ఫ్లాటు.. డూప్లికేటు!

  • చిత్రపురిలో అనర్హులకు కేటాయింపులు
  • సినీ కార్మికుల నుంచి లక్షలు వసూలు
  • అప్పులు చేసి చెల్లించిన వందల మంది
  • వారికి ఖరారైన ఫ్లాట్లు సైతం ఇతరులకు
  • ఒక్కో ఫ్లాటు ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్‌
  • ఇప్పటికే 700 మంది వరకూ ఇతరులు?
  • పాలక మండలి సభ్యుల అక్రమాలు
  • ఫ్లాట్‌ లేదనడంతో కార్మికుల కన్నీటిపర్వం


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన నంబర్‌ వన్‌ సినిమాలో మన్నె వనజ బాలనటిగా పరిచయమయ్యారు. హలో బ్రదర్‌, అత్తాకోడలు, లక్కీచాన్స్‌, శ్రీరామరాజ్యం.. ఇలా సుమారు 40 సినిమాల్లో నటించారు. 110కిపైగా సీరియల్స్‌లోనూ ఆర్టిస్టుగా పని చేశారు. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సినీ ఆర్టిస్టుగా ఉన్న వనజకు 1996లోనే ఆమె తండ్రి ఏపీ సినీ వర్కర్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వం తీసుకున్నారు. సుమారు 3 వేల వరకు చెల్లించారు. వారికి సభ్యత్వ నంబర్‌ 3163 వచ్చింది. 2010 వరకు ఫ్లాట్‌ ధరలో 25% చెల్లించారు. దాంతో, వనజ పేరిట ఎంఐజీ బ్లాక్‌-3లోని ఐదో అంతస్తులో ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ ఎం-3-501ను ఖరారు చేశారు. ఈ మేరకు అప్పటి పాలకమండలి ఆర్డర్‌ కాపీ ఇచ్చింది. ఈశాన్యంలో ఉండే 501వ నంబర్‌ ఫ్లాట్‌ను వనజ తండ్రి ఏరికోరి ఎంచుకున్నారు. 2006 నుంచి 2018 వరకు విడతల వారీగా సుమారు రూ.17 లక్షలు చెల్లించారు. ఫ్లాట్‌ చేతికందనే లేదు. వనజ తండ్రి కాలం చేశారు. ఇంతలోనే, ఆమెకు ఖరారు చేసిన ఫ్లాట్‌ జాబితాలో సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు చేరాయి. ఓ జాబితాలో ఆ ఫ్లాట్‌ ప్రవీణ్‌ అనే వ్యక్తి పేరిట ఉండగా, మరో జాబితాలో రఘురాం, ఇంకో జాబితాలో ప్రభాకర్‌ పేరిట ఖరారు చేసినట్లు ఉంది. ఆందోళన చెందిన ఆమె పాలక మండలిని ఆశ్రయించారు. ఏదో ఒక ఫ్లాట్‌ ఇస్తామని ఆమెకు చెప్పారు. తన తండ్రి ఎంపిక చేసిన ఈశాన్య ఫ్లాట్‌నే తనకు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.


చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో ఇటువంటి అక్రమాలు ఎన్నో. ఇప్పటికే ఫ్లాట్‌ ఖరారైన వారిలో అత్యధికుల పేర్లు మారిపోయాయి. గతంలో ఫ్లాట్‌ ఖరారు చేస్తూ ఇచ్చిన ఆర్డర్‌ కాపీలన్నీ చిత్తు కాగితాలవుతున్నాయి. దీంతో.. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు రాత్రనక, పగలనక కష్టపడి పోగు చేసుకున్న సొమ్ముతో ఎన్నో ఏళ్ల కల నెరవేరుతుందని ఆశ పడిన వారికి నిరాశ మిగులుతోంది.

