ఫెయిల్యూర్స్‌ పాఠాలు నేర్పాయి

స్టార్‌డమ్‌ గురించి పెద్దగా ఆలోచించడు...

నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. 

ఆయన ఏ సినిమా చేసినా అందులో కథ, కథనం 

బావుంటుందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతారు. 

ఆ యువ హీరోనే అడివి శేష్‌. ఐటమ్‌ సాంగ్‌, ఐదుఫైట్లు...

ఇలా సినిమా ఫార్ములాలకు తలొగ్గడు. కథే హీరోగా 

భావిస్తాడు కాబట్టే ఇవాళ టాలీవుడ్‌లో ప్రామిసింగ్‌ హీరో అయ్యాడు.

త్వరలో ‘మేజర్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అడివి శేష్‌ను ‘నవ్య’ పలకరించింది.


ప్రశ్న: అమెరికా ట్రిప్‌ ఎలా సాగుతోంది? అక్కడ కొవిడ్‌ పరిస్థితి ఎలా ఉంది?

జవాబు: అమెరికాలో కొవిడ్‌ భయం ఏ మాత్రం లేదు. అందరూ హాయిగా తిరుగుతున్నారు. ఇటీవలే మా చెల్లికి ఎంగేజ్‌మెంట్‌ అయింది. అందువల్ల అమెరికాకు రావాల్సి వచ్చింది. ఇక్కడ కేసులు తగ్గిన సమయంలోనే నేను వచ్చాను. సగానికి పైగా జనాభా వ్యాక్సిన్లు వేయించుకున్నారు. అందువల్ల కోవిడ్‌ భయమే లేదు. ఇక నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. స్వేచ్ఛగా తిరుగుతున్నా. నేను ఇక్కడికి రాకముందు.. 16 నెలలు హైదరాబాద్‌ దాటి ఎక్కడకూ పోలేదు. ఆ విధంగా చూస్తే నాకు ఈ ట్రిప్‌తో కాస్త స్వేచ్ఛ లభించినట్లే(నవ్వుతూ)!


కొవిడ్‌ వల్ల సినిమారంగంలో మార్పులొచ్చాయి. ఓటీటీలు ప్రవేశించాయి. దాని ప్రభావం సినీ రంగంపై ఎలా ఉంటుందనుకుంటున్నారు?

కోవిడ్‌ వేవ్‌ 1, 2ల మధ్య కొంత విరామం వచ్చింది. ఆ సమయంలో వచ్చిన క్రాక్‌, జాతిరత్నాలు.. వంటి సినిమాలకు లభించిన ఆదరణ చూస్తే - ప్రేక్షకులు థియేటర్లను మర్చిపోలేదని అర్థమయింది. అయితే ఓటీటీల పోటీవల్ల మంచి చిత్రాలను అందించాల్సిన బాధ్యత దర్శకులు, నిర్మాతలపైన పడింది. ప్రపంచంలోని వివిధ భాషల్లో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు తమ ఇళ్లలో కూర్చుని చూడగలుగుతున్నారంటే అదిది ఓటీటీ పుణ్యమే. మన సినిమాలు కూడా వాటికి ధీటుగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ‘తెలుగు నేటివిటీ’, ‘ఇండియన్‌ స్టాండర్డ్స్‌’ వంటి పదాలకు అర్థం లేకుండా పోయింది. ఒక్క దెబ్బతో సినిమా నిజంగా విశ్వజనీయమైంది. 


సినిమాలు ఎంపిక చేసుకునే విధానం?

