అందుకే ‘మసూద’ చిత్రంలోని గోపీ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆ పాత్రను పోషించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. అయితే ఈ సినిమాలోని పతాక సన్నివేశాల్లో చేసిన పైట్లు మాత్రం కష్టంగా అనిపించాయి’ అన్నారు తిరువీర్. ‘ఇంతవరకూ నేను చేసిన ‘మల్లేశం’, ‘పలాస’, ‘జార్జిరెడ్డి’ వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాల వల్ల పరిశ్రమలో వారందరికీ తెలిశాను. కానీ ‘మసూద’లోని గోపీ పాత్రతో కామన్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాను. దిల్‌రాజుగారికి ఈ పాత్ర బాగా నచ్చింది. బయటకు వస్తే జనం నన్ను గుర్తు పడుతున్నారు’ అంటూ ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా, దర్శకుడు సాయికిరణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ‘ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. అయితే విలన్, సైకో పాత్రలే నాకు ఇప్పటివరకూ వచ్చాయి. వాటిలోంచి బయటకు రావాలని అనుకుంటున్న తరుణంలో ‘మసూద’ చిత్రంలో అవకాశం వచ్చింది. హీరో అవ్వాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చిన్నప్పుడు వాల్‌పోస్టర్లు చూసి కథలు చెప్పేవాణ్ణి. అయితే హీరో అనే ట్యాగ్ నాకు ఇష్టం లేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌లా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది’ అని చెప్పారు తిరువీర్. తను నటించిన ‘పరేషాన్’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉందనీ, ‘మోక్షపటం’, ‘పారాహుషార్’ చిత్రాలు లైన్‌లో ఉన్నాయనీ, వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాననీ ఆయన చెప్పారు.