25 శాతం చెల్లిస్తే ఫ్లాట్‌ ఖరారు

సినీ కార్మికుల సొంతింటి కలను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 1994లో నామమాత్రపు ధరకు 67.16 ఎకరాల స్థలం ఇచ్చింది. ఇందులో భవన నిర్మాణాలు చేయడానికి ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ, రో-హౌస్‌, హెచ్‌ఐజీ, డూప్లెక్స్‌ పేరిట మొత్తం 4,213 ఫ్లాట్లను డిజైన్‌ చేశారు. వాటిని కొనుగోలు చేసే సామర్థ్యం కలిగినవారు తొలుత 25ు చెల్లించి, బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఇలా చెల్లించిన కార్మికులకు 2010-15 వరకు విడతల వారీగా అప్పటి పాలక మండలిలు ఫ్లాట్లను ఖరారు చేస్తూ ఆర్డర్‌లు ఇచ్చాయి. అందులో ఫ్లాట్‌ ధర, అప్పటి వరకు సభ్యుడి చెల్లింపులు, ఇంకా చెల్లించాల్సిన మొత్తం వివరాలున్నాయి. భవిష్యత్తులో చెల్లించాల్సిన వివరాలు కూడా పొందుపరిచారు. ఇలా ఇప్పటికే 2,632 ఫ్లాట్లలో కొందరు గృహ ప్రవేశం చేశారు. ఇంకా 1,581 ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా పాలక మండలి ఏర్పాటైన ప్రతి సందర్భంలోనూ హౌసింగ్‌ సొసైటీలో సభ్యులు పెరుగుతూ వచ్చారు.


ఖరారైన ఫ్లాట్లు సైతం ఇతరులకు..

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలోని ఫ్లాట్లన్నీ 2015 నాటికే సినీ కార్మికులకు ఖరారయ్యాయి. అప్పటి నుంచి కొన్ని నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పాలక మండలి నిర్ణయించిన విధానం ప్రకారం ఎవరైనా చెల్లింపులు చేయడంలో ఆలస్యమైతే, వారి ఫ్లాట్‌ను ఇతరులకు కేటాయిస్తున్నారు. కొందరు పక్కాగా చెల్లింపులు చేస్తున్నారు. వారి ఫ్లాట్లను కూడా ఇతరులకు కేటాయించేస్తున్నారు. డైరెక్టర్‌, కెమెరామన్‌గా ఉన్న దసిక రామమోహన్‌కు హెచ్‌ఐజీ బ్లాక్‌-5లోని 701 నంబర్‌ ఫ్లాట్‌ ఖరారు చేస్తూ 2010లోనే పాలక మండలి ఆర్డర్‌ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఆయన సుమారు రూ.21 లక్షలు చెల్లించారు. కానీ, ఫ్లాట్‌ను రామమోహన్‌కు రిజిస్ర్టేషన్‌ చేయకుండా ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు సభ్యత్వం కల్పించి రిజిస్ర్టేషన్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, మురారి, భద్ర, తులసి, పరుగు, తిక్క, చావు కబురు చల్లగా.. ఇలా 15కుపైగా సినిమాల్లో కో డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎస్‌.రాంబాబు చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో సభ్యుడు. ఆయన సభ్యత్వ నంబర్‌ 1138. ఫ్లాట్‌ కోసం 2012 వరకూ ఆయన రూ.6.90 లక్షలు చెల్లించారు. దాంతో, 2015లో ఆయనకు ఎంఐజీ ఒకటో బ్లాక్‌లో పదో అంతస్తులోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ (ఎం-1-1009) కేటాయించారు. 


ఈ మేరకు 2015 సెప్టెంబర్‌ 15న అప్పటి పాలక మండలి ఆర్డర్‌ కాపీ ఇచ్చింది. అనంతరం కూడా విడతల వారీగా సొసైటీ ఆఫీసులో కొంత సొమ్ము చెల్లించారు. కొంత కాలం తర్వాత.. నిర్మాణ పనులు నిలిచాయని, మూడు నెలల తర్వాత చెల్లించాలని చెప్పారు. పలుమార్లు వెనక్కి పంపారు. దాంతో, విషయాన్ని పాలక మండలిలోని పలువురు సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా రేపు, మాపు అంటూ దాట వేశారు. చివరకు ఎం-1-1009 ఫ్లాట్‌ను వేరొకరికి కేటాయించారు. ఆందోళన చెందిన రాంబాబు పాలక మండలి సభ్యులను సంప్రదిస్తే స్పందించడం లేదు. ఫోన్‌ చేసినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఇలా సినీ కార్మికులకు ఖరారు చేసిన ఫ్లాట్లను అప్పటి పాలక మండలి సభ్యులు తమకు నచ్చిన వారికి రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారు. దాంతో, గత పాలక మండళ్లు ఇచ్చిన ఆర్డర్లన్నీ బుట్టదాఖలు అవుతున్నాయి. ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు, ఇద్దరు సినీ ప్రముఖులతో కూడిన కమిటీ ఖరారు చేసిన పేర్లను కాదని, ఇష్టానుసారంగా ఫ్లాట్లను ఇతరులకు కేటాయిస్తున్నారు. చిత్రపురి సొసైటీలోని 75 శాతం ఫ్లాట్లను బయటి వారికి కేటాయించినట్లు రిజిస్ట్రార్‌  ఆఫ్‌ సొసైటీకి చిత్రపురి సాధన సమితి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఇలా సుమారు 700 మంది వరకు ఇతరులకు ఫ్లాట్లను కేటాయించినట్లు సాధన సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్‌ ఆరోపించారు.


