ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా!

Twitter IconWatsapp IconFacebook Icon
ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా!

చిత్రసీమలో అవకాశం అందడమే... గొప్ప వరం. అదే విజయం. హిట్టూ, ఫ్లాపు.. తరవాతి సంగతి. చేతిలో సినిమా పడితే గెలిచినట్టే. ‘గని’ దర్శకుడు కిరణ్‌ కొర్రపాటికి ఇది తొలి సినిమానే. కానీ ఆ అవకాశం దక్కించుకోవడానికి ఏళ్ల తరబడి నిరీక్షణ చేయాల్సివచ్చింది. దాదాపు పదిహేనేళ్ల పాటు కో - డెరెక్టర్‌గా పని చేశారాయన. ఐదేళ్ల పాటు డెరెక్షన్‌ ప్రయత్నాలు చేసి, రెండేళ్ల క్రితం ‘గని’ మొదలెట్టారు. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం.. అందులోని మలుపుల్ని కిరణ్‌ కొర్రపాటి ఇలా పంచుకున్నారు. 


బాక్సింగ్‌ రిహార్సల్‌ చేస్తున్నప్పుడు వరుణ్‌ చేతికి గాయమైయింది. రెండు నెలలు రెస్ట్‌ కావాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే చాలా సెటప్‌ తో అన్నపూర్ణలో షూటింగ్‌ ప్లాన్‌ చేశాం.బాక్సర్లు, వాళ్ళ ట్రైనర్స్‌, ఫైట్‌ మాస్టర్స్‌ , ేస్టజ్‌.. ఇలా చాలా ఏర్పాటు చేశాం. ఈ సమయంలో నిర్మాతలు సపోర్ట్‌ చేశారు. ఈమధ్య కాలంలో ఓ కొత్త దర్శకుడి సినిమాకి ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతుడిని. నన్ను వరుణ్‌ నమ్మారు. నిర్మాతలు నమ్మారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమాతో నిలబెట్టుకుంటా.   


గని ప్రయాణం ఎప్పుడు మొదలైయింది ?

వరుణ్‌ తేజ్‌ ‘మిస్టర్‌’కి నేను కోడైరెక్టర్‌గా చేశా. అక్కడి నుంచే వరుణ్‌తో పరిచయం ఏర్పడింది. ‘తొలిప్రేమ’ జరుగుతున్న సమయంలో ఇద్దరం కలసి సినిమా చేయాలనుకున్నాం. ఓ రోజు వరుణ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ సినిమా చేద్దామని చెప్పారు. బాక్సింగ్‌ అనేసరికి డబుల్‌ ఎనర్జీ వచ్చింది. నెల రోజుల్లో కథ సిద్దం చేశా. 


స్పోర్ట్స్‌ డ్రామా అనగానే  హీరో గెలవడం.. ఓడిపోవడం, చివర్లో మళ్ళీ గెలవడం... ఇదే మీటర్‌ లో వుంటుంది కదా? 

నిజమే. జీరో నుంచి మొదలై హీరో అవ్వడమే అన్ని స్పోర్ట్స్‌  డ్రామాల్లో కనిపిస్తుంది. అయితే ‘గని’ కోసం మేం కొంత స్పెషల్‌ వర్క్‌ చేశాం. స్పోర్ట్స్‌ డ్రామాతో పాటుగా ‘గని’ జీవితంలోని ఘర్షణని ఓ లేయర్‌గా తీసుకున్నాం. అది బాగా కుదిరింది. ఈ కథ రాసుకునే ముందు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ ‘రాకీ’ చూశా. ఓ స్పోర్ట్స్‌ డ్రామాని ఎలా నడిపించారు? మనం కొత్తగా ఏం చేయొచ్చు అనే ఐడియా కోసమే చూశా.


మిమ్మల్ని చూేస్త స్పోర్ట్స్‌ పర్శన్‌ లా వున్నారు. చదువుకునే రోజుల్లో బాగా ఆడేవారా ? 

