ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు దర్శకుడు గౌతమ్ మీనన్ (Gowtham Menon). సాధారణ ప్రేమకథని, తన అసాధరణ టేకింగ్‌తో తెరపై గొప్పగా ఆవిష్కరిస్తాడు. ముఖ్యంగా యూత్ కు ఆయన సినిమాలంటే.. ఎనలేని క్రేజ్. యాక్షన్ చిత్రాల్ని కూడా విభిన్నంగా తెరకెక్కించగలిగే .. ఆయనతో పనిచేయాలని ఎందరో హీరోలు భావిస్తుంటారు. అలాంటి వారిలో రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. అతడికి ఎప్పటి నుంచో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించాలని కోరిక. ఏవేవో కారణాల వల్ల అది ఇంతవరకూ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు అది నెరవేరే తరుణం ఆసన్నమైందని టాక్. రామ్ పోతినేని, గౌతమ్ మీనన్ కలయికలో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఓకే అయిందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఇటీవల రామ్, గౌతమ్ మీనన్ మధ్య కథా చర్చలు జరిగాయట. ఇద్దరూ సినిమా చేయడానికి ఒక అంగీకారానికి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ ఈ మధ్యకాలంలో తమిళ మార్కెట్ పై దృష్టి సారించాడు. అందులో భాగంగానే లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో ‘ది వారియర్’ (The Warrior) సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. మరింత మంది తమిళ దర్శకులతో ఈ హీరో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ‘ది వారియర్’ చిత్రం విడుదలయ్యాకా రామ్.. బోయపాటి (Boyapati) దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం చేయబోతున్నాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలోని సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.
ఇంతవరకూ గౌతమ్ మీనన్ వెంకటేశ్ (Venkatesh), నాగచైతన్య (Nagachaitanya), నానీ (Nani) లాంటి తెలుగు హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో రామ్ పోతినేని తో చేయబోతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యకాలంలో దర్శకత్వాన్ని వదిలేసి నటుడిగా బిజీ అయ్యాడు గౌతమ్ మీనన్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో దర్శకుడిగా బిజీ అవనుండడం విశేషం. మరి రామ్ తో గౌతమ్ ఏ తరహా చిత్రాన్ని తీస్తాడో చూడాలి.