టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి (Sai pallavi) నటించిన ‘గార్గి’ (Gaargi) కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మెండుగా అందుకుంది. ‘గార్గి’ గా ఆమె అభినయం అద్భుతమని పేరొచ్చింది. గౌతమ్ రామచంద్రన్ (Gowtham Ramachandran) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాళీ వెంకట్ (Kali venkat), ఐశ్వర్యా లక్ష్మి (Ishwarya Lakshmi) ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. స్ట్రైట్ నెరేషన్ తో తెరకెక్కిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒక మైనర్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేస్ లో గార్గి తండ్రి ప్రధాన నిందితుడిగా ఆరెస్ట్ అవుతాడు. ఒక రాత్రిలో అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనకి షాకయిన గార్గీ .. ఇందులో తన తండ్రి అమాయకుడని నమ్ముతుంది. ఆయన ఈ కేసులో నిర్దోషిగా నిరూపించేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ క్రమంలో ఒక లాయర్ సహాయం తీసుకుంటుంది. చివరికి గార్గి తండ్రి నిర్దోషిత్వం ఎలా నిరూపితమైంది అన్నదే మిగతా కథ.
‘గార్గి’ పాత్రకి సాయిపల్లవి నూటికి నూరు శాతం చేసినప్పటికీ .. థియేటర్స్లో మాత్రం నిలబడలేకపోయింది చిత్రం. అందుకే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారని టాక్. ఆగస్ట్ రెండో వారంలో ‘గార్గి’ చిత్రం సోనీలివ్ (Sony Liv) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందట. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో రీచ్ ఎక్కువ ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ సాయిపల్లవి లాంటి టాలెంటెడ్ నటీమణి చిత్రం కావడం ఇంకా అడ్వాంటేజ్ కానుంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘విరాటపర్వం’ (Virataparvam) చిత్రం కూడా థియేటర్స్లో సరిగా ఆడలేదు. అయితే ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ‘గార్గి’ మూవీ కూడా ఆ తరహాలోనే రెస్పాన్స్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.
బ్లాకీ, జెనీ అండ్ మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాన్ని కన్నడలో పరంవా స్టూడియోస్, తమిళంలో 2డి ఎంటర్ టైన్ మెంట్స్, తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్ (Suresh Productions) వారు విడుదల చేశారు. స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించడం తగ్గించి, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రధాన్యతనిస్తున్న సాయిపల్లవి.. ఇటీవల వరుసగా పరాజయాలు ఎదుర్కోవడం గమనార్హం. మరి తదుపరి చిత్రాలతో అయినా ఆమె మంచి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.