Movie review: ‘పక్కా కమర్షియల్‌’

ABN , First Publish Date - 2022-07-01T20:49:02+05:30 IST

చిన్న చిత్రాల విజయానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు మారుతి. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే మినిమం గ్యారెంటీతో హాయిగా నవ్వుకోవచ్చనే మార్క్‌ కూడా ఉంది. అలాంటి దర్శకుడితో మాస్‌, కమర్షియల్‌ ఇమేజ్‌ ఉన్న హీరో గోపీచంద్‌తో కలిస్తే... యాక్షన్‌, కామెడీ సినిమా ఖాయం అని భావించారు.

Movie review: ‘పక్కా కమర్షియల్‌’

సినిమా రివ్యూ: ‘పక్కా కమర్షియల్‌’ (Pakka commercial movie review)

విడుదల తేదీ: 1–7–2022

నటీనటులు: గోపీచంద్‌(Gopichand), రాశీఖన్నా(Raasi khanna), సత్యరాజ్‌, రావు రమేశ్‌, శుభలేఖ సుధాకర్‌, ప్రవీణ్‌, సియా గౌతమ్‌; అజయ్‌ గోష్‌, పి.డి. శ్రీనివాస్‌ తదితరులు. 

సాంకేతిక నిపుణులు: 

కెమెరా: కార్మ్‌ చావ్లా

ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్దవ్‌

సంగీతం: జేక్స్‌ బిజోయ్‌

నిర్మాణ సంస్థలు: జీఎ2 పిక్చర్స్‌, యువీ క్రియేషన్స్‌

సమర్పణ: అల్లు అరవింద్‌(Allu aravind)

నిర్మాతలు: బన్నీ వాసు, వంశీ, ప్రమోద్‌

కథ–మాటలు–స్ర్కీన్‌ప్లే–దర్శకత్వం: మారుతి(Maruthi)


చిన్న చిత్రాల విజయానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు మారుతి. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే మినిమం గ్యారెంటీతో హాయిగా నవ్వుకోవచ్చనే మార్క్‌ కూడా ఉంది. అలాంటి దర్శకుడితో మాస్‌, కమర్షియల్‌ ఇమేజ్‌ ఉన్న హీరో గోపీచంద్‌తో కలిస్తే... యాక్షన్‌, కామెడీ సినిమా ఖాయం అని భావించారు. వెనక గీతా ఆర్ట్స్‌, యువీ సంస్థలు ఉండడంతో గ్యారెంటీ సినిమా అనే బజ్‌ కూడా క్రియేట్‌ అయింది. చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్‌ విజయాన్ని అందుకున్నారా? మారుతి ఫార్మెట్‌ వర్కవుట్‌ అయిందా? అన్నది సమీక్షలో తెలుసుకుందాం. (Pakka commercial movie review)


కథ:

లక్కీ (గోపీచంద్‌) పేరున్న న్యాయమూర్తి సూర్యనారాయణ (సత్యరాజ్‌)కుమారుడు. తన తీర్పుతో ఓ అమ్మాయి ప్రాణాల్ని కోల్పోయిందని, ఆమెకు న్యాయం చేయలేకపోయానని న్యాయమూర్తిగా వృత్తికి రాజీనామా చేసి చిన్న కిరాణా షాపు పెట్టుకుని సాధారణ జీవితం సాగిస్తుంటారు. అంత నిజాయతీ గల న్యాయమూర్తి కొడుకు లక్కీ మాత్రం పక్కా కమర్షియల్‌ లాయర్‌. డబ్బు లేనిదే ఏ కేసు టేకప్‌ చేయడు. తండ్రి న్యాయమూర్తిగా రాజీనామా చేయడానికి కారణమైన వివేక్‌(రావు రమేశ్‌) కేసు విషయంలో లక్కీ తన తండ్రితో తలపడాల్సి వస్తుంది. ఈ పోరులో న్యాయం కోసం నిజాయతీగా ముందుకెళ్లే సూర్యనారాయణ గెలిచాడా? న్యాయాన్ని మార్కెట్‌లో పెట్టేసిన కొడుకు లక్కీ గెలిచాడా? లక్కీ అంత కమర్షియల్‌గా మారడానికి కారణమేంటి? వివేక్‌కి శిక్ష పడాలనే సూర్యనారాయణ కోరిక నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ. (Pakka commercial movie review)



విశ్లేషణ: 

