దేశీ తెరపై విదేశీ అందాలు

అందం, అభినయానికి తోడు కష్టపడే స్వభావం ఉండాలే గానీ కథానాయికలుగా సినిమాల్లో అవకాశాలకు కొదవలేదు. స్థానికంగా జన్మించకపోయినా తమ ప్రతిభతో బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ అవకాశాలను ఒడిసిపడుతున్నారు విదేశీ కథానాయికలు. పలు భాషల్లో దేశీ తెరపై విదేశీ అందాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.  


తెలుగులో పవన్‌, క్రిష్‌ చిత్రంలో- జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ 

పలు బాలీవుడ్‌ చిత్రాల్లో కథానాయికగా నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు కథానాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. ఆమె స్వస్థలం శ్రీలంక. 2006లో మిస్‌ యూనివర్స్‌ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంకలో టీవీ రిపోర్టర్‌గానూ ఆమె పనిచేశారు. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం బాలీవుడ్‌ గడప తొక్కారు. 2011లో వచ్చిన ‘మర్డర్‌ 2’ చిత్రంతో ఆమె తొలి  సక్సె్‌సను అందుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె కెరీర్‌ వేగం పుంజుకుంది. ప్రస్తుతం హిందీలో ఐదు చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో ఆమె కీలకపాత్రలో నటిస్తున్నారు. 
అమెరికా అమ్మాయి - అనుఇమ్మాన్యుయేల్‌

అమెరికాలోని చికాగోలో జన్మించారు అనూ ఇమ్మాన్యుయేల్‌. డల్లాస్‌, టెక్సా్‌సలో చదువుకున్నారు. స్కూల్‌ రోజుల నుంచి ఆమెకు నటనపై ఆసక్తి.  2011లో ‘స్వప్న సంచారి’ అనే మలయాళ చిత్రంలో తొలిసారి అవకాశం అందిపుచ్చుకున్నారు. తర్వాత నానీ హీరోగా నటించిన ‘మజ్ను’ చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌ లాంటి పలువురు అగ్ర హీరోల సరసన కథానాయికగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ‘మహా సముద్రం’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. 
ఆర్‌ఆర్‌ఆర్‌ - ఒలివియా మోరీస్‌ 

ఇంగ్లీష్‌ నటి ఒలివియా మోరీస్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె బ్రిటిష్‌ మహిళ జెన్నిఫర్‌ పాత్రలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. అక్కడ రంగస్థల నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఒలివియాను రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం తీసుకున్నారు. అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒలివియా నటనతోనూ ఆకట్టుకుంటే ఇక్కడ ఆమెకు తిరుగుండదు అంటున్నారు విశ్లేషకులు. 

శ్రీలంక మిస్‌ బ్యూటీ   - లోస్లియా 

తమిళ మూలాలున్న శ్రీలంకన్‌ యువతి నటి లోస్లియా. తమిళ బిగ్‌బాస్‌ 3 రన్నర్‌పగా నిలిచారు. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం క్రికెటర్‌ - హర్బజన్‌ సింగ్‌ కథానాయకుడుగా తెరకెక్కుతోన్న బహుభాషా చిత్రం ‘ఫ్రెండ్‌షి్‌ప’లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.  
సెర్బియా స్టార్‌ - నటాసా స్టాన్‌కోవిక్‌ 

సెర్బియన్‌ డ్యాన్సర్‌, మోడల్‌ నటాషా స్టాన్కోవిక్‌ బాలీవుడ్‌లో కెరియ ుర్‌ను వెతుక్కుంటూ ఇండియాకు వచ్చారు. ‘సత్యాగ్రహ’ చిత్రంతో బాలీవుడ్‌ అరంగేట్రం చేశారు. గతేడాది క్రికెటర్‌ హార్థిక్‌ పాండ్యాను పెళ్లి చేసుకొని ఓ బాబుకు జన్మనిచ్చారు. అయినా ఆమె ఆకర్షణ తగ్గలేదు. ఇప్పటికీ పలు హిందీ చిత్రాలు, వెబ్‌ సిరీ్‌సలు, టీవీషోలతో బిజీగా ఉన్నారు. 


న్యూజిలాండ్‌ గర్ల్‌  - షిర్లీ సేతియా

 డామన్‌లో జన్మించిన షిర్లీ సేతియా పెరిగిందంతా న్యూజిలాండ్‌లోనే. సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు ఆమె తెలిసే ఉంటారు. నటిగా, గాయనిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఆక్లాండ్‌ యూట్యూబ్‌ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘మస్కా’తో కథానాయికగా ఆమె అరంగేట్రం చేశారు. ప్రస్తుతం షిర్లీ సేతియా నాగశౌర్య సరసన ఓ తెలుగు చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. 

కొరియన్‌ బేబీ  - బే సూజి 

కొరియన్‌ నటి బే సూజిని కథానాయికగా పరిచయం చేసేందుకు దర్శకుడు శంకర్‌ రంగం సిద్ధం చేశారని సమాచారం. రామ్‌చరణ్‌ కథానాయకుడుగా ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రంలో బే సూజిని ఓ కథానాయికగా ఎంపిక చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బే సూజీ కూడా ఇంటర్వ్యూలో తాను భారతీయ చిత్రాల్లో నటించనున్నట్టు అప్పట్లో ప్రకటించారు.

- వీరితో పాటు  బ్రిటిష్‌ మూలాలున్న నటి కట్రినా కైఫ్‌. ప్రస్తుతం ఎంప్లాయ్‌మెంట్‌ వీసా తీసుకొని బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నారు. మరో బాలీవుడ్‌ నటి అమీ జాక్సన్‌ కూడా బ్రిటిష్‌ యువతే. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.