‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. తాజాగా ‘రాధేశ్యామ్’ చిత్రంతో అభిమానులను అలరించాడు. పాన్ ఇండియా సినిమాలను వరుసగా పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కే’, ‘స్పిరిట్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ విడుదల అనంతరం స్పెయిన్ వెళ్లాడు. సర్జరీ చేయించుకునేందుకే రెబల్ స్టార్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కొన్ని నెలల క్రితం ‘సలార్’ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సినిమా షూట్ సమయంలో అతడు గాయపడ్డాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బార్సిలోనాలో మైనర్ సర్జరీ చేయించుకున్నట్టు సమచారం. ఈ సర్జరీ విజయవంతం అయిందట. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడట. ప్రభాస్‌కు తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.
ప్రభాస్ తాజాగా ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో అతడు జ్యోతిషుడిగా నటించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రేమకీ, విధికీ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.