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి చిత్రాలు ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత ఉండేది కాదు. తొలి రోజుల్లో నేను నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్‌ అయ్యాయి. పూర్తి ఆలా్ట్ర కమర్షియల్‌గా తీయటం.. విలక్షణంగా తీయటానికి ప్రయత్నించటమే దీనికి కారణం. ఈ చిత్రాల్లో నేను నేనుగా ఉండను. ఆ తర్వాత నన్ను నేను విశ్లేషించుకున్నా. సినిమా విజయం సాధించటానికి ఇతర భారతీయ సినిమాల మాదిరిగానే ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకున్నా. ఇతరులను అనుకరించాల్సిన అవసరం లేదనుకున్నా. నాకంటూ నేను ఒక మార్గాన్ని ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించుకున్నా. నటుడిగా విజయం సాధించాలనుకొనే వారు ముందు తాము కూడా ప్రజల్లో ఒకరనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రజలకు ఏది నచ్చుతుందో వారికి కూడా అదే నచ్చాలి. అప్పుడే సక్సెస్‌!


ఈ మధ్య మీలాంటి యువ నటులు మల్టీ టాస్కింగ్‌ చేయటానికి ఇష్టపడుతున్నారు. మీరే స్ర్కిప్ట్‌ రాసుకుంటారు.. డైరక్షన్‌ చేస్తారు.. ఇవన్నీ ఎలా చేయగలుగుతారు?

ఇది ఏదో వ్యూహాత్మకంగా చేస్తున్నది కాదు. అవసరం కొద్ది చేస్తున్న విషయం. నాది ిసినిమానేపథ్యం కాదు. నాకు ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవటం వల్లే నేను కథలు రాసుకోవాల్సి వచ్చింది. దర్శకత్వం చేయాల్సి వచ్చింది. ‘క్షణం’ చిత్రంతో నాకు బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత నా ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలనే విషయాన్ని ఆలోచించేవాడిని. ఒక వైపు నాకంటే ముందు చాలామంది మంచి నటులు ఉన్నారు. మరో వైపు అనేక మాధ్యమాల ద్వారా ప్రజలకు ప్రపంచంలోని వివిధ భాషల్లో వచ్చిన సినిమాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను అందరూ గుర్తించాలంటే - మల్టీ టాస్కింగ్‌ చేయటం తప్పనిసరి అయింది. నటన, రచన- ఈ రెండూ నాకు ఉన్న బలాలు. దర్శకత్వం చేయాలంటే చాలా తెలివి ఉండాలి. నటనలో భావోద్వేగాలు పండిస్తే సరి. నిజానికి నాలో భావావేశం చాలా ఉంది. అదే తెరపై కనిపిస్తుంటుంది.


మేజర్‌ చిత్రం విశేషాలేంటీ... 

ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఈ సినిమా చేస్తున్నందుకు నాకు గర్వంగా కూడా ఉంది. అమితాబచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌, మహే్‌షబాబుకు కోట్ల మంది అభిమానులు ఉంటారు. ఇలాగే నేను కూడా మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ అభిమానిని. ఒక వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. ఈ సినిమా 80 శాతం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మాత్రమే మిగిలి ఉంది.  దీనిని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం. అందువల్ల రెట్టింపు పని చేస్తున్నాం. 


మీ అభిమాన రచయిత, కవి ఎవరు?

ఒక అభిమాన రచయిత, కవి అని ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ఒకో సమయంలో ఒకొక్కరు నచ్చుతూ ఉంటారు. ఉదాహరణకు నాకు డార్క్‌ నైట్‌ సినిమా స్ర్కిప్ట్‌ అంటే ఇష్టం. సాల్విడార్‌ డాలీ పెయింటింగ్స్‌ అంటే ఇష్టం. ‘లగాన్‌’లో జావేద్‌ అక్తర్‌ రాసిన పాటలంటే ఇష్టం. ‘అలవైకుంఠపురం’ చిత్రంలో త్రివిక్రమ్‌ రాసిన డైలాగ్స్‌ అంటే ఇష్టం. మాధ్యు మెక్‌నాగి రాసిన గ్రీన్‌లైట్స్‌ అనే పుస్తకమంటే ఇష్టం. ఇలా నా ఇష్టాఇష్టాలు మారిపోతుంటాయి. 


నటుల జీవితంలో అనేక ఎత్తుపల్లాలుంటాయి. వీటిని మీరు ఎలా తట్టుకుంటారు?

