పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత నెల్లో ‘భీమ్లానాయక్’ గా అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ చిత్రం బ్యాలెన్స్ షూట్ కు రెడీ అవుతున్నారు. సరికొత్త షెడ్యూల్ త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతోంది. దీని కోసం ఓ భారీ సెట్ ను కూడా నిర్మిస్తున్నారు. తోటతరణి ఆధ్వర్యంలో సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో తోటతరణి, పవర్ స్టార్ కలిసి ముచ్చటించుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. ఈ సెట్ లోనే బ్యాలెన్స్ షూట్ మొత్తం జరగబోతోందని సమాచారం. ఈ షెడ్యూల్ లో కథానాయిక నిధి అగర్వాల్ కూడా చేరబోతోంది. ఈ మూవీలో ఆమె యువరాణిగా డిఫరెంట్ మేకోవర్ తో మెస్మరైజ్ చేయబోతోంది. క్రిష్ దర్శకత్వంలో ఏ.యం. రత్నం నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
రాబిన్ హుడ్ తరహాలోని పాత్రతో ‘వీరమల్లు’ గా పవర్ స్టార్ ఈ సినిమాతో అభిమానులకు మరోసారి మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. మొఘలాయీల కాలానికి చెందిన ఫిక్షనల్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కోహినూర్ వజ్రం ప్రస్తావన ప్రధానంగా ఉండబోతోందని తెలుస్తోంది. జానపద జోనర్ లోని పీరియాడికల్ మూవీగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వబోతోంది చిత్రం. ఇదివరకు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.