అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాతలకు ఫెసిలిటేషన్‌ కార్యాలయం

దేశంలో అనేక అంతర్జాతీయ చిత్రాల నిర్మాణం సాగుతున్నదని, దేశంలో మరిన్ని చిత్రాలను నిర్మించేలా చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర సమాచార, ప్రసారల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పష్టం చేశారు. అందులో భాగంగా సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ఒకే సారి జారీ చేయడానికి వీలుగా ఒక ఫెసిలిటేషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఫిక్కి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన 74వ కేన్స్‌ చలనచిత్రోత్సవంలో భారత పెవిలియన్‌ను కేంద్ర మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అనేక హాలివుడ్‌ చిత్రాలు తమ వీఎఫ్‌ఎక్స్‌ యానిమేషన్‌ను భారత్‌లో పూర్తి చేస్తