నా ఫేవరెట్‌ స్టార్‌కి పాడాను మాటల్లో చెప్పలేనంత ఆనందం సామి

ABN , First Publish Date - 2021-12-05T05:30:00+05:30 IST

‘బావా ఓసారి రావా’... అని పాడితే కోట్ల వ్యూస్‌ ఇచ్చారు... రాములో రాములా... అని గొంతెత్తితే యువత ఊగిపోయింది......

నా ఫేవరెట్‌ స్టార్‌కి పాడాను మాటల్లో చెప్పలేనంత ఆనందం సామి

‘బావా ఓసారి రావా’... అని పాడితే కోట్ల వ్యూస్‌ ఇచ్చారు...

రాములో రాములా... అని గొంతెత్తితే యువత ఊగిపోయింది.

అయితే ఇదంతా యూట్యూబ్‌లో... జరిగిన సందడి!

ఇదే సందడి వెండితెర మీద కూడా చేేస్త....

అదే ‘పుష్ప’లో ‘సామి.. నా సామి.’

ఈ పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌ సింగర్‌ అయిపోయింది మౌనిక యాదవ్‌

తెలంగాణ ఉద్యమ, జానపద పాటలతో అలరించిన ఆమె తొలిసారి సినిమా పాట పాడి ట్రెండింగ్‌లో ఉన్నారు. తన  ఫేవరెట్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి పాడటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సింగింగ్‌ జర్నీని ‘నవ్య’తో చెప్పుకొచ్చారు మౌనిక యాదవ్‌. ఆ విశేషాలు...




ఆ ఘనత వారిదే...

తెలంగాణ ఉద్యమగీతాలు, జానపద గీతాలు పాడడం, ఉద్యోగం చేసుకోవడం.. ఇదే దృష్టిలో ఉండడం వల్ల ‘సంగీతం నేర్చుకోవాలి.. సినిమా పాటలు పాడాలి’ అన్న ఆలోచన తట్టలేదు. కానీ ఊహించని ఓ అవకాశం నా తలుపు తట్టింది. జానపద గాయనిగా ఉన్న నన్ను ‘సామి సామి’ సాంగ్‌తో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ ఘనత సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌గారికే దక్కుతుంది. ఇప్పటి వరకూ నేను ఫోక్‌ సాంగ్స్‌ ఫాలో అయ్యే ఆడియన్స్‌కి మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచం అంతా నా పాట వింటోంది. ఇప్పటికీ ఇది నాకు కలగానే ఉంది. మంచి అవకాశం వస్తే తప్పకుండా సినిమా పాటలు పాడతా. ఆడుతూపాడుతూ నేర్చుకున్న పాటే నాకు లైఫ్‌ ఇచ్చింది. దీనిని ఇలాగే కొనసాగిస్తా. గుర్తింపు తెచ్చుకోగానే సరిపోదు... దానిని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పని మీద ఉంటా. 



నేను పుట్టింది గోదావరిఖని. పెరిగిందంతా జమ్మికుంటలో! బీకామ్‌ చదువుకున్నా. నాన్నకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉండడంతో  నేనూ, అక్క పద్మావతి కూడా అదే దారిలో పయనించాం. చిన్నప్పటి నుంచి విమలక్క, గద్దర్‌ అన్న పాటలు ఎక్కువ వింటుండేవాళ్లం. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని  పాడాలనుకున్నా.. 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ గీతాలు పాడేవాళ్లం. దయా నర్సింగ్‌, మా స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ విజయానంద్‌గారు నాకు పాటలు నేర్పిన గురువులు. వారి ఆధ్వర్యంలోనే స్టేజ్‌పై ఉద్యమ గీతాలు పాడేవాళ్లం. ప్రతిభ ఉన్నా కొన్ని సందర్భాల్లో పాడే అవకాశం వచ్చేది కాదు. ఆడ పిల్లలు బయటికెళ్లి పాడటం ఏంటని చాలామంది చులకనగా మాట్లాడేవారు. కష్టాలు, అవమానాలు చాలా ఎదుర్కొన్నాం. అక్క పాడుతుంటే నేను డాన్స్‌ చేయడం, కంజర కొట్టడం చేసేదాన్ని. అలా ఉద్యమ గీతాలతో పాపులర్‌ అయ్యా. 


సంగీతం నేర్చుకోలేదు...

విమలక్క పాడిన పాటల్ని క్యాసెట్‌లో విని పాడడం నేర్చుకున్నా. సంగీతం నేర్చుకోలేదు. ఉద్యమంలో వందల పాటలు పాడాం. కేసీఆర్‌గారి ఆధ్వర్యంలో రసమయి బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారధిలో నాకు, అక్కకు జాబ్‌ వచ్చింది. ‘ఉద్యమంలో పని చేశారు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం’ అని 2014లో ఆ ఉద్యోగాలు మాకు ఇచ్చారు. ప్రభుత్వ స్కీములను జనాల్లోకి తీసుకెళ్లి చైతన్య పరచడం మా పని. 2017లో నన్ను హైదరాబాద్‌ టీమ్‌లో వేశారు. ఇక్కడికొచ్చాక జానపద గేయాలు నేర్చుకున్నా. మానుకోట ప్రసాద్‌గారు నాకు తొలి అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి యూట్యూబ్‌ కోసం చాలా పాటలు పాడాను. వాటిలో తిరుపతి మాట్ల రూపొందించిన ‘బావ ఓసారి రావా’, ‘రాములో ఓ రాముల’ పాటలు ట్రెండింగ్‌ అయ్యాయి. ఆ పాటలతో నా పేరు జనాలకి తెలిసింది. మా అన్నయ్య నరేశ్‌ సహకారం లేనిదే హైదరాబాద్‌లో నేను నిలబడేదానిని కాను. ఇక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే! 


