దృశ్యం 2021: వివాహాలు – విషాదాలు

ఈ ఏడాది (2021) సినీ పరిశ్రమ కొందరిని వివాహ బంధంతో ఒకటి చేస్తే... మరి కొందరికీ ఈ లోకానికి దూరం చేసింది. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ఎలాంటి హడావిడి లేకుండా కొందరు పెళ్లి చేసుకున్నారు. వారికి కుటుంబాలకు ఆనందాన్ని పంచిన ఈ సంవత్సరం కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. ఆ కథేంటో చూద్దాం. 


2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరో కార్తికేయ, సుమంత్‌ అశ్విన్‌, హీరోయిన్‌ ప్రణీత, సింగర్‌ సునీత, కమెడీయన్‌ విద్యుల్లేక రామన్‌ వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి.  ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ చేస్తున్నప్పుడు లోహితతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి వరకూ వచ్చింది. 


కన్నడ బ్యూటీ, తెలుగు ప్రేక్షకుల బాపు బొమ్మ ప్రణీత సుభాష్‌ వ్యాపారవేత్త నితిన్‌రాజును పెళ్లాడి అత్తారింట్లో అడుగుపెట్టారు. వీరిద్దరూ ప్రేమించుకుని కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. మే 30న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా వీరి వివాహం జరిగింది. 


దర్శక నిర్మాత ఎమ్మెస్‌ రాజు తనయుడు, సుమంత్‌ అశ్విన్‌ ఫిబ్రవరి 13న దీపికను వివాహమాడారు. డల్లాలో రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా పని చేస్తున్న దీపిక మెడలో మూడు ముళ్లూ వేశారు సుమంత్‌. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం.


గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్‌ వీరపనేనితో ఏడడుగులు వేశారు.శంషాబాద్‌ సమీపంలోని అమ్మపల్లి రామాలయంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. అలాగే హాస్య నటి విద్యాల్లేఖా రామన్‌ పెళ్లి సెప్టెంబర్‌ 9న సంజయ్‌తో జరిగింది. ఆయన ఫిట్‌నెస్‌, న్యూట్రషనిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం.


విషాదాలు...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఎంతోమందిని కోల్పోయింది. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తి నవంబర్‌ 30న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించారు. నృత్యదర్శకుడు శివ శంకర్‌ మాస్టర్‌ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్‌ 28న మృతి చెందారు. రచయిత నంద్యాల రవి, గాయకుడు జి. ఆనంద్‌,  స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌, జర్నలిస్ట్‌ టీఎన్‌ఆర్‌, డైరెక్టర్‌ అక్కినేని వినయ్‌ కుమార్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వి. కాంచన్‌ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే సంగీత దర్శకుడు కేఎస్‌ చంద్రశేఖర్‌, నిర్మాత, సీనియర్‌ జర్నలిస్ట్‌ బీఏ రాజు, యువ నిర్మాత మహేశ్‌ కోనేరు మరణించారు. ప్రముఖ నిర్మాత ఆర్‌ఆర్‌ వెంకట్‌ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు గిరిధర్‌, నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మరణించారు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించారు. అలాగే బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దిలీప్‌కుమార్‌, సిద్ధార్థ్‌ శుక్లా, రాజ్‌ కౌశల్‌, అనుపమ్‌ శ్యామ్‌, సురేఖ సిక్రీ అనారోగ్యాలతో తుది శ్వాస విడిచారు. 


బాలీవుడ్‌లో కూడా ఈ ఏడాది పెళ్లి బాజాలు బాగానే మోగాయి. వరుణ్‌ ధావన్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌ నటాషాను వివాహమాడారు. దియా మీర్జా – వైభవ్‌ను, యామీ గౌతమ్‌ – ఆదిత్యాదార్‌ను, రాజ్‌కుమార్‌ రావ్‌ – పత్రలేఖను, కట్రీనా కైఫ్‌– విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు.అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.