ఓటీటీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది!

సాయి పవని రాజు... 

మంచి డ్యాన్సర్‌, యాక్టర్‌!

మూడు షార్ట్‌ ఫిల్మ్స్‌...

ఆరు వెబ్‌ సిరీస్‌లు...

సినిమా అవకాశాలు...

అన్నట్టు ఆమె కెరీర్‌ సాగుతోంది!

అయితే, ముందు పవని నటి కావాలనుకోలేదు!

డాక్టర్‌, తర్వాత ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకున్నారు.

ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌ కావాలనుకుంటున్నారు!

మరి, ఇన్‌స్టాగ్రామ్‌లోకి... అక్కణ్ణుంచి

యూట్యూబ్‌, యాక్టింగ్‌లోకి ఎలా వచ్చారు?

‘చిత్రజ్యోతి’కి సాయి పవని రాజు చెప్పుకొచ్చారిలా...


‘‘నా పేరు సాయి పవని రాజు. మాది చిత్తూరు జిల్లాలోని పుత్తూరు. చిన్నతనం నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. స్కూల్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. కానీ, ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో డ్యాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేయాలనుకోలేదు. ఇంటర్‌ అయ్యాక... బీబీఏ కోసం చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో చేరా. సెలవులకు ఇంటికొచ్చా. నాకు డబ్‌స్మాష్‌ గురించి అప్పటికి తెలియదు. ‘నువ్వు డ్యాన్స్‌ బాగా చేస్తావ్‌. యాక్టివ్‌గా ఉంటావ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చెయ్‌’ అని మా అక్క నయని చెప్పింది. నేను ‘నో’ అన్నాను. తనే ప్రోత్సహించి మా ఇద్దరి పేరు మీద ‘నయని-పవని’ అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. ఓ డ్యాన్స్‌ వీడియో పోస్ట్‌ చేయగానే... పాపులర్‌ అయ్యింది. మిలియన్స్‌ వ్యూస్‌ వచ్చాయి. ‘సోషల్‌ మీడియాలో సడన్‌గా ఇలా వెళ్లడం ఎంతవరకూ కరెక్ట్‌?’ అని భయపడ్డా. తర్వాత మెల్లమెల్లగా డ్యాన్స్‌ వీడియోలు చేశా. అదీ చదువుకుంటూనే!


యాక్చువల్లీ... నన్ను డాక్టర్‌గా చూడాలనేది మా ఇంట్లో వాళ్ల ఆశ. నేనూ ‘ఎంబీబీఎస్‌ చేద్దాం’ అనుకున్నా. ఇంటర్‌ చేసేటప్పుడు రక్తం చూసి భయపడ్డా. మనతో కాదని డాక్టర్‌ ఆశకు ఫుల్‌ స్టాప్‌ పెట్టా. అప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకున్నా. ఎందుకంటే... నాకు చిన్నతనం నుంచి అందంగా అలంకరించుకోవడం ఇష్టం. ముఖ్యంగా పండగలు, ఫంక్షన్స్‌కు ఓసారి వేసుకున్న డ్రస్‌ మళ్లీ వేసుకునేదాన్ని కాదు. టైలర్‌ దగ్గరకు వెళ్లి కావలసినట్టు డ్రస్‌ కుట్టించుకోవడం నా అలవాటు. అయితే... మావైపు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ గురించి తెలియదు. ‘ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఏంటి? టైలరింగ్‌ చేస్తావా?’ అని అడిగారు.  దాంతో ఇంట్లో ‘ముందు ఓ డిగ్రీ చెయ్‌. తర్వాత నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో’ అన్నారు. బీబీఏ చేసేటప్పుడూ ఉద్యోగం చేయాలనే ఆలోచన లేదు. ఎంట్రప్రెన్యూర్‌ అవ్వాలని, బిజినెస్‌ ప్రారంభించాలని ముందునుంచీ అనుకున్నా. ఇప్పటికీ ఎంట్రప్రెన్యూర్‌ అవ్వాలను కుంటున్నా. మధ్యలో నటించే అవకాశాలు రావడంతో చేశా. చేస్తున్నా. అనుకోకుండా వినోద రంగంలోకి వచ్చా. నచ్చింది. నటిగా కొనసాగుతున్నా. బహుశా... దేవుడు ఇలా రాసి పెట్టాడేమో!


బీబీఏ చేస్తున్నప్పుడే తొలి కవర్‌ సాంగ్‌ ‘సోనే సోనే... సూపర్‌ సోనీ’ (‘సింగం-3’లోది) చేశా... షణ్ముఖ్‌ జస్వంత్‌తో! మేం చేసిన రెండో పాట ‘సితార’ (‘విన్నర్‌’లోది). దాంతో నాకు మంచి పేరొచ్చింది. చాలామందికి తెలిశా. ఆ రెండూ విశాఖలో చిత్రీకరించారు. కేవలం ఆ సాంగ్స్‌ చేయడానికి చెన్నై నుంచి విశాఖ వెళ్లా. చిత్రీకరణ పూర్తయ్యాక మళ్లీ చెన్నై వెళ్లేదాన్ని. అప్పట్లో డ్యాన్స్‌ వీడియోస్‌ చేయడానికి అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ డ్యాన్స్‌ వీడియోస్‌ చూసే షణ్ముఖ్‌ నన్ను కాంటాక్ట్‌ అయ్యాడు. తనతో మూడు పాటలు చేశా. అప్పుడు చాలా అవకాశాలు వచ్చినప్పటికీ... చెన్నైలో చదువు, పరీక్షల వల్ల చేయలేకపోయా. కొన్ని కథలు నాకు నచ్చలేదు. నచ్చినవి కొన్ని ‘పెళ్లి చూపులు 2.0’, ‘అదేంటి? నువ్‌ కమిటెడ్‌ కాదా?’, ‘హౌ టు ఇంప్రెస్‌ బాయ్స్‌’, ‘జటాయు’ కొన్ని చేశా.