‘పుష్ప’ అవకాశం వచ్చిందిలా..

నేను పాడిన ‘బావ ఓసారి రావా’ విని ‘పుష్ప’లో ఓ పాట పాడాలంటూ సుకుమార్‌గారి టీమ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అలాంటి అవకాశం వదులుకోకూడదని నాన్నతో కలిసి చెన్నై వెళ్లాను. దేవిశ్రీప్రసాద్‌ స్టూడియోలో ఆయన్ని చూడగానే షాక్‌ అయ్యా.. ‘నేనేంటి.. సినిమాలో పాడే అవకాశం రావడమేంటి? అని వేరే లోకంలోకి వెళ్లిపోయా. కాసేపటికి తేరుకొని నా లోకంలోకి వచ్చా. స్టార్‌ హీరో, అదీ నా ఫేవరెట్‌ హీరో నటించే పాన్‌ ఇండియా సినిమాలో పాడే అవకాశం రావడం ఆనందంగా అనిపించింది. కానీ స్టూడియోలోకి వెళ్లగానే ఎలా పాడతానో.. హీరోయిన్‌కి నా వాయిస్‌ సూట్‌ అవుతుందో లేదో అనే భయం వెంటాడింది. దేవి సార్‌ చెప్పినట్లు లిరిక్స్‌ ప్రాక్టీస్‌ చేశాను. ‘సామి సామి’ పాట పాడటానికి రెండు రోజులు పట్టింది. ఒకరోజు స్టూడియోలో లైన్స్‌ పాడాక ‘మేం కాల్‌ చేస్తాం మీరు వెళ్లి రెస్ట్‌ తీసుకోండి’ అని పంపేశారు. రోజు గడిచినా ఫోన్‌ రాకపోయే సరికి నాలో టెన్షన్‌ మొదలైంది. తర్వాతి రోజు ఫోన్‌ చేసి పిలిపించి మిగిలిన పాట పాడించారు. నేను పాడింది ఒక ఎత్తైతే... దేవిశ్రీ ప్రసాద్‌గారు ఏదో మ్యాజిక్‌ చేసి బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చారు. పాడేటప్పుడు ఇబ్బంది పడిన ప్రతిసారి ఎలా పాడాలో వివరించి నా చేత పాడించారు. సరిగ్గా పాడకపోతే కోప్పడతారేమో అని భయపడ్డా. ఒక ఫ్రెండ్‌లా ఫ్రీడమ్‌ ఇచ్చారు. గత ఏడాది నవంబర్‌లో పాడిన పాట ఇది. ఇప్పుడు బయటికొచ్చింది. 80 శాతం నా పాటే ఉంటుందని నమ్మకం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో నా గొంతు ఉంటుందో ఉందడో అని భయపడ్డా. తొలి పాటతోనే ఇంత పాపులర్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. మారుమూల ప్రాంతంలో ఉన్న మాలాంటి కళాకారులను పిలిచి ప్రోత్సహించిన దేవిశ్రీప్రసాద్‌గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా ఫీలింగ్‌ ‘రేసుగుర్రం’ సినిమాలో శ్రుతిహాసన్‌లా ఉంది. లోలోపల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. చిన్నతనంలో నన్ను అవమానించిన వారే ఈరోజు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల్లుగా నేను పడుతున్న కష్టానికి ఫలితం దక్కిందనిపించింది. 


వ్యత్యాసం అదే...

ఫోక్‌ సాంగ్‌ పాడడానికి, సినిమా పాట పాడడానికి చాలా తేడా ఉంది. ఫోక్‌ సాంగ్స్‌ మన జీవితాల నుంచి వస్తాయి. వాటిని పాడడానికి ఓ పద్దతి ఉంటుంది. కానీ సినిమా పాట పాడడం అంత సులభం కాదు. లిరిక్స్‌లో భావం తెలిస్తేనే ఆ ఎక్స్‌ప్రెషన్‌ పలుకుతుంది. పాడే గొంతు హీరోహీరోయిన్లకు మ్యాచ్‌ అవ్వాలి.. ఇలా చాలా లెక్కలుంటాయి. పైగా సినిమా సంగీతానికి ఇన్‌స్ట్రూమెంట్స్‌ ఎక్కువ. నాకైతే కొత్త ప్రపంచంలా అనిపించింది. నేను సెంటిమెంట్‌ సినిమాలు ఎక్కువ చూస్తాను. జీవితాన్ని ప్రభావితం చేసే పాటల్ని వింటా. 


కొన్ని కారణాల వల్ల ఆస్తులు కరిగిపోయాయి. నాన్న హమాలీ పని చేస్తూ మమ్మల్ని పెంచారు. ఏ కష్టం తెలియనివ్వలేదు. వారు ఇచ్చిన సపోర్ట్‌తోనే నేను ఒక్కో మెట్టు ఎక్కగలుగుతున్నా. హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే మా అన్నయ్య నరేశ్‌ ఇచ్చిన సపోర్ట్‌ మరువలేనిది. తన వల్లే సిటీలో ఎలా బతకాలి అన్నది తెలిసింది! ఒక్క పాటతో ఇంత పాపులారిటీ రావడం వల్ల మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

                                                                                                     ఆలపాటి మధు

Updated Date - 2021-12-05T05:30:00+05:30 IST