నిజాయతీకి మారుపేరైన న్యాయమూర్తి తండ్రి, అతనికి తెలియకుండా డబ్బు కోసం న్యాయాన్ని, అన్యాయంగా మార్చేసే కొడుకు మధ్య సాగే కథ ఇది. రావు రమేశ్‌, సత్యరాజ్‌ కోర్ట్‌ రూమ్‌ సీన్‌తో సినిమా మొదలవుతుంది. ఆ కేసు విషయంలో ఓ అమ్మాయికి న్యాయం చేయలేకపోయాను అని సూర్యనారాయణ పాత్రధారి సత్యరాజ్‌ వృత్తికి రిజైన్‌ చేయడం నుంచి కథ మొదలైంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ప్రేక్షకుడి ఊహకు ఈజీగా అర్థమైపోయేలా ఉంది. ‘నేను హీరోను కాదు విలన్‌’ అని చెప్పుకొన్న హీరో.. క్లైమాక్స్‌కి వచ్చే సరికి హీరో అవుతాడని కథ ప్రారంభంలోనే తెలిసిపోయింది. హీరోకి సరైన పోటీ లేకపోవడంతో కథ ప్రారంభం నుంచీ హీరో పక్కనే కథ నడిచిన భావన కలుగుతుంది. వివేక్‌తో చేతులు కలపడం, కోర్టులో తండ్రిని అవమానించడం నుంచి ప్రతి సన్నివేశంలోనూ క్లైమాక్స్‌కు వచ్చేసరికి తండ్రి కోసం, అతను నమ్మిన న్యాయం కోసం లక్కీ ఏదో చేస్తాడని ఊహకు అందేలా ఉంది. అదే జరిగింది కూడా! అసలు లక్కీ ఇదంతా ఎందుకు చేశాడు అనే దానికి ‘న్యాయమూర్తి వృత్తికి రాజీనామా చేసి, ఓ కిరణా కొట్టు పెటుకుని సాధారణ జీవితం సాగించిన తన తండ్రి ఆవేదనను చిన్నతనం నుంచే చూసిన లక్కీ, అందుకు కారణమైన వివేక్‌ సరైన గుణపాఠం చెప్పడానికే ఇదంతా చేశాడు’ అని ప్లాష్‌బ్యాక్‌ క్లారిటీ ఇవ్వడం కన్వెన్సింగ్‌గా అనిపించింది. తండ్రి–కొడుకుల మధ్య భావోద్వేగాలు చక్కగా పండాయి. అమూల్యగా కథలో సియా గౌతమ్‌ ఎంటర్‌ అయినప్పటి నుంచి ఏదో ట్విస్ట్‌ ఉంటుందనిపించింది. ఆ పాత్రే ఆ ట్విస్ట్‌కు కారణమైంది. ఆ సన్నివేశాలన్నీ సోసోగా సాగాయి. అన్యాయం జరిగిన ఓ 20 కుటుంబాలు న్యాయం కోసం లాయర్‌ దగ్గరికి వచ్చి అక్కడ డబ్బు చూసి మారిపోయిన సన్నివేశం కాస్త అతిగా అనిపించింది. క్లైమాక్స్‌లో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ వచ్చి గతంలో ఏం జరిగిందో వివేక్‌కు వివరించే సన్నివేశం అవసరం లేదనిపించింది. నటీనటుల విషయానికొస్తే.. గోపీచంద్‌ స్టైలిష్‌గా యంగ్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు. నటన, యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇలాంటి పాత్రలు అతనికి కొత్తేమీ కాదు. హీరోయిన్‌ అంటే పాటలు, రొమాంటిక్‌ సన్నివేశాలకే పరిమితమవుతున్న తరుణంలో ఇందులో రాశీఖన్నాకి స్పేస్‌ బాగా దొరికింది.  సీరియల్‌ ఆర్టిస్ట్‌ కమ్‌ జూనియర్‌ లాయర్‌గా ఝాన్సీ పాత్రలో రాశీఖన్నా ఆకట్టుకుంది. ‘ప్రతిరోజు పండగే’ చిత్రంలో ఏంజెల్‌ ఆర్నాగా ఎలాగైతే ఆకట్టుకుందో ఇందులోనూ అంతే! అయితే ఇక్కడ కొన్ని సన్నివేశాలు, డైలాగ్‌లు రిపీట్‌గా ఉండడంతో విసుగు పుట్టించింది. సత్యరాజ్‌ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉంటే బావుండేది. నెగటివ్‌ రోల్‌లో రావు రమేష్‌ పాత్ర ఓకే అనిపించింది. ఆయన టైమింగ్‌ వల్ల కొన్ని మాటలు పేలాయి. అజయ్‌ ఘోష్‌ పాత్ర వినోదాన్ని పంచింది. గుర్తు పెట్టుకునే పాటలు లేవు. కెమెరా పనితనం బావుంది. కోర్టు రూమ్‌లో గబ్బర్‌సింగ్‌ అంత్యాక్షరి టీమ్‌తో ‘సాయి బాబా’ పాటల సన్నివేశాన్ని కాస్త ట్రిమ్‌ చేసుంటే బావుండేది గీతా సంస్థ నిర్మాణ విలువలు బావున్నాయి. (Pakka commercial movie review)

టైటిల్‌కు తగ్గట్టే మారుతి పక్కా మాస్‌ మసాలా కథ రాసుకున్నాడు. అయితే కథను తెరకెక్కించిన తీరు మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగే ఉంది. ఫక్తు రెగ్యులర్‌ ఫార్మెట్‌లో ట్రీట్‌మెంట్‌ సాగింది. కోర్ట్‌ రూమ్‌, పలు సన్నివేశాల్లో లాజిక్‌కు పక్కనపెట్టి మ్యాజిక్‌ చేస్తే వర్కవుట్‌ అవుతుందనే నమ్మకంతో మారుతి కొన్ని సన్నివేశాలు రాసుకున్నాడు. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో మారుతి ఈ కథ రాసుకున్నాడా? అని అనుకుంటే.. తెరపై అతను చూపించిన దానికి నో అనే చెప్పాలి. టైటిల్‌కు తగ్గట్లు కమర్షియల్‌ అంశాలను మాత్రం మరచిపోలేదు. కథ పాతది అయినప్పుడు ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటే ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలుంటాయి. అదే మూస ధోరణితో సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లిపోతే మేకర్స్‌ కన్నా మూడు రెట్లు అడ్వాన్స్‌గా ఉన్న ఆడియన్స్‌ని మెప్పించడం కష్టమే అవుతుంది. 


ట్యాగ్‌ లైన్‌: ‘పక్కా రొటీన్‌’




Updated Date - 2022-07-01T20:49:02+05:30 IST