గారంపల్లి భార్గవ్.. యూట్యూబ్‌లో ‘ఫిమేల్ ఫ్లాట్మేట్’ వెబ్ సిరీష్ చూసినోళ్లకు సుపరిచితులే. అందులో రచయిత కావాలని ప్రయత్నించే యువకుడిగా నటించారు. నిజ జీవితంలోనూ భార్గవ్ రచయితే. అందువల్లే, అంత సహజంగా నటించారేమో!. ‘ఫీమేల్ ఫ్లాట్మేట్’ కంటే ముందు చాలా యూట్యూబ్ వీడియోస్ రాశారు, నటించారు. తన జీవితం ఓ ‘సినిమా బండి’లాంటిదని చెబుతున్న భార్గవ్ ఈ వారం యూట్యూబ్‌లో ప్రవేశం, తన ప్రయాణం, భవిష్యత్ ప్రణాళికల గురించి భార్గవ్ మాటల్లోనే..
‘‘మాది చిత్తూరు దగ్గర పెనుమూరు అనే ఊరు. మా నాన్నగారు రామ్మూర్తిరెడ్డి టీచర్. నేను ఏడో తరగతిలో ఉండగా మరణించారు. అప్పుడు మా అమ్మ చిన్ని నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది. నాన్న మరణించినా... నాకన్నీ ఆయనే. టీచర్ కదా! ఎలా చదవాలి? ఎలా రాయాలి? - చిన్నతనంలో అన్నీ చెప్పారు. నాన్న ఎక్కువగా పాటలు వినేవారు. బహుశా... ఆ ప్రభావం నాపై పడిందేమో! హాస్టల్లో జాయిన్ అయ్యాక... నాకు నేనే ట్యూన్ అనుకుని, దానికి పాట రాసి పాడుకోనేవాణ్ణి. కానీ, స్టేజి మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి భయపడేవాణ్ణి! నేను తొమ్మిదో తరగతిలో ఉండగా... ఓ అమ్మాయిపై క్రష్ ఉండేది. ఇంకో అబ్బాయికీ క్రష్ ఉండేది. అప్పుడే ‘ఆర్య 2’ విడుదలైంది. దాంతో ‘ఆ అమ్మాయి గీత. నువ్వు అజయ్. నేను ఆర్య’ అని ఆ అబ్బాయి, నేను ఊహల్లో తేలేవాళ్లం. పదో తరగతిలో ఉండగా... ‘నేను రైటర్ అవుతా. ఆర్య3లో పాట రాస్తా’ అని చెప్పా.
ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకూ తిరుపతిలో చదివా. ఆ తర్వాత తంజావూరులోని సస్త్రా యూనివర్సిటీలో బీటెక్ చేశా. తొలి రెండేళ్లు నేనో ఫెయిల్యూర్ స్టూడెంట్‌ని. . ‘నువ్వు రాస్తావ్ కదా! ఏదైనా చేయవచ్చుగా. నీకు ఇంట్రెస్ట్ ఉంది’ అని స్నేహితులు ప్రోత్సహించారు. ఓ స్టూడెంట్ దగ్గర కెమెరా ఉంటే... ‘నా దగ్గర స్ర్కిప్ట్ ఉంది. డైరెక్షన్ చేస్తా. తెల్లగా ఉన్న వాడిని హీరోగా తీసుకుందాం. నువ్ కెమెరా వర్క్ చూసుకో’ అన్నాను. ‘సినిమా బండి’ సినిమా ఏదైతే వచ్చిందో... ఆ టైమ్‌లో మాది అటువంటి కథే. తమిళనాడులో చదివే తెలుగు స్టూడెంట్స్ సపరేట్గా ఉంటారు. అందులో ఎవరేం చేసినా... మిగతావాళ్లకు తెలుస్తుంది. నేను షార్ట్ ఫిల్మ్స్, స్టేజి షోలు బాగా చేస్తున్నానని పేరొచ్చింది. పాస్ అవ్వకపోతే పరువు పోద్దని చదవడం స్టార్ట్ చేసి, మార్కులు తెచ్చుకున్నా. రైటింగ్ మీద నాకున్న ప్రేమే నేను బీటెక్ పాస్ అయ్యేలా చేసింది. నాకు రామ్ గోపాల్ వర్మ బాగా ఇష్టం. అప్పట్లో స్టేజి మీద ఆయన్ను ఇమిటేట్ చేసేవాణ్ణి. ఏదైనా మర్చిపోయినా... స్పాంటేనియస్‌గా కవర్ చేసేవాణ్ణి. దాంతో నాపై నాకు నమ్మకం, ధైర్యం కలిగాయి.
