‘గతం’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2020-11-07T17:36:03+05:30 IST

కోవిడ్‌ నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో సినిమాల విడుదలకు ఓటీటీలే వేదికలయ్యాయి. అనుష్క, కీర్తి వంటి స్టార్స్‌

‘గతం’ మూవీ రివ్యూ

చిత్రం: గతం

విడుదల:  అమెజాన్‌ ప్రైమ్‌

నటీనటులు:  భార్గవ పోలుదాసు, రాకేశ్‌ గలేభె, పూజిత, హర్షవర్ధన్‌, లక్ష్మీ భరద్వాజ్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: మనోజ్‌ రెడ్డి

సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల

నిర్మాతలు: ఎస్‌ ఒరిజినల్స్‌, ఆఫ్‌ బీట్‌ ఫిలింస్‌

దర్శకత్వం:  కిరణ్‌ కొండమడుగుల


కోవిడ్‌ నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో సినిమాల విడుదలకు ఓటీటీలే  వేదికలయ్యాయి. అనుష్క, కీర్తి వంటి స్టార్స్‌ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని ప్రేక్షకులను మెప్పించాయి. కొన్ని నిరాశ పరిచాయి. ఈ క్రమంలో అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఆడియెన్స్‌ ముందుకు వచ్చిన చిత్రం 'గతం'. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన గతం సినిమా మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం...


కథ:

అమెరికాలోని ఓ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరుగుతాయి. అక్కడి నుండి అసలేం జరిగిందనే కోణంలో కథ ప్రారంభమవుతుంది. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న రిషి(రాజేశ్‌)కి మెలకువ వస్తుంది. యాక్సిడెంట్‌ కారణంగా రిషి గతాన్ని మరచిపోతాడు. అయితే అదితి(పూజిత) తన గర్ల్‌ఫ్రెండ్ అని, తను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుందని రిషికి డాకర్ చెబుతాడు. తనొక యాక్సిడెంట్‌ నుండి బయటపడ్డానని రిషికి అదితి ద్వారా తెలుస్తుంది. తండ్రిని కలవడానికి రిషి, అదితి కలిసి బయలుదేరుతారు. ఓ చోట కారు బ్రేక్‌డౌన్‌ అవుతుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తి(భార్గవ్‌) లిఫ్ట్‌ ఇస్తాడు. అప్పటికే చీకటి పడుతుంది. మెకానిక్‌ పొద్దున కానీ రాడు కాబట్టి.. తన ఇంట్లోనే స్టే చేయమని లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తి రిషి, అదితిలకు చెబుతారు. మరో అప్షన్‌ లేకపోవడంతో వారు ఆ ఇంట్లోనే ఉంటారు. కానీ ఆ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు రిషి, అదితిలను ఇబ్బంది పెడతాయి. అనుమానాలు క్రియేట్‌ చేస్తాయి. దాంతో వారు ఇంటి నుండి బయటపడాలనుకుంటారు. కానీ ఇంటి నుండి బయటపడలేరు. అసలు రిషి, అదితిలకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తి ఎవరు?  ఎందుకు వీరిద్దరినీ టార్గెట్‌ చేశాడు. రిషితో ట్రావెల్‌ చేసే గర్ల్‌ఫ్రెండ్ అసలు ఎవరు? రిషి యాక్సిడెంట్‌ ఎలా జరుగుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


విశ్లేషణ:

ఈ మధ్య ఓటీటీలో విడుదలైన నిశ్శబ్దం, మిస్‌ ఇండియా తరహాలో గతం సినిమా కూడా అమెరికా నేపథ్యంలోనే తెరకెక్కింది. అంతా కొత్తవారు సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంతసేపు కొత్తవారు చేసిన సినిమా అనే భావన రాకుండా సినిమాలోకి ఆడియెన్స్‌ను ఇన్‌వాల్వ్‌ చేయించడంలో దర్శకుడు కిరణ్ సక్సెస్‌ అయ్యారు. రివర్స్‌ స్క్రీన్‌ప్లే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. మనం చూస్తున్న సినిమాకు పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. అయితే ఇంటర్వెల్‌ తర్వాతే సినిమాలో అసలు ట్విస్టులు, టర్న్‌లు రివీల్‌ చేసుకుంటూ వచ్చారు. అప్పటి వరకు ఓ కోణంలో సాగిన ఈ సినిమా మరో కోణంలోకి మారుతుంది. దర్శకుడు కిరణ్‌ చెప్పాలనుకున్న విషయాన్ని బాగానే తెరపై ఆవిష్కరించాడు. సినిమా వ్యవథి కూడా ఎక్కువగా లేకపోవడంతో ఆడియెన్‌కు సినిమా బోర్‌ అనే ఫీలింగ్‌ రాదు. థ్రిల్లర్‌ జోనర్‌ అంటే ప్రేక్షకుడిని ఆసక్తిగా సీటులో కూర్చోపెట్టగలగాలి. ఆ విషయంలో దర్శకుడు కిరణ్‌ సక్సెస్‌ అయ్యాడు. మనోజ్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. అమెరికా మంచు కాలంలో తీసిన సినిమా.. కాబట్టి సన్నివేశాలు చూడటానికి ఓ కొత్త అనుభూతిని ఇచ్చాయి. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. ఇక నటీనటుల విషయానికి వస్తే రిషి పాత్రలో చేసిన రాజేష్, భార్గవ్‌ పూజిత చక్కగా నటించారు. ముఖ్యంగా రాజేష్‌ వాయిస్‌ వినడానికి విజయ్‌ దేవరకొండ వాయిస్‌లాగా ఉంది. మిగిలిన పాత్రధారులందరూ వారి  వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. సినిమాలో స్టార్ క్యాస్ట్‌ ఉండుంటే ఇంకా బావుండేదిగా అనిపించింది. ఫస్టాఫ్‌ అంతా కాస్త స్లోగా ఉన్న ఫీలింగ్‌ వస్తుంది.


చివరగా.. ఈ మధ్య ఓటీటీలో విడుదలైన చిత్రాల్లో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన గతం ఆకట్టుకుంటుంది

   రేటింగ్‌: 2.75/5

Updated Date - 2020-11-07T17:36:03+05:30 IST