ప్రతి రోజు ఏదో ఒకటి చేయాలనే ఆశతో నిద్ర లేస్తా. అంతే కాదు. నేను చేసే ప్రతి పని నిజాయితీతో చేస్తా. శీతాకాలంలో ఒక చలిమంట చుట్టూ కూర్చుని కథలు చెబుతుంటే వినేవారికి ఎలా ఉండాలి? హాయిగా ఉండాలి.. బోరు కొట్టించకూడదు. మేము అలాంటి కథకులం. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను రంజింపచేయాలి. చేసే ప్రయత్నం గట్టిగా చేసి.. మిగిలినదంతా దేవుడిపై భారం వేసి వదిలేస్తా!


మీకు ఇష్టమైన హీరోయిన్లు ఎవరు?

ఎవరూ లేరు. శోభితతో రెండు సినిమాలు చేశాను. అందువల్ల మేము ఒకరినొకరు అర్థం చేసుకొని నటించగలుగుతాం. ‘మేజర్‌’లో నాతో పాటు నటించిన సేయి మంజేర్కర్‌ నటనంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఆమె నటించిన కొన్ని సీన్లు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా. ఇక నాతో సహనటిగా నటించిన అదా శర్మకు మంచి సెన్స్‌ఆఫ్‌ హ్యూమర్‌ ఉంది. 


మీ జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటున్నారు..

జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకొనే శక్తి.. జీవితం పట్ల అవగాహన ఉండాలి.  జీవితం పట్ల ఆశ కల్పించాలి. జీవితాన్ని ఎదురీదటానికి అదనపు శక్తిని ఇవ్వాలి. ఆశావాది అయి ఉండాలి. కలలు కనటానికి.. వాటిని సాఫల్యం చేసుకోవటానికి వెనకాడని వ్యక్తిగా తనుండాలి.


తెలుగు సినిమాలు ఎలా మారుతూ వస్తున్నాయి.. యువతరానికి నచ్చేలా ఉంటున్నాయా?

బాహుబలి మన తెలుగువారి ఆశల హద్దులను చెరిపేసింది. ప్రపంచమంతా మనదేననే విశ్వాసాన్ని ఇచ్చింది. తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదని చాటి చెప్పింది. అమీర్‌ఖాన్‌ ‘దంగల్‌’ చైనాలో విజయవంతం కావటం కూడా భారతీయులకు ఇలాంటి విశ్వాసాన్నే ఇచ్చింది. కథ విశ్వజనీనం అయినప్పుడు- బడ్జెట్‌, భాషలకు ప్రాధాన్యం ఉండదని ఈ సినిమాలు చెప్పాయి. ఇలాంటి చిత్రాలే యువతకు నచ్చుతున్నాయి. 

ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమాలు?

జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్యను పెద్ద స్ర్కీన్‌ మీద చూడాలని ఎదురుచూశా. కానీ కోవిడ్‌ వల్ల ఈ సినిమా మన దేశంలో కొన్ని చోట్లే విడుదల అయింది. అందువల్ల చూడలేకపోయా. అమెరికా ప్రయాణం చేసేప్పుడు విమానంలో ఈ సినిమా చూశా. అమెరికాలో ‘జాతిరత్నాలు’ చూశా. నెట్‌ఫ్లిక్స్‌లో ‘రాత్‌ అకేలీ హై’ చూశా. ఈ సినిమాలన్నీ నచ్చాయి.


అడివి శేష్‌ ‘కర్మ’సినిమాతో దర్శకుడిగా,హీరోగా పరిచయమయ్యాడు. పంజా,బాహుబలి, సైజ్‌జీరో లాంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు. 2016 లో వచ్చిన ‘క్షణం’ సినిమాతో అడివి శేష్‌ హవా ఆరంభమైంది. 2018లో వచ్చిన ‘గూఢచారి’, 2019లో వచ్చిన ‘ఎవరు’ చిత్రాలతో ప్రామిసింగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మేజర్‌’ చిత్రంలో నటించాడు. త్వరలో విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం ముంబై పేలుళ్లలో పోరాడిన వీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.