అర్ధసంవత్సరంలో అలరించిన సినిమాలు, సిరీస్‌లు

ABN , First Publish Date - 2022-07-31T06:55:24+05:30 IST

ఏడాదిలో తొలి అర్థభాగం గడిచిపోయింది. మొదటి మూడు నెలల కాలంలో సినిమాల విడుదలపై కరోనా ప్రభావం చాలా గట్టిగానే పడింది.

అర్ధసంవత్సరంలో అలరించిన సినిమాలు, సిరీస్‌లు

 డాదిలో తొలి అర్ధభాగం గడిచిపోయింది. మొదటి మూడు నెలల కాలంలో  సినిమాల విడుదలపై కరోనా ప్రభావం చాలా  గట్టిగానే పడింది. నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్‌ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు.  అయితే  పాన్‌ ఇండియా రిలీజ్‌లతో  క్రమంగా పరిస్థితులు మెరుగు పడడంతో. చిన్నా, పెద్ద సినిమాలు విడుదలకు వరుసకట్టాయి. మరోవైపు కరోనా సంక్షోభం, థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపక పోవడంతో  చాలా సినిమాలు ఓటీటీ  వేదికల్లో విడుదలయ్యాయి. వెబ్‌ సిరీస్‌కు ఆదరణ పెరిగింది. ధియేటర్‌కు వెళ్లి సినిమా చూడడం కంటే ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు చూడడం ఓ అలవాటుగా మారింది. ఈ ఆరు నెలల కాలంలో  థియేటర్లు,  డిజిటల్‌ వేదికల్లో రిలీజైన సినిమాలు,  ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న వెబ్‌   సిరీస్‌  జాబితాను ఇంటర్నెట్‌ మూవీ డాటాబేస్‌ (ఐఎండీబీ) సంస్థ విడుదల చేసింది.  ఇప్పటిదాకా మీరు చూడని సినిమాలు, సిరీస్‌లు ఉంటే వాటిపై ఓ లుక్‌ వేయండి.


విక్రమ్‌ హవా...

తెలుగులో అగ్రహీరోల చిత్రాలే రూ. 50 కోట్ల వసూళ్లను దాటడానికి ఆపసోపాలు పడుతున్నాయి. అలాంటి దశలో విడుదలైన అనువాద చిత్రం ‘విక్రమ్‌ తో కమల్‌ హాసన్‌ ’ బాక్సాఫీసును బాదేశారు. రూ. 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఒక్క తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ రూ. 40 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం. రజనీకాంత్‌ ‘రోబో 2.0’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంత వసూళ్లు సాఽధించిన సినిమా ఇదే.  ‘ఖైదీ’ తర్వాత దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మరోసారి మ్యాజిక్‌ చేశారు. కమల్‌హాసన్‌, పహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతిల  నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతూ  అప్పుల్లో మునిగిన లోక నాయకుడు కమల్‌హాసన్‌ను బయటపడేసిన చిత్రంగానూ ‘విక్రమ్‌’ సరికొత్త చరిత్ర లిఖించింది.


కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల మధ్యకు వచ్చిన రాఖీభాయ్‌ ‘కేజీఎఫ్‌ 2’తో  వసూళ్ల సునామీనే సృష్టించాడు. యష్‌, సంజయ్‌దత్‌ల  పోటాపోటీ నటన,  దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అద్భుత టేకింగ్‌కు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రపంచవ్యాప్తంగా పదివేల థియేటర్లలో విడుదలైన ‘కేజీఎ్‌ఫ:ఛాప్టర్‌ 2’ తొలి రోజే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టి ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చింది. బాక్సాఫీసు రన్‌ పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్ల వసూళ్లను రాబట్టింది. 


ఆర్‌ఆర్‌ఆర్‌

భారతీయ సినిమా చరిత్రలో రూ. వెయ్యికోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళిలకు తమ సినీ కెరీర్‌లో మరపురాని విజయంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచిపోయింది. 


కశ్మీర్‌ఫైల్స్‌

నిఖార్సైన హిట్‌ సినిమాకు సరైన నిర్వచనంలా నిలిచింది ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’. స్టార్‌ హీరోలు, డైరెక్టర్లు, భారీ మార్కెటింగ్‌ వ్యూహాలు  లేకపోయినా అనితర సాధ్యమైన విజయాన్ని సాధించింది. కరోనాను కేర్‌ చేయకుండా రూ. 400 కోట్లు కొల్లగొట్టింది. 90వ దశకం నాటి కశ్మీరీ పండిట్ల ఊచకోతలు, వారు అనుభవించిన కష్టాలకు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఇచ్చిన తెరరూపం ప్రేక్షకులను థియేటర్ల వైపు కదిలించింది. మొదటల్లో పెద్దగా టాక్‌ లేకపోయినా సినిమా బాగుందనే టాక్‌తో క్రమంగా థియేటర్ల సంఖ్య, వసూళ్లు పెరిగాయి. ఏ స్టార్‌ హీరో లేకపోయినా, కేవలం హిందీ వెర్షన్‌లో మాత్రమే రిలీజైనా దేశవ్యాప్తంగా వసూళ్లను కొల్లగొట్టింది.


