‘గాలి సంపత్‌’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-03-10T05:30:00+05:30 IST

గాలి సంపత్‌ రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ కాదని లోగడ దర్శకనిర్మాత అనిల్‌ రావిపూడి చెప్పకనే చెప్పాడు. మాస్‌మసాలా ఎలిమెంట్స్, ఐటమ్‌ సాంగ్స్ ఇలాంటివేవీ లేని సినిమా

‘గాలి సంపత్‌’ మూవీ రివ్యూ

చిత్రం: 'గాలి సంపత్‌'

నటీనటులు: న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు 

క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,

ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,

సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,

సంగీతం: అచ్చురాజ‌మ‌ణి,

ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,

బ్యానర్స్‌: ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌, షైన్ స్క్రీన్స్;

నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,

స్క్రీన్‌ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,

ద‌ర్శ‌క‌త్వం: అనీష్


గాలి సంపత్‌ రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ కాదని లోగడ దర్శకనిర్మాత అనిల్‌ రావిపూడి చెప్పకనే చెప్పాడు. మాస్‌మసాలా ఎలిమెంట్స్, ఐటమ్‌ సాంగ్స్ ఇలాంటివేవీ లేని సినిమా గాలి సంపత్‌. టూకీగా చెప్పాలంటే ఇది ఒక విధివంచితుడి కథ. ఇటువంటి బరువైన కథని, గడచిన నలభై ఏళ్ళుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నవ్వులపువ్వులు పూయిస్తూ, హెల్దీ ఎంటరైన్మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలబడ్డ డాక్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తన భుజాల మీద మోసుకెళ్లిన సినిమా. తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోయే సినిమా గాలి సంపత్‌. ప్రపంచ భాషా చిత్రాల పరిశ్రమలకి తెలుగులో రాజేంద్రప్రసాద్‌ అనే గొప్పనటుడున్నాడని, భావితరాలకు తెలుగు సినిమా గర్వంగా చూపించుకోగలిగే సినిమా.. గాలి సంపత్‌. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలియాలంటే.. పూర్తి సమీక్ష చదవాల్సిందే.


కథ

సినిమా ప్రారంభమయ్యేసరికి గాలిసంపత్‌ ఓ నాటకాలరాయుడిగా ప్రత్యక్షమవుతాడు. అతనికి మాటరాదు. గొంతు లేదు. పక్కనే తాను చిన్ననాటి నుంచి పెంచుకున్న ఓ పాత్ర గాలి సంపత్‌ ఉచ్ఛరించే ఫఫ్‌ఫ భాషకి డబ్బింగ్‌ చెబుతుంటాడు. అదో కొంత సేపు ఎంటర్‌టైనింగ్‌గానే సాగుతుంది. తన ప్రవర్తన కారణంగా కొడుకు కోపానికి గురవుతుంటాడు గాలిసంపత్‌. ట్రక్ డ్రైవర్‌గా అరకు వేలీలో పని చేసుకుంటుండగా, ఆ ఊరి సర్పంచ్ కూతురితో ప్రేమలో పడతాడు కొడుకు. అయితే కొడుకు ఓ ట్రక్ కొనుక్కుని జీవితంలో స్థిరపడాలని ఆశ పడుతున్నాడని గ్రహించిన గాలి సంపత్‌ ఎలాగైనా దానికి కావాల్సిన ఐదు లక్షలు ఏర్పాటు చేయాలని గట్టి పట్టుదలతో ఉండగా.. పరిషత్తు పోటీ ప్రకటన వెలువడుతుంది. అందులో ప్రథమ బహుమతి గెలుచుకుంటే ఎనిమిది లక్షలు బహుమతిగా వస్తుందని గాలి సంపత్‌ తెగ ఆరాట పడతాడు. అందు కోసం ముందుగా ఐదు లక్షలు అడ్వాన్స్‌గా చెల్లిస్తే, ఆ షో స్లాట్‌ ఇచ్చేస్తానని నాటకాల కాంట్రాక్టర్‌ మాటలు నమ్మి, కొడుకు దాచుకున్న ఐదు లక్షలు గాలి సంపత్‌ దొంగిలిస్తాడు. కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్ళిని కూడా.. తెలియక గాలి సంపతే చెడగొడతాడు. ఇలా తెలియక చేసినవి కొన్ని, తెలిసి చేసినవి కొన్ని తప్పులతో కొడుకు కోపానికి గురవుతాడు. ఆ సందర్భంలోనే ఇంటిముందు ఉన్న నూతిలో పడిపోతాడు. పోతే పోయాడులే పీడ విరగడ అయిపోయిందని కొడుకు అనుకుంటున్న సందర్భంలో గాలిసంపత్‌ చిన్ననాటి స్నేహితుడి ద్వారా తన తండ్రి తనకోసం చిన్ననాటి నుంచి ఎంత, ఎలా త్యాగం చేసుకున్నాడని తెలుసుకున్న కొడుకు.. తండ్రి గురించి వెతుకులాట మొదలు పెడతాడు. అసలీ గాలి సంపత్‌ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? అతనికి గొంతు, మాట ఎలా పోయాయి? వర్షం అంటే అతనికి ఎందుకు కక్ష? చివరికి కొడుకు తండ్రి ఎలా ఒకటయ్యారు? అనేదే గాలి సంపత్‌ కథ.


