తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రం ఏదంటే...

ABN , First Publish Date - 2022-03-10T23:13:55+05:30 IST

హీరో కృష్ణ నటించి, నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు. 1974 మే 1 న చిత్రం విడుదల అయింది. అయితే ఆ సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఏడాదికి ముందు నిర్మాత వై వి రావు సినిమా స్కోప్ చిత్రం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు శాంపిల్ చూపించారు. విజయ లలిత కథానాయిక గా కౌ బాయ్ చిత్రం తరహాలో 'ఒక నారీ వంద తుపాకులు' నిర్మించారు.

తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రం ఏదంటే...

హీరో కృష్ణ నటించి, నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు. 1974 మే 1 న చిత్రం విడుదల అయింది. అయితే ఆ సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఏడాదికి ముందు నిర్మాత వై వి రావు సినిమా స్కోప్ చిత్రం ఎలా ఉంటుందో  ప్రేక్షకులకు శాంపిల్ చూపించారు. విజయ లలిత  కథానాయిక గా కౌ బాయ్ చిత్రం తరహాలో 'ఒక నారీ వంద తుపాకులు' నిర్మించారు. కే వి ఎస్ కుటుంబరావు ఈ చిత్రానికి దర్శకుడు. దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. ఆ సమయంలో క్రైమ్ చిత్రాలు , కౌ బాయ్ సినిమాల హవా నడుస్తోంది. తను తీస్తున్నదీ కౌ బాయ్ చిత్రమే  కావడంతో కొత్త తరహాలో దాన్ని ప్రేక్షకులకు అందించాలని నిర్మాత వై వి రావు అనుకున్నారు. తెలుగులో అప్పటికే కలర్ చిత్రాల నిర్మాణం పెరిగింది. ఆంధ్రాలో కొన్ని థియేటర్లలో సినిమా స్కోప్ చిత్రాలు ప్రదర్శించడానికి సదుపాయం ఉంది. అందుకే 'ఒక నారీ వంద తుపాకులు' చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ లో తీసినా, చివరి రెండు రీళ్లు కలర్లో, సినిమా స్కోప్ లో చిత్రీకరించాలని నిర్ణయించుకొన్నారు. ఒకే సినిమాను 35 ఎంఎంలో, సినిమా స్కోప్ లో తీయడం నిజంగా అద్భుత ప్రయోగమే. ఈ విషయం చెప్పగానే ఛాయా గ్రాహకుడు దేవరాజ్ కూడా ఉత్సాహం చూపించారు. 35 ఎం ఎం లెన్స్ తో సినిమా మొత్తం చిత్రీకరించి, పతాక సన్నివేశాలను ప్రత్యేక లెన్స్ తో సినిమా స్కోప్ లో చిత్రీకరించారు. సినిమా స్కోప్ సౌకర్యం ఉన్న థియేటర్లలో చివరి రెండు రీళ్లూ స్కోప్ ప్రింట్ ను ప్రదర్శించారు. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ లో తెర మీద  చిన్నగా కనిపిస్తున్న సినిమా ఒక్కసారిగా కలర్ లోకి మారిపోయి స్క్రీన్ అంతా పరుచుకోవడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. 1973 ఏప్రిల్ 11 న విడుదలైన ఒక నారీ వంద తుపాకులు చిత్రం ఆర్థిక విజయం సాధించక పోయినా ఈ ప్రయోగం చరిత్రలో నిలిచి పోయింది.


వినాయకరావు

Updated Date - 2022-03-10T23:13:55+05:30 IST