బీబీఏ పూర్తయ్యాక చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. దర్శకుడు ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి ఆడిషన్‌ చేయకుండా ‘సూర్యకాంతం’లో నిహారికగారి స్నేహితురాలి పాత్రకు ఎంపిక చేశారు. నాకు సినిమా చిత్రీకరణలు ఎలా జరుగుతాయో తెలియదు. టీమంతా నన్నెంతో ఫ్రెండ్లీగా చూసుకున్నారు. తర్వాత కవర్‌ సాంగ్స్‌, యూట్యూబ్‌ ఫిల్మ్స్‌ చాలా చేశా. నేను నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘ఎంత ఘాటు ప్రేమ’ చేశా. కానీ, విడుదల ఆలస్యమైంది. ఆ తర్వాత చేసిన ‘ఇట్స్‌ మై లైఫ్‌’, ‘బబ్లు వర్సెస్‌ సుబ్బులు’ వెబ్‌ సిరీస్‌లు దానికంటే ముందు వీక్షకుల ముందుకొచ్చాయి. వీటికంటే ముందు ‘కలహం మధురం’ మరో ఓ వెబ్‌ సిరీస్‌ చేశా. ‘బబ్లు వర్సెస్‌ సుబ్బులు’ అయితే చిత్రీకరణ చేసేటప్పుడు ఎక్కువ డెవలప్‌ చేశాం. హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఆ సిరీస్‌ షూట్‌ చేశాం. తొలి ఐదు ఎపిసోడ్స్‌ ఐదు రోజుల్లో, ఆ తర్వాత ఐదింటినీ మరో ఏడు రోజుల్లో చేశాం. కరోనా వల్ల చిత్రీకరణ ఫాస్ట్‌గా వర్క్‌ చేశాం. ‘నీవెవరో’, సైమాకి నామినేట్‌ అయిన ‘కథానాయిక’తో పాటు ఇంకా చాలా షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశా.


ఇప్పటివరకూ షార్ట్‌ ఫిల్మ్స్‌, వెబ్‌ సిరీస్‌లు, కవర్‌ సాంగ్స్‌ ఎన్ని చేశానో లెక్కపెట్టలేదు. లెక్క పెట్టాలని ఎప్పుడూ ఆలోచించలేదు కూడా (నవ్వులు)! ఎందుకంటే... నా మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందని భయపడతా. బేసికల్లీ... ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత ముఖ్యం. లెక్కపెడుతూ వెళితే... ‘అందరూ చేస్తున్నారు. నేను చేయడం లేదు’ అని మరో టెన్షన్‌.


ఇటీవల ఓ కథ విన్నా. చాలా బావుంది. అందులో నేనే హీరోయిన్‌. కరోనా తగ్గితే చిత్రీకరణ మొదలువుతుంది. ఓటీటీ కోసం ఆ ప్రాజెక్టు చేస్తున్నారు. ‘నీ జతగా’ అని ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ చేశా. అదింకా విడుదల కాలేదు. టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌ విడుదల చేశారు. తమిళంలోనూ కవర్‌ సాంగ్స్‌ చేశా. నాకు తమిళం వచ్చు. చెన్నైలో చదువుకున్నాను కదా! అందులోనూ మాది తమిళనాడు బోర్డరే. మంచి కథలు, అవకాశాలు వస్తే... తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నా. ఫ్యాషన్స్‌ గురించి వివరించడానికి  ఓ యూట్యూబ్‌ ఛానల్‌ స్టార్ట్‌ చేశా.’’


‘‘నేను స్టార్టింగ్‌లో కొన్ని వీడియో సాంగ్స్‌ ఫ్రీగా చేశా. డబ్బులు తీసుకోలేదు. తొలి పారితోషికం అంటే... ‘పెళ్లి చూపులు 2.0’కు తీసుకున్నా. రెండు రోజులకు రూ. పది వేలు ఇచ్చారు. నాకు కథ నచ్చిందంటే... పారితోషకం గురించి ఆలోచించను. ఎంత ఇస్తానన్నా తీసుకుంటా. ఇటీవల ‘సమయం లేదు మిత్రమా’ అని ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా. స్ర్కిప్ట్‌ డిఫరెంట్‌గా ఉందనీ, బావుందనీ ఏం తీసుకోకుండా చేశా. అందులో నటనకు మంచి పేరొస్తే... మరో ఛాన్స్‌ వస్తుందని నా భావన.’’అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.