విశ్లేషణ

సినిమా ప్రారంభమవుతూనే రాజేంద్రప్రసాద్‌ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే ప్రారంభమవుతుంది. అరకు అందాలలో ఇటువంటి కొత్త కథ... అనిల్‌ రావిపూడి లాంటి అద్భుతమైన ప్రయోక్త, రచయిత స్టాంపు తేటతెల్లంగా ప్రతీసీనులోనూ కనబడుతూ, విచిత్రమైన పాత్రలతో కథ ముందుకు అలవోకగా సాగిపోతూ.. ఎక్కడా బోరన్నది లేకుండా, చకచకా సాగిపోయే స్ర్కీన్‌ప్లేతో ఆసక్తిదాయకంగా నడిచింది సినిమా. ప్రతీ సీను రక్తి కట్టడానికి అనిల్‌ రావిపూడి తీసుకున్న నేచురల్‌ కేర్‌ ఎంతో ఉపయోగపడింది. ఏ సీనూ కథ నుంచి దూరంగా జరిగి ఎటో పోకుండా కథని ముందుకు తీసుకుపోయే ఒక వాహనంలాగే ఉన్న కారణంగా ప్రేక్షకులకి కూడా సినిమాతో ప్రయాణం సాఫీగా, చలాగ్గా వెళ్ళిపోయింది. ఇటువంటి బరువైన కథని చాలా సున్నితంగా సీన్‌ బై సీన్‌ ట్రీట్‌ చేసిన స్టయిల్‌ కొత్తగా ఉంది. కొన్ని సీన్లయితే జరుగుతుంటే థియేటర్‌లో పిండ్రాప్‌ సైలెన్స్ కంటిన్యూ అయింది. పాత్రల మధ్య నుంచి, సన్నివేశాల ద్వారా కథ అసలు రూపం ఓపెన్‌ అవుతుంటే ప్రేక్షకులు తెలియకుండానే అలజడికి లోనై, అది కూడా ఓ రకమైన ఉత్కంఠతో సినిమా నడవడం అన్నదే ఇందులో మెయిన్‌ ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్. ఇందులో వర్షం ఓ పాత్ర, వాకిట్లో బావి ఓ పాత్ర.. ఈ రెండే ముఖ్యమైన యాక్టివ్‌ అండ్‌ కీ రోల్స్. ప్రతీ ఫ్రేం, ప్రతీ యాంగిల్‌ కథలో గానీ, పాత్రలలో గానీ.. ఎమోషన్‌ని ఎంతో బ్యాలెన్స్‌గా మోసుకెళ్ళాయి. అందుకే ఫస్టాఫ్‌ కాగానే ఇంటర్వెల్‌లో మాటలు, స్క్రీన్‌ప్లే అనిల్‌ రావిపూడి అని గర్వంగా వేసుకోగలిగాడు అనిల్‌ రావిపూడి. సెకండాఫ్ ప్రారంభమవుతుంటే ఏ ఒక్క సీన్‌ని మిస్‌ అవడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండరు. అదీ ఫస్టాఫ్ ఇంపాక్ట్. అనిల్‌ ముందుగానే చెప్పినట్టుగా ఇదో ఇంగ్లీష్‌ కైండాఫ్‌ ఫిల్మ్. ఇలాంటి సినిమాలు చేయడానికో, తీయడానికో ఎవరూ సాహసించరు. కానీ అనిల్‌ రావిపూడి అండ్‌ టీం చేసిన సాహసం తెలుగు పరిశ్రమకు ఓ మచ్చుతునకను మిగిల్చింది. 


నటీనటులు

నటీనటులు అని సాగదీయక్కర్లేని, ఆ అవసరం లేని సినిమా గాలి సంపత్‌. ఇది పూర్తిగా రాజేంద్రప్రసాద్‌ విశ్వరూపం. ఆయన పెరఫారమెన్స్ పరంగా చెప్పాలంటే.. ఈ సినిమా రాజేంద్రప్రసాద్‌ తెరిచిన మూడోకన్ను. కొన్ని సీన్స్‌లో రాజేంద్రప్రసాద్‌ ఫీలింగ్స్, ఎమోషన్స్ తెరమీద చూస్తుంటే వారేవా అనిపించకమానదు. ఎంతటి మహానటుడు రాజేంద్రప్రసాద్‌ అన్న ఫీలింగ్‌కి గురి చేయని సీనే లేదు సినిమాలో. గాలిసంపత్‌ పాత్ర రాజేంద్రప్రపాద్‌కి ఋణపడింది. రాజేంద్రప్రసాదే కాకుంటే... ఈ సినిమాని ఊహించుకోలేం.. ఆ పాత్రనీ అందుకోలేం. తన వైశాల్యాన్ని మొత్తం పాత్ర మీద ఒలకబోసి, సినిమాలో వర్షం మాట అటుంచి, రాజేంద్రప్రసాద్‌ అనే అభినయ ఆకాసం నుంచి కురిసిన ఆయన ప్రతిభ అనే జడివానలో సినిమా మొత్తం తడిసిపోయింది. సాధారణంగా పాత్రని ఎన్‌లార్జ్‌ చేసి, వర్కౌట్‌ చేసే రాజేంద్రప్రసాద్‌.. గాలి సంపత్‌ పాత్రని ఎంతో కంట్రోల్‌ చేసి, తన కొలతలలోకి కుదించి, అవసరమైనప్పుడు పెంచి ఎంత అద్భుతంగా రక్తి కట్టించాడో చెప్పాలంటే మాటలు సరిపోవు... సినిమా చూడాల్సిందే. గాలి సంపత్‌ చూసిన ఏ ప్రేక్షకుడు కూడా ఏదో గాలి సినిమా చూశాంలే అనే విచ్చలివిడితనానికి రాజేంద్రప్రసాద్‌ అస్సలు తావే ఇవ్వలేదు. కూర్చోబెట్టాడు, నవ్వించాడు, ఏడ్పించాడు... తన ఇష్టమే అంతా. మొత్తం సినిమా అంతా రాజేంద్రప్రపాద్‌కి ఓ ప్లేగ్రౌండ్‌లా మారిపోయింది. మొదట నుంచి చివరివరకూ ఆడుకున్నాడు. మిగతా పాత్రలంటారా.. అన్నీ బాగున్నాయి కథకి సంబంధించిన వరకూ. అన్ని పాత్రలు కూడా గాలిసంపత్‌ అనే పాత్ర ఒళ్ళోనే ఒదిగిపోయాయి. దానికి కారణం రాజేంద్రప్రసాద్‌. ఆయన పండించే ఎమోషన్‌లో సినిమా బరువెక్కుతున్న పాయింట్స్‌లో అనిల్‌ రావిపూడి మేచ్‌ చేసిన ఎంటర్‌టైనింగ్‌ సీన్స్ అన్నీ ఆహ్లాదంగా ఉన్నాయి. 


ఫైనల్‌ కామెంట్

గాలి సంపత్‌ సినిమా ఇటువంటి సినిమాలు కూడా తీయొచ్చు అన్న ధైర్యాన్ని పరిశ్రమకి తప్పకుండా ఇస్తుంది. అటువంటివి చేయడానికి రాజేంద్రప్రసాద్‌ అనే అభినయ అక్షయపాత్ర ఒకటుందనే భరోసాని కల్పిస్తుంది. గ్యారెంటీగా చూడాల్సిన సినిమా. అచ్చు రీరికార్డింగ్‌ సినిమాకి ప్రాణం పోసింది. కెమెరా వర్క్‌ కూడా సినిమాని పర్‌ఫెక్టుగా ఎలివేట్‌ చేసింది.    

Updated Date - 2021-03-10T05:30:00+05:30 IST