సినీ కార్మికుల కన్నీటిపర్వం

ఏళ్ల తరబడి విడతలవారీగా డబ్బులు చెల్లించిన తర్వాత తమకు ఖరారు చేసిన ఫ్లాట్లను ఇతరులకు కేటాయిస్తుండడంతో సినీ కార్మికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అప్పులు చేసి లక్షల రూపాయలను వడ్డీలకు తీసుకొచ్చి చెల్లిస్తే తమకు ఇళ్లు దక్కకుండా అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ల మార్పిడిలో లక్షలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. వెయ్యి చదరపు అడుగుల వరకూ ఉండే ఎంఐజీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ చిత్రపురి కాలనీలో సినీ కార్మికులకు రూ.19 లక్షలకే వస్తోంది. కానీ, దానిని ఇతరులకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దాంతో, కార్మికులు పోలీసు స్టేషన్‌, జిల్లా సహకార సంఘం ఆఫీసులో ఫిర్యాదు చేస్తున్నారు.


న్యాయం చేయాలి: తమ్మినేని

 సినీ కార్మికుల ఇళ్ల ఫ్లాట్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులకు న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అక్రమార్కుల నుండి ఫ్లాట్లను స్వాధీనం చేసుకుని అర్హులైన వారికివ్వాలని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న సినీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులకు, వారి బంధువర్గానికి కేటాయింపులు చేయించుకుని కార్మికుల ఫ్లాట్లను గద్దల్లా తన్నుకుపోయారని ఆరోపించారు. 

నా ఫ్లాట్‌ నాకు దక్కుతుందా..?

మా నాన్న ఎంతో ఇష్టపడి చిత్రపురి కాలనీలో ఈశాన్యం ఫ్లాట్‌ తీసుకున్నారు. ఫ్లాట్‌ చేతికి రాకముందే నాన్న కాలం చేశారు. నా పేరిట ఉన్న ప్లాట్‌ను ఇప్పటి వరకూ నలుగురు వ్యక్తుల పేరిట మారుస్తూ వచ్చారు. సొసైటీ బాధ్యులను అడిగితే ఏదో ఒకటి ఇస్తామంటున్నారు. నా ఫ్లాట్‌ నాకు దక్కుతుందా..? లేదా..? భయమేస్తోంది. మా నాన్న ఏ ఫ్లాట్‌కు డబ్బులు చెల్లించారో అందులోనే ఉండాలనేది మా కోరిక. దానితో మాకు ఏదో తెలియని అనుబంధం ఉంది.

- సినీ ఆర్టిస్టు ఎం.వనజ


తప్పులు జరిగితే పరిష్కరిస్తాం 

సొసైటీ రూల్స్‌ ప్రకారం.. ఫ్లాట్‌ కోసం డబ్బులు కట్టకుండా ఉన్నవారిని మాత్రమే తొలగిస్తాం. జనరల్‌ బాడీ సమావేశంలో కూడా ప్రకటిస్తాం. విడతలవారీగా కాకుండా.. మొత్తం ఒకేసారి చెల్లిస్తామంటే కుదరదు. డబ్బులు కట్టని వారి ఫ్లాట్లను మాత్రమే ప్రాధాన్య క్రమంలో వేరే వారికి కేటాయిస్తాం. సొసైటీలో తప్పులు జరిగినట్లుగా నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తా.

- వల్లభనేని అనిల్‌కుమార్‌, చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు

నాకు కేటాయించిన ఫ్లాట్‌ మరొకరికి ఇచ్చారు

20 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా డైరెక్షన్‌ విభాగంలో కొనసాగుతున్నాను. అయినా, ప్రయోజనం లేకుండాపోయింది. నా పేరిట ఖరారైన ఫ్లాట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చారు. వడ్డీకి తీసుకొచ్చి ఇప్పటి వరకూ సుమారు రూ.7 లక్షలు చెల్లించాను. షూటింగ్‌కు వెళితేనే ఇళ్లు గడిచే పరిస్థితి. కానీ, అన్నీ వదిలేసి సొసైటీ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయినా, ఎవరూ స్పందించడం లేదు. నా ఫ్లాట్‌ నాకిస్తారా..? లేదా..? అనే ఆందోళన కూడా ఉంది.

 - కో డైరెక్టర్‌ ఎస్‌.రాంబాబు


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.