వెంకటేశ్‌ డేట్స్‌ కోసం ఐదేళ్లు వెయిటింగ్‌!

ABN , First Publish Date - 2022-09-22T06:15:10+05:30 IST

తమిళంలో ‘యంగళ్‌ చిన్న రాజా’గా, కన్నడంలో ‘అన్నయ్య’గా, హిందీలో ‘బేటా’గా రూపుదిద్దుకు ని ఘన విజయం సాధించిన యూనివర్సల్‌ పాయింట్‌ తో తెలుగులో తయారైన చిత్రం...

వెంకటేశ్‌ డేట్స్‌ కోసం ఐదేళ్లు వెయిటింగ్‌!

తమిళంలో ‘యంగళ్‌ చిన్న రాజా’గా,  కన్నడంలో ‘అన్నయ్య’గా, హిందీలో ‘బేటా’గా  రూపుదిద్దుకు ని ఘన విజయం సాధించిన యూనివర్సల్‌ పాయింట్‌ తో తెలుగులో తయారైన చిత్రం ‘అబ్బాయిగారు’.  విక్టరీ వెంకటేశ్‌  నటించిన  ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ఇది. మీనా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జయచిత్ర నెగెటివ్‌ రోల్‌  పోషించారు.  ‘బేటా’ చిత్రం రీమేక్‌ రైట్స్‌ సీనియర్‌ హీరో కృష్ణ దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర హక్కులు కొనుక్కుని ‘అబ్బాయిగారు’ చిత్రాన్ని నిర్మించారు రాశీ మూవీస్‌ నరసింహారావు. వెంకటేశ్‌, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్‌ లో వచ్చిన తొలి సినిమా ఇది. మూడు భాషల్లో విజయం సాధించిన మూల కథకు కొన్ని మార్పులు చేసి, కామెడీ డోస్‌ బాగా పెంచారు ఈవీవీ. 


‘అబ్బాయిగారు’ ప్రారంభించే సమయానికి తెలుగు చిత్ర పరిశ్రమలో స్లంప్‌ ఉంది. విడుదలైన సినిమాలు గోడకు కొట్టిన బంతుల్లా థియేటర్ల నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. దాంతో కొత్త చిత్రాలు తీయడానికి ఏ నిర్మాత సాహసించలేని పరిస్థితి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో స్ర్కిప్ట్‌ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు ఈవీవీ సత్యనారాయణ.


1993లో వెంకటేశ్‌ నటించిన ఏకైక తెలుగు చిత్రం ‘అబ్బాయిగారు’. ఈ సినిమా కోసం తన సొంత సినిమా కూడా ఆయన వాయిదా వేసుకున్నారు. మొత్తం 64 రోజులు ‘అబ్బాయిగారు’ కోసం పనిచేశారు వెంకటేశ్‌.


అలాగే దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కూడా రెండు చిత్రాలు వదులుకొని ఈ సిని మా కోసం పూర్తి సమయాన్ని కేటాయించడం విశేషం.


హైదరాబాదు, రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో అబ్బాయిగారు షూటింగ్‌ జరిగింది. రెండు పాటలను సింగపూరు, హాంకాంగ్‌ల్లో  చిత్రీకరించారు. వెంకటేశ్‌ డేట్స్‌ కోసం ఓపికగా  ఐదేళ్లు నిరీక్షించిన నిర్మాత  నరసింహారావు హీరో, దర్శకుడు సహకరించడంతో అనుకున్నదానికంటే ముందుగానే చిత్రాన్ని పూర్తి చేయగలిగారు. 1993 సెప్టెంబర్‌ 30న  విడుదలైన అబ్బాయిగారు విజయం సాధించి నాలుగు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది.


తొలి క్లాప్‌ కొట్టి ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించిన హీరో కృష్ణ వంద రోజుల వేడుకకు కూడా హాజరై జ్ఞాపికలు అందజేశారు. 


Updated Date - 2022-09-22T06:15:10+05:30 IST