హృదయం 

ప్రణవ్‌ మోహన్‌లాల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘హృదయం’. ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.ఈ ముక్కోణపు ప్రేమకథ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మలయాళ చిత్రంగా నిలవడమే కాదు, ఆ తర్వాత ఓటీటీలో విడుదలై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణ దక్కించుకుంది. 


గంగూబాయి కథియావాడి

అలియాభట్‌ను నటనపరంగా మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. వసూళ్ల పరంగానూ తనదైన ముద్ర వేసింది. వేశ్యావాటికను నిర్వహించే యువతిగా కొత్తతరహా పాత్రలో అలియా ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ను వరుస ప్లాప్‌లు చుట్టుముడుతున్న వేళ రూ. 200 కోట్ల వసూళ్లతో ఆమె సత్తా చాటారు. 


ఎ థర్స్‌ డే

ఈ ఏడాది ప్రేక్షకులు మెచ్చిన ఉత్తమ ఓటీటీ చిత్రాల జాబితాలో ‘ఎ థర్స్‌డే’ ప్రముఖంగా నిలిచింది. యామీగౌతమ్‌, అతుల్‌ కులకర్ణి, నేహాధూపియా, డింపుల్‌ కపాడియా ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ హిందీ హారర్‌ చిత్రం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. థియేటర్లలో విడుదల కావాల్సిన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొంది. 


ఝుండ్‌

ఫుట్‌బాల్‌ క్రీడా శిక్షకుడు విజయ్‌ బార్సే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఝుండ్‌’. క్రైమ్‌, డ్రగ్‌ మాఫియా వలలో చిక్కుకున్న యువకులతో అజేయమైన ఫుట్‌బాల్‌ జట్టును తయారుచేసిన తీరును  తెరకెక్కించడంలో దర్శకుడు నాగ్‌రాజ్‌ మంజులే ఓటీటీ ప్రేక్షకులను మెప్పించారు. అమితాబ్‌ తనదైన శైలిలో మెప్పించారు. వీటితో పాటు అక్షయ్‌ కుమార్‌ ‘సామ్రాట్‌ పృథ్విరాజ్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘రన్‌వే’ చిత్రాలు థియేటర్ల దగ్గర చెత్త ప్రదర్శన చేసినా ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్స్‌ సాధించడం విశేషం. 


వెబ్‌సిరీస్‌లు 


క్యాంపస్‌డైరీస్‌ (ఎంఎక్స్‌ ప్లేయర్‌)

కాలేజీ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా సిరీస్‌ ‘క్యాంపస్‌ డైరీస్‌’. ఎంఎక్స్‌ప్లేయర్‌లో విడుదలైంది. మొత్తం 12 ఎపిసోడ్లలో ఫుల్‌ ఫన్‌ పంచిన ఈ హిందీ సిరీ్‌సకు యూత్‌ బాగా కనెక్ట్‌ అవడంతో ఓటీటీలో సూపర్‌ హిట్‌ అనిపించుకుంది.

 

రాకెట్‌ బాయ్స్‌ (సోని లివ్‌)

దేశం గర్వించదగ్గ గొప్ప అణు శాస్త్రవేత్తలు హోమీ జె. బాబా, విక్రమ్‌ సారాబాయ్‌ జీవితాల ఆధారంగా రూపొందిన సిరీస్‌ ‘రాకెట్‌ బాయ్స్‌’. భారతదేశ అణు కార్యక్రమాల రూపకల్పనలో వారు చేపట్టిన మిషన్‌, అధిగమించిన సవాళ్లను కళ్లకు కట్టిన ఈ సిరీస్‌ ప్రేక్షక హృదయాలను తాకింది. 


పంచాయత్‌ 2 (అమెజాన్‌ ప్రైమ్‌)

లాక్‌డౌన్‌ సమయంలో విడుదలై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన సిరీస్‌ ‘పంచాయత్‌’. ఈ హిందీ సిరీస్‌ సీజన్‌ 2 మేలో విడుదలైంది. ఇంజినీరింగ్‌ చదివి అనుకోని పరిస్థితుల్లో ఓ పల్లెలో పంచాయతీ ఆఫీసులో సెక్రటరీగా చేరిన అభిషేక్‌ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది వినోదాత్మకంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. 


