విలక్షణమైన పాత్రలనే ఎంచుకుంటా!

ABN , First Publish Date - 2022-01-23T08:11:59+05:30 IST

పరభాషా నటులకు తెలుగులో మంచి పాత్రలు దక్కుతున్నాయి.

విలక్షణమైన పాత్రలనే ఎంచుకుంటా!

పరభాషా నటులకు తెలుగులో మంచి పాత్రలు దక్కుతున్నాయి. వాళ్లు కూడా తమ విలక్షణమైన నటనతో.. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో కనిపించిన గోవింద్‌ పద్మసూర్య మలయాళం నుంచి వచ్చినవాడే. అయితే తెలుగులో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా గోవింద్‌ మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను చూసిన తొలి చిత్రం ‘అతడు’. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అల వైకుంఠపురములో’తోనే నేను తెలుగులో నటుడిగా అడుగుపెట్టడం నా అదృష్టం. ‘బంగార్రాజు’లో కూడా చాలా మంచి పాత్ర దక్కింది. నాగార్జున లాంటి అనుభవజ్ఞుడితో పనిచేయడం ఓ పాఠం. నాగచైతన్య కూడా నాకు స్నేహితుడైపోయాడు. బంగార్రాజులో నా పాత్రకు మంచి పేరొచ్చిందంటే దానికి కారణం దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. ఆయన నన్ను ఓ సోదరుడిగా చూసుకున్నారు. ప్రస్తుతం ‘మీట్‌ క్యూట్‌’లో నటిస్తున్నా. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో పోలీస్‌ అధికారిగా కనిపిస్తా. తెలుగులో చాలా అవకాశాలొస్తున్నాయి. విలక్షణ పాత్రలనే ఎంచుకుంటూ, నటుడిగా నా స్థానాన్ని మరింత సుస్థిపరచుకోవాలని వుంద’’న్నారు. 

Updated Date - 2022-01-23T08:11:59+05:30 IST