క్రికెట్‌, షటిల్‌ బాగా ఆడేవాడ్ని. స్కూల్‌ స్థాయిలో చాలా టోర్నమెంట్లలో గెలిచాను. చదువులో మాత్రం బాగా వీక్‌. బ్యాక్‌ బెంచ్‌ స్డూడెంట్‌ అంటారు కదా? నేను ‘బ్యాక్‌ లాగ్‌’ స్డూడెంట్‌ని. తప్పిన పరీక్షలు అన్నేసి ఉండేవి. 


‘గని’ కోసం వరుణ్‌ ని బాక్సర్‌ గా ఎలా ప్రీపేర్‌ చేశారు ? 

వరుణ్‌కి ఎప్పటి నుంచో బాక్సర్‌గా చేయాలని వుంది.  యుఎస్‌లో శిక్షణ పొందారు. గద్దలకొండ గణేష్‌ కోసం దాదాపు పదిహేను కేజీలు పెరిగారాయన. ‘గని’ కోసం అదంతా తగ్గాలి. బాక్సర్‌గా రెడీ అవ్వాలి. దాని కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేసి షూటింగ్‌ సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయానికి కరోనా మొదలైంది. షూటింగ్‌ ఆగిపోయింది. గొప్ప విషయం ఏమిటంటే.. వరుణ్‌ తేజ్‌ ఈ గ్యాప్‌లోనూ బరువు పెరక్కుండా జాగ్రత్త పడ్డారు. ఎంతో డెడికేషన్‌ వుంటే తప్ప అలా చేయలేం. 


మీకు నచ్చిన స్పోర్ట్స్‌ డ్రామా ఏది? 

‘సిండ్రెల్లా మ్యాన్‌’ కథ అద్భుతంగా వుంటుంది. జనాల్లో నుంచి వచ్చిన స్పోర్ట్స్‌ మ్యాన్‌ కథ అది. ‘దంగల్‌’లో అద్భుతమైన స్ర్కీన్‌ ప్లే వుంటుంది. ప్రతి ఫైట్‌ కి అండర్‌ కరెంట్‌ గా ఒక ఎమోషన్‌ లేయర్‌ కనెక్ట్‌ చేసారు. ‘గని’లో కూడా అలాంటి ఎమోషన్‌ లేయర్‌ కనెక్షన్‌ని చూస్తారు.  


ఇంతకీ ఇండస్ర్టీకి ఎప్పుడు వచ్చారు ? 

‘ఆది’ సినిమాకి సహాయ దర్శకుడిగా  పని చేశాను. తర్వాత ఆయన దగ్గరే దిల్‌, చెన్నకేశవరెడ్డి చేశాను. తర్వాత జయంత్‌, లారెన్స్‌, సముద్రఖని, హరీష్‌ శంకర్‌ ఇలా చాలా మంది దగ్గర వర్క్‌ చేశాను. 


రెండు, మూడు సినిమాలకు పని చేసిన తర్వాత ఎవరికైనా డైరెక్టర్‌ అవ్వాలనే ఆశ వుంటుంది. నేను చాలా సీరియస్‌గా మూడేళ్ళు డైరెక్షన్‌ ప్రయత్నాలు చేశా. సినిమా సెట్స్‌ పైకి వెళ్ళిపోతుందనే సమయానికి ఆగిపోయిన సందర్భాలున్నాయి. తిరిగి తిరిగి అలసిపోయి.. మళ్లీ ‘మిస్టర్‌’ సినిమాకి కో డైరెక్టర్‌గా చేరా.  


డైరెక్టర్‌ అయిపోయామనే స్థితి నుంచి మళ్ళీ కో డైరెక్టర్‌ చేయడం అంటే కొంచెం కష్టం కదా?

