సినిమా రివ్యూ: హీరో

ABN , First Publish Date - 2022-01-15T21:14:11+05:30 IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి పండగ సందర్భంగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఫస్ట్‌ కాపీ చూసిన మహేష్‌ బాబు సినిమా తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. మరి ‘హీరో’గా మహేశ్‌ మేనల్లుడు మెప్పించాడా లేదా అన్నది రివ్యూలో తెలుసుకుందాం.

సినిమా రివ్యూ: హీరో

సినిమా: హీరో

విడుదల తేది: 15–01–2022

నటీనటులు: అశోక్‌ గల్లా, నిధీ అగర్వాల్‌, జగపతి బాబు, నరేష్‌, రవికిషన్‌, ‘వెన్నెల’ కిషోర్‌, బ్రహ్మాజీ, సత్య తదితరులు 

కెమెరా: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ ప్రసాద్‌

ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి

సంగీతం: జిబ్రాన్‌ 

నిర్మాత: పద్మావతి గల్లా

కథ, స్ర్కీన్‌ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య


సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి పండగ సందర్భంగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఫస్ట్‌ కాపీ చూసిన మహేష్‌ బాబు సినిమా తనకు  ఎంతో నచ్చిందని చెప్పారు. మరి ‘హీరో’గా మహేశ్‌ మేనల్లుడు మెప్పించాడా లేదా అన్నది రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: 

అర్జున్‌ (అశోక్‌ గల్లా) సినిమా హీరో కావాలని పయత్నాలు చేస్తుంటాడు. తను ఉండే అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా దిగిన సుభద్ర (నిదీ అగర్వాల్‌)తో ప్రేమలో పడతాడు. ముంబై నుంచి వచ్చిన సుభద్ర తండ్రి (జగపతి బాబు)కు హీరోగా ట్రై చేస్తున్న అర్జున్‌కు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడు. మరోపక్క సుభద్ర తండ్రిని చంపాలంటూ హైదరాబాద్‌ మాఫియాకు ఖబర్‌ అందుతుంది. ముంబైలో మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ అయిన సలీమ్‌ (రవికిషన్‌) గన్‌ అర్జున్‌ దగ్గరకు చేరుతుంది. దానితో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. సుభద్ర తండ్రిని ఎందుకు చంపాలనుకున్నారు? అతను ముంబైలో ఏం చేశాడు? అర్జున్‌ అతన్ని ఎలా కాపాడాడు అన్నది కథ. 




విశ్లేషణ: 

పరిచయ చిత్రం అనగానే చాలామంది హీరోలు యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే లవ్‌స్టోరీలు, కమర్షియల్‌ కథలు ఎంపిక చేసుకుంటారు. కానీ అశోక్‌ అన్ని కోణాల్లోనూ ఆలోచించి ప్రేమకథ, యాక్షన్‌, కమర్షియల్‌ హంగులు ఉన్న కథను ఎంచుకున్నారు. పరిచయ చిత్రానికి ఎలివేషన్‌ ఎలా ఉండాలో చక్కగా ప్లాన్‌ చేసుకున్నారు. సింపుల్‌ కథకు కాస్త కామెడీని జోడించి హీరో ఎలివేషన్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టారు దర్శకుడు. అయితే ప్రథమార్థంలో అలరించే కథ ఏమీ లేదు. హీరోహీరోయిన్‌ మధ్య సన్నివేశాలు, కుటుంబ సభ్యుల సీన్లతో సాగిపోయింది.సెకెండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. అయితే ఫస్టాఫ్‌ సాగినంత వేగంగా సెకెండాఫ్‌ సాగలేదనే భావన కలుగుతుంది. జగపతిబాబు ఎంట్రీ, అతని నేపథ్యం గురించి ముందే క్లారిటీ ఇచ్చి ఉంటే బావుండేది. మొదట అతనేదో మాఫియా డాన్‌లా బిల్డప్‌ ఇచ్చి.. చివరకు అతనుకు కూడా హీరో కావాలనే ప్రయత్నాలతో బాధ్యతల రీత్యా సర్దుకుపోవాల్సి వచ్చిందని చూపించారు. ఆ సన్నివేశాలు కాస్త హాస్యాస్పందగా అనిపిస్తాయి. అక్కడక్కడా రెండు, మూడు ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఆకట్టుకుంటాయి. సెకెండాఫ్‌ వేగంగా సాగి ఉంటే బాలెన్స్‌ అయ్యేది. 


ఇక నటీనటుల విషయానికొస్తే.. గల్లా అశోక్‌ హీరోగా మెప్పించాడు. నటనతోపాటు డాన్స్‌లు, యాక్షన్‌ సన్నివేశాల్లో అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. నిధీ అగర్వాల్‌ గ్లామర్‌ సినిమాకు ప్లస్‌ అయింది. జగపతిబాబు, కౌసల్య, రవికిషన్‌ పాత్రల మేరకు నటించారు.  క్లైమాక్స్‌లో బ్రహ్మాజీ పాత్ర. గోపీచంద్‌ ‘లౌక్యం’లో 30 ఇయర్స్‌ పృథ్వీ పాత్రను గుర్తు చేస్తుంది. ర్యాప్‌ సింగర్‌గా సత్య పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. వెన్నెల కిశోర్‌ పాత్ర కూడా సోసోగా ఉంది. అనిల్‌ రావిపూడి సీన్‌ నవ్వులు పూయించింది. జిబ్రాన్‌ సంగీతం ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. టెక్నికల్‌ వాల్యూస్‌, నిర్మాణ విలువలు బావున్నాయి. హీరోకి ఎలివేషన్‌ కావలసిన ప్రతి సందర్భంలోనూ కృష్ణ, మహేశ్‌బాబు సినిమాల్లో సన్నివేశాలను చూపించారు. ఆ డోస్‌ కాస్త ఎక్కువ కావడం ఓవర్‌ అనిపించినా అభిమానులకు మాత్రం కనులవిందుగా ఉంటుంది. అయితే గల్లా అశోక్‌కి ‘హీరో’ మంచి లాంచ్‌ అనే చెప్పవచ్చు. కొంచెం కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ను ఇష్టపడేవారికి ఈ చిత్రం మంచి టైమ్‌ అవుతుంది. 


ట్యాగ్‌లైన్‌: హీరో’ మెప్పిస్తాడు!

Updated Date - 2022-01-15T21:14:11+05:30 IST