అయితే, బీటెక్ తర్వాత బెంగళూరు వెళ్లా. మావయ్యకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అందులో ట్రయినింగ్ తీసుకున్నా... సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని! కానీ, నా వల్ల కాలేదు. కొన్ని నెలలకు ఆ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చా. రచయితగా ప్రయత్నాలు ప్రారంభించా. మా కుటుంబ సభ్యులెవరూ ఈ రంగంలో లేరు. అందుకని, నా ఇంట్రెస్ట్ గురించి చెబితే... ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్లను ఒప్పించి... ముందడుగు వేశా. అయితే, అందరిలా సినిమా కష్టాలు అనుభవించక తప్పలేదు.
తొలుత చిన్న యూట్యూబ్ చానళ్లలో రాశా. రెండు మూడు చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశా. ‘ఫిమేల్ ఫ్లాట్మేట్’లో నా క్యారెక్టర్ టైప్‌లో! నేను రాసినవాటిలో కొన్ని విడుదల కాలేదు. కొన్ని మధ్యలో ఆగిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ‘సీఏపీడీటీ’తో కలిశా. నేను మెహదీపట్నం దగ్గర షేక్‌పేట్‌లో ఉంటే... వాళ్లేమో ఉప్పల్ దాటి ఘట్కేసర్ వైపు ఉండేవాళ్లు. అందరూ ఇన్ఫోసిస్ ఉద్యోగులు. నేను ఉదయం ఉప్పల్ వెళ్లి, సాయంత్రం వాళ్లు ఆఫీసు నుంచి వచ్చేవరకూ వెయిట్ చేసేవాణ్ణి. వాళ్లంతా బ్రిలియెంట్ టీమ్. ముఖ్యంగా మా నిర్మాత శరత్. మేమంతా కలిసి కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుని, వీడియోస్ చేసేవాళ్లం.
రైటర్‌గా నేను చేసిన తొలి యూట్యూబ్ ఫిల్మ్ ‘బైక్ రాని బోగేశ్’. నటుడిగా అయితే ‘ప్రపోజింగ్ టు మై ఎక్స్ గాళ్‌ఫ్రెండ్’. అప్పటివరకూ నేను రాసిన వాటిలో చిన్న చిన్న పాత్రలు చేశానంతే. ఎందుకంటే... యాక్టర్‌గా నన్ను చూస్తారా? అని కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది. నాది హీరో లుక్ కాదు కదా! మనకు తగ్గట్టు పాత్రలు రాసుకుంటే... చూస్తారని ఆ తర్వాత తెలిసింది. ఏవరేజ్ అబ్బాయి, రైటర్... ఇటువంటి పాత్రలు చేశా. అందరూ చూసే సాధారణ కథలు, పాత్రలు ఎంపిక చేసుకున్నా. చిన్నా పెద్దా పాత్రలు లెక్క వేసుకుంటే నటుడిగా 100, రైటర్ ్క్ష డైరెక్టర్‌గా 150 వరకూ చేశా. ‘ఫిమేల్ ఫ్లాట్మేట్’ వెబ్ సిరీస్ (రెండు సీజన్లు) అన్నిటి కంటే ఎక్కువ పేరు తెచ్చింది. దాని రైటర్ ‘సీఏపీడీటీ’ శరతే. యాక్టింగ్, డైరెక్షన్ నేను చేశా. తర్వాత ‘లాక్డౌన్ విత్ ఎక్స్ గాళ్‌ఫ్రెండ్’ చేశా. ‘హౌ ఐ మెట్ పారు’లో కనిపించా. హెల్త్ కొంచెం డిస్ట్రబ్ అవ్వడంతో ఇప్పుడు యూట్యూబ్ ఫిల్మ్స్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చా.
రచయిత, దర్శకుడు కావాలని నేను ఈ రంగంలోకి వచ్చాను. నా తొలి ప్రాధాన్యం వాటికి ఇస్తా. అదృష్టం ఉంటే నటుడిగా మంచి పాత్రలు వస్తాయి. ప్రేక్షకులు చూసినంత కాలం నటిస్తా. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. నా దగ్గర ఐదు సినిమా కథలు సిద్ధంగా ఉన్నాయి. బౌండ్ స్ర్కిప్ట్స్ రెడీ చేశా. ఇంకొన్ని ఐడియాలూ ఉన్నాయి. చిత్తూరు నేపథ్యంలో ఓ కథ రాశా. కొంచెం కళాత్మక దృష్టిలో చేయాల్సిన సిరీస్ అది. ఆర్ట్ బేస్డ్ ఫిల్మ్‌మేకర్స్ కావాలి. డ్రీమ్ టీమ్ కుదిరితే వెంటనే చేస్తా. నా లక్ష్యం మంచి చిత్రాలు చేయడమే.’’