గమనం... ఓ జీవిత ప్రయాణం

ABN , First Publish Date - 2021-12-05T10:30:05+05:30 IST

‘‘సినిమా లక్ష్యం, లక్షణం ఓ మంచి కథ చెప్పడమే. దాన్ని కమర్షియల్‌గా చెప్పామా? వేరేలా చెప్పామా? అనేది ముఖ్యం కాద’’న్నారు సుజనా రావు. ఆమె దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం ‘గమనం’...

గమనం... ఓ జీవిత ప్రయాణం

‘‘సినిమా లక్ష్యం, లక్షణం ఓ మంచి కథ చెప్పడమే. దాన్ని కమర్షియల్‌గా చెప్పామా? వేరేలా చెప్పామా? అనేది ముఖ్యం కాద’’న్నారు సుజనా రావు. ఆమె దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం ‘గమనం’. శ్రియ, శివ కందుకూరి, నిత్యమీనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుజన మాట్లాడుతూ ‘‘గమనం.. ఓ జీవిత ప్రయాణం. పుట్టుక నుంచి మరణం వరకూ ఉండే మజిలీలను వివిధ పాత్రల ద్వారా చూపిస్తున్నాం. నా జీవిత అనుభవాల నుంచి రాసుకున్న కథ ఇది. స్ర్కిప్టు రాస్తున్నప్పుడు శ్రియని దృష్టిలో పెట్టుకోలేదు. ఓ కథగా రాసుకున్నా. శ్రియకు కథ చెబుతున్నప్పుడు మాత్రం ‘నా కమల తనే’ అనిపించింది. ఈ సినిమాకి ఇళయరాజా గారు దొరకడం ఓ అదృష్టం. నేను ఆయనకు వీరాభిమానిని. ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్నా. కానీ ఆయనతో పనిచేయడం గొప్ప వరం. ‘ఈ సినిమాకి నేనే ఎందుకు సంగీతం అందించాలి’ అని ఆయన అడిగారు. ‘మీరు తప్ప నా దృష్టిలో ఎవరూ లేరు’ అని చెప్పా. సగం కథ చెప్పగానే... ‘లే... ఇక చాలు.. మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. అదే పెద్ద కాంప్లిమెంట్‌. చారు హాసన్‌, ఇళయరాజా, జ్ఞానశేఖర్‌ లాంటి వాళ్లు నా తొలి సినిమాకే దొరడం కేవలం నా అదృష్టం’’ అన్నారు. తన గురించి చెబుతూ ‘‘మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో రకరకాల వ్యక్తులు. ఒకొక్కరిదీ ఒక్కో కథ. నేను కలిసిన మనుషుల వల్ల కూడా కొత్త విషయాలు తెలుసుకున్నా. ఇవన్నీ చెప్పాలనిపించింది. అందుకే దర్శకత్వం వైపు వచ్చా. నేను ఇదివరకు కొన్ని డాక్యుమెంటరీలు తీశా. అయితే సినిమా వేరు, డాక్యుమెంటరీ వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. కాకపోతే... నా ఫోకస్‌ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంది. రెండో సినిమాకి సంబంధించిన కథ కూడా తయారైంది. త్వరలోనే ఆ వివరాలు చెబుతా’’ అన్నారు. 


Updated Date - 2021-12-05T10:30:05+05:30 IST