ఫిట్‌నెస్‌ గురూ

ABN , First Publish Date - 2021-07-15T07:03:42+05:30 IST

జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు దిగిన వీడియోలు, ఫొటోలను హీరో, హీరోయిన్లు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది....

ఫిట్‌నెస్‌ గురూ

జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు దిగిన వీడియోలు, ఫొటోలను హీరో, హీరోయిన్లు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. సోషల్‌ మీడియా బాగా డెవలప్‌ కావడంతో దాన్ని తమ పబ్లిసిటీ కోసం స్టార్స్‌ బాగా ఉపయోగించు కుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఫీచర్‌ ఇన్‌స్టా రీల్స్‌ ద్వారా చిన్న చిన్న వీడియోలు పోస్ట్‌ చేస్తూ  సినీ తారలు అభిమానులకు మరింత చేరువవుతున్నారు. ఇప్పుడు  ఇదో ట్రెండ్‌గా మారింది.


ఫిట్‌నెస్‌ కోసం, అలాగే తాము చేయబోయే సినిమాలో పాత్ర కోసం ఫిట్‌గా కనిపించేందుకు స్టార్స్‌  జిమ్‌లో ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియోల ద్వారా అభిమానులకు ఇట్టే తెలిసిపోతోంది. 


తమ పాపులారిటీని పెంచుకోవడానికి, అభిమానులతో ముచ్చటించడానికీ  సోషల్‌ మీడియాను  తారలు బాగా వాడుకుంటున్నారు. ఇన్‌స్టారీల్స్‌ ప్రత్యేకత ఏమిటంటే...


ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ అనేది వీడియో ఫీచర్‌. ఇందులో 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో క్లిప్పులకు మ్యూజిక్‌ జోడించి షేర్‌ చేయవచ్చు. తాము ఫిట్‌గా ఉండడం కోసం ట్రైనర్ల పర్యవేక్షణలో పడే కష్టాన్ని సినీ నటులు ఇప్పుడు ఈ ఇన్‌స్టా రీల్స్‌ ద్వారా జనాలకు చూపుతున్నారు. వ్యాయామం చేసేటప్పుడు చిన్న చిన్న వీడియోలను షూట్‌చేసి వాటికి మ్యూజిక్‌ యాడ్‌ చేసి ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ వీడియోలు స్ఫూర్తినిచ్చేలా ఉండడంతో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నారు. 


శిరీష్‌ ట్రెయినింగ్‌ డే

టాలీవుడ్‌ యువ హీరో అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ప్రేమ కాదంట’ చిత్రం కోసం ఫిట్‌గా మారడానికి జిమ్‌లో కసరత్తులు ప్రారంభించారు. ‘ట్రెయినింగ్‌ డే’ పేరుతో తన వర్కౌట్స్‌తో ఓ ఫిట్‌నెస్‌ రీల్‌ను పోస్ట్‌ చేశాడు. ఈ షార్ట్‌ వీడియో సిరీస్‌లో స్కిప్పింగ్స్‌, డంబెల్స్‌ వ్యాయామాలు, బరువులు ఎత్తడంలాంటి వర్కౌట్స్‌ చేస్తూ శిరీష్‌ తన శ్రమను కళ్లకు కట్టారు. శిరీష్‌ ఇన్‌స్టా రీల్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. 


వహ్వా .. విజయ్‌! 

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లైగర్‌’. మార్షల్‌ ఆర్ట్స్‌, బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో విజయ్‌ దేవరకొండ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. శరీరాన్ని స్టిఫ్‌గా మలిచేందుకు ఆయన హెవీ వర్కౌట్స్‌ చేస్తున్నారు. మధ్యలో చిత్రీకరణకు విరామం వచ్చినా రెగ్యులర్‌ వర్కౌట్స్‌ను  మాత్రం ఆపలేదు. జిమ్‌లో కసరత్తులు చేసే సమయంలో తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో పోస్ట్‌ చేసి అభిమానులతో వహ్వా అనిపించుకున్నారు విజయ్‌ దేవరకొండ.


ఫిట్‌గా రెడీ అయ్యాను

‘గని’ చిత్రం కోసం బరువు తగ్గి ఫిట్‌గా రెడీ అయ్యాను అంటున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ఈ చిత్రంలో ఆయన బాక ్సర్‌గా కనిపించనున్నారు. తన పాత్రకోసం బరువు తగ్గాల్సి రావడంతో వరుణ్‌ జిమ్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ ప్రారంభించారు.  అనుకున్న లక్ష్యాన్ని సాఽధించారు.  తను  చేసిన వ్యాయామాల వీడియోలు  ఇన్‌స్టారీల్స్‌ ద్వారా అభిమానుల ముందుకు తెచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. 


రాశీ రీల్స్‌

తాజాగా రాశీ ఖన్నా కూడా ఈ ఫిట్‌నెస్‌ రీల్స్‌ బరిలో దిగారు. ఒకప్పుడు కొంచెం బొద్దుగా ఉన్న రాశీఖన్నా ఇప్పుడు సన్నజాజితీగలా మారారు. ఫిట్‌నెస్‌పై ఆమె చూపించే శ్రద్దే దానికి కారణం. సూర్య నమస్కారాలు, యోగాసనాలు, బరువులెత్తడం దాకా ఆమె చేసిన వ్యాయామాల్ని ఇన్‌స్టా రీల్‌ అభిమానుల ముదుంచింది. ఫిట్‌నెస్‌పై రాశీ కున్న మక్కువకు అభిమానులు ‘ఫిదా’ అంటున్నారు. 


బాలీవుడ్‌లోనూ...

వీళ్లే కాకుండా  మిగిలిన హీరోలంతా కూడా జిమ్‌లో రోజూ వ్యాయామాలు చేస్తున్నారు. కానీ ఆ వీడియోలను ఇలా ఫిట్‌నెస్‌  రీల్స్‌గా రిలీజ్‌ చేయడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్‌నెస్‌ రీల్స్‌ పోస్ట్‌ చేయడం అనే ట్రెండ్‌  బాలీవుడ్‌లోనూ నడుస్తోంది. హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌, అనన్యాపాండే, జాన్వీకపూర్‌, కట్రినా కైఫ్‌ లాంటి కొందరు తారలు ఇన్‌సా ్టరీల్స్‌తో హోరెత్తించారు. మిగిలిన తారలు కూడా వీరి బాటలో నడిచే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-07-15T07:03:42+05:30 IST