లేదండీ. నేనెప్పుడూ అలా అనుకోలేదు. ఎక్కడున్నా ఎలా వున్నా అంతిమంగా సినిమాలో వున్నామా లేదా అనేదే ముఖ్యం. నేను మళ్ళీ పనిలో చేరడం బట్టే కదా.. వరుణ్‌ తేజ్‌ గారు పరిచయమై ఓ అవకాశం ఇచ్చారు. 


కష్టం కోడైరెక్టర్‌ ది, క్రెడిట్‌ డైరెక్టర్‌ ది అనే టాక్‌ ఇండస్ర్టీలో వుంది.. దీనిపై మీ అభిప్రాయం?

లేదండీ. దర్శకుడు కథ చెప్పకుండా, నిర్మాత, హీరో లేకుండా కోడైరెక్ట్‌ ఎక్కడి నుంచి వస్తాడు? కేవలం కో డైరెక్టర్‌ని చూసి ఎవరూ సినిమా చేయడానికి ముందుకు రారు. అయితే మొదటి సినిమా చేస్తున్న దర్శకులకు అనుభవం వున్న కోడైరెక్టర్‌ కొంచెం ఎక్కువ ఉపయోగపడతాడు. వారు అనుకున్నది తెరపై చూపించడానికి చాలా వరకూ సపోర్ట్‌ చేస్తాడు. ఇక్కడ కూడా దర్శకుడు తన విజన్‌, ఎమోషన్‌ని స్పష్టంగా చెప్పగలగాలి.


మీ స్వస్థలం ఏది? ఏం చదువుకున్నారు ?

మాది గుంటూరు. కానీపుట్టి  పెరిగింది మాత్రం చెన్నై. బీకామ్‌ రెండో ఏడాదిలో ఉండగానే నాన్నగారు ‘ఆది’ సినిమాలో చేర్చారు. తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశా. 


మీ నాన్నగారు జర్నలిస్ట్‌ కావడం వల్ల ఇండస్ర్టీలో సులభంగా ఎంట్రీ దొరికిందని భావిస్తున్నారా? 

కచ్చితంగా. ఆ రోజుల్లో సినిమా ఇండస్ర్టీ ఇంత ఓపెన్‌ గా లేదు. షార్ట్‌ ఫిల్మ్‌ చేసి అవకాశాల్ని దక్కించుకునే రోజులు కావవి. అందులోనూ వివి వినాయక్‌ గారి లాంటి దర్శకుడి దగ్గర చేరడం అంత సులభం కాదు. మా నాన్నగారి వల్లే నా సినిమా ప్రయాణం ఈజీ అయ్యింది.  


ఈ యేడాదిలోగా ఎలాగైనా డైరెక్టర్‌ అయిపోతా అనే సినిమాటిక్‌ ఛాలెంజులు చేసేవారా?

లేదు. అమ్మానాన్న నుంచి ఎప్పుడూ ఒత్తిడి లేదు. పని చేస్తున్నానా లేదా? అనేదే చూసేవారు. పెళ్లి అయిన తర్వాత కూడా నా భార్య ‘మీరు ఎప్పుడు డైరెక్ట్‌ అవుతారు’ అని ఎప్పుడూ అడగలేదు. నా పని ఎలాంటిదో తనకు అర్థం కావడానికే ఐదేళ్ళు పట్టింది. నేను డైరెక్టర్‌ కావడానికి మోరల్‌ సపోర్ట్‌ చేసిన వ్యక్తి మాత్రం నా భార్యే. డైరెక్టర్‌ గా ప్రయత్నాలు చేసినప్పుడు రెండేళ్ళు అలా ఇంట్లో రాస్తూ కూర్చునే వాడిని. పాపం.. అప్పుడు కూడా నన్ను ఏమీ అనలేదు. ఒక ఆడ పిల్లకి తండ్రిగా ఉండి.. సినిమాల కోసం తిరగడం చాలా కష్టం. తన సపోర్ట్‌ లేకపోతే నేనేం సాధించేవాడ్ని కాదు. 


ఫొటో: లవ కుమార్‌

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.