   అపహరణ్‌ 2 (వూట్‌)

దేశాన్ని అల్లకల్లొలానికి గురిచేసే డ్రగ్‌ ముఠా, మాజీ ‘రా’ అధికారి మధ్యన ఎత్తుకు పై ఎత్తుల నే పథ్యంలో సిరీస్‌ సాగుతుంది. కథనం, సంభాషణలు ఒకెత్తు అయితే క్రైమాక్స్‌ ఒక్కటి మరో ఎత్తు అనిచెప్పాలి. కథలో సస్పెన్స్‌, మలుపులు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టడంలో సక్సెస్‌ అయ్యాయి. 


    హ్యూమన్‌ (డిస్నీ హాట్‌స్టార్‌)

హ్యూమన్‌ డ్రగ్‌ టెస్టింగ్‌, మెడికల్‌ మాఫియా నేపథ ్యంలో తెరకెక్కిన సిరీస్‌ ‘హ్యూమన్‌’. నిరుపేదలపై నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌ వెనుక ఉన్న లొసుగులు, ఫార్మాకంపెనీలు, కార్పొరేట్‌ హాస్పిటళ్లు, ప్రభుత్వ అధికారులు కలసి నిరుపేదలను దోపిడీచేసే తీరును ఈ సిరీస్‌ కళ్లకు కట్టింది. 


   ఎస్కేప్‌ లైవ్‌ (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌లు వల్ల మనిషి పడే సంఘర్షణను కళ్లకు కట్టినట్లు చూపిన సిరీస్‌ ‘ఎస్కేప్‌ లైవ్‌’. హీరో సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ సోషల్‌ మీడియాలోని చీకటి కోణాలను, డబ్బు, పేరు కోసం ఎంతకైనా తెగించే మానవ మనస్తత్వాలను కొత్తరీతిలో ఆవిష్కరించింది. 


    ద గ్రేట్‌ ఇండియన్‌ మర్డర్‌ (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)

దనవంతుడైన పారిశ్రామిక వేత్త హత్య, దాని చుట్టూ సాగే రాజకీయాల నేపథ్యంలో అల్లుకున్న  క్రైమ్‌ మిస్టరీ  సిరీస్‌ ‘ద గ్రేట్‌ ఇండియన్‌ మర్డర్‌’. అజయ్‌ దేవగణ్‌ నిర్మించారు. రిచాచద్దా, ప్రతీక్‌ గాంధీ, అశుతో్‌షరాణా కీలకపాత్రల్లో నటించారు. హత్య కేసును ఛేదించే క్రమంలో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. 

 

      ద ఫేమ్‌ గేమ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్‌ ‘ద ఫేమ్‌ గేమ్‌’. అనామిక అనే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హఠాత్తుగా కనిపించకపోవడం, ఆమెను వెతికే క్రమంలో బయటకు వచ్చిన కొన్ని రహస్యాలు కొందరు సెలబ్రిటీల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది కథ. ప్రేక్షకులతో పాటు విమర్శల ప్రశంసలు అందుకుంది. 

   

 యే ఖాలీ ఖాలీ ఆంఖేన్‌

రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇది. ఒక యువకుడిపై మోజుపడిన రాజకీయ నాయకుడు కూతురు జీవితం చివరకు ఏ గమ్యం చేరిందనేది క్లుప్తంగా ‘యే ఖాలీ ఖాలీ ఆంఖేన్‌’ సిరీస్‌ కథ. ఇష్టపడిన వాణ్ణి దక్కించుకోవడానికి ఒక అమ్మాయి ప్రదర్శించిన తెగింపు ప్రేక్షకులను కనెక్ట్‌ అయ్యేలా చేసింది. 


ఆదరణ పొందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఇంటర్నెట్‌ మూవీ డాటాబేస్‌ చూస్తుంటారు. తాము చూసిన సినిమాలు, సిరీస్‌లకు ఐఎండీబీలో రేటింగ్‌ ఇస్తుంటారు. మంచి రేటింగ్‌ వస్తే ఆ సినిమా బాగుందని అర్థం. 10కి 7, ఆపైన రేటింగ్‌ వస్తే మంచి ఆదరణ పొందినట్లు లెక్క. సినిమాలు, సిరీస్‌లు హిట్టా, ప్లాపా అనేది అంచనాకు రావడానికి ఐఎండీబీ రేటింగ్‌ను అంతర్జాతీయంగా ప్రామాణికంగా భావిస్తారు. 

Updated Date - 2022-07-31T06:55:24+05:30 IST