
‘విక్రమ్’ చిత్రం సూపర్ సక్సెస్ కావడంతో విశిష్ట నటుడు కమల్‌హాసన్ దూకుడు మీద ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్డడంతో పాటు పలు కారణాల వల్ల ఆగిపోయిన ‘భారతీయుడు 2’ చిత్రం మీద ఆయన దృష్టి పెట్టారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ విషయాన్ని కమల్ వెల్లడించలేదు. ఆ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ మగబిడ్డకు జన్మ ఇచ్చారు కాజల్. ఈ కారణంగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న ఆమె తిరిగి ‘భారతీయుడు 2’తో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘భారతీయుడు 2’ షూటింగ్ సెప్టెంబర్ 13న ప్రారంభమవుతుందనీ, ఈ షెడ్యూల్లోనే తను తిరిగి సెట్స్ పైకి అడుగుపెడుతున్నట్లు కాజల్ చెప్పారు. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘భారతీయుడు 2’ షూటింగ్ 2019 జనవరిలో మొదలైంది. ఇప్పటికి 70 శాతం వర్క్ పూర్తయింది. సెట్లో ప్రమాదం జరిగి కొంతమంది యూనిట్ సభ్యులు చనిపోవడం, నిర్మాత దర్శకుల మధ్య విభేదాలు, కొవిడ్ తదితర కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. సుకన్య, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.