Syamala: అలా చేయకపోతే.. ఘంటసాల కొంతకాలం బతికేవారేమో!

ABN , First Publish Date - 2022-09-25T23:14:28+05:30 IST

మధుర గాయకుడు, స్వరకర్త ఘంటసాల శత జయంతి సంవత్సరం ఇది. డిసెంబర్‌ 4, 1922న జన్మించిన ఆయన 11 ఫిబ్రవరి 1974లో మరణించారు. దాదాపు మూడు దశాబ్ధాలపాటు సంగీత ప్రియులను అలరించిన ఆయన పేరు గిన్నిస్‌ బుక్‌లో నమోదు కావాలనీ, ఘంటసాలకు ‘భారతరత్న’ రావాలని ఆయన అభిమానులు ఎందరో కోరుకుంటున్నారు

Syamala: అలా చేయకపోతే.. ఘంటసాల కొంతకాలం బతికేవారేమో!

మధుర గాయకుడు, స్వరకర్త ఘంటసాల (Ghantasala)శత జయంతి సంవత్సరం ఇది. డిసెంబర్‌ 4, 1922న జన్మించిన ఆయన 11 ఫిబ్రవరి 1974లో మరణించారు. దాదాపు మూడు దశాబ్ధాలపాటు సంగీత ప్రియులను అలరించిన ఆయన పేరు గిన్నిస్‌ బుక్‌లో నమోదు కావాలనీ, ఘంటసాలకు ‘భారతరత్న’ రావాలని ఆయన అభిమానులు ఎందరో కోరుకుంటున్నారు. ఆ ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఘంటసాల శ్యామల (Syamala)తన తండ్రి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొవడానికి హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలకరించింది. చివరి రోజుల్లో ఘంటసాల ఎలా ఉన్నారు... నిర్మాతలు ఏం చేశారు.. అన్న విషయాలపై ఆమె స్పందించారు. (100 years of Ghantasala)


‘‘చివరిరోజుల్లో నాన్నకు గొంతులో పుండు వచ్చి 15 రోజులు విజయా ఆస్పత్రిలో ఉన్నారు. ఆ సమయానికి ఆయన పాడాల్సిన పాటల రికార్డింగ్‌ ఆగిపోయింది. షూటింగ్స్‌ ప్లాన్‌ చేసుకున్నవాళ్లు ఆగలేక  ట్రాక్‌లు పాడించి పాటల చిత్రీకరణ చేశారు. ఆ తర్వాత ఆ పాటలకు నాన్న వాయిస్‌ మిక్స్‌ చేయాలి. అప్పుడే నాన్న గొంతులో పుండు తగ్గుతుంది. కాబట్టి ‘ఓవర్‌ స్ర్టెయిన్‌ వద్దు.. పాటలు పాడటానికి వీల్లేదు’ అని డాక్టర్లు సూచించారు. ఆస్పత్రి నుంచి అమ్మ భోజనం కోసం ఇంటికి వెళ్లిన సమయంలో ఎవరూ లేని సమయం చూసి నిర్మాతలు నాన్న దగ్గరకు వచ్చి ‘మీరు పాట పాడితే నా సినిమా రిలీజ్‌ అయిపోతుంది నేను గట్టెక్కెస్తాను అని ఏదో ఒక కారణం చెప్పేవారు. నాన్న దానికి కరిగిపోయి ఆస్పత్రిలోనే పాటను ప్రాక్టీస్‌ చేసేవారు. రికార్డింగ్‌ థియేటర్‌కు వెళ్లాలంటే ఆస్పత్రి  బయట సెక్యూరిటీ అంగీకరించరని ఆస్పత్రి వెనుక గేటు దగ్గరకు కారు తీసుకొచ్చి నాన్నను తీసుకెళ్లి రికార్డింగ్‌ పాట పాడించి అమ్మ వచ్చేలోపు హాస్పిటల్‌లో దిగబెట్టేవారు. అలా పాడలేని పరిస్థితుల్లో కూడా  మూడు పాటలు పాడారు. కొనింన రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది. ఈ విషయం నాగిరెడ్డి(B nagireddy)గారికి తెలియడంతో ఆయన ‘అంత ఆగలేక పోతే వేరే వాళ్లతో  పాడించాలి కానీ ఇలా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తారా’ అని  నిర్మాతల మీద మండిపడ్డారు.


ఆ మూడు పాడకుండా ఉంటే... 

అది నాన్న చివరి రోజు. మధ్యాహ్నాం ఆస్పత్ని బెడ్డు మీద కూర్చుని నాన్న  నాగిరెడ్గిఆరి అల్లుడు, మరో డాక్టర్‌తో మాట్లాడుతున్నారు. అమ్మ పళ్లరసం తీస్తోంది. ‘మాస్టార్‌ మిమ్మల్ని రేపు డిశ్చార్జ్‌ చేస్తున్నాం. ఇంటికి వెళ్లిన తర్వాత మా కోసం ఓ ప్రైవేట్‌ సాంగ్‌ పాడాలి’ అని డాక్టర్‌ అడిగారు. ‘అలాగే తప్పకుండా పాడతాను బాబూ’ అన్నారు నాన్న.. అలా మాట్లాడుతూనే హఠాత్తుగా గుండె పోటు వచ్చి ఒక్కసారిగా పక్క మీదకు ఒరిగిపోయారు. ఆ మూడు పాటలు పాడకపోతే నాన్నగారు మరికొన్ని రోజులు బతికేవారేమో! 




Updated Date - 2022-09-25T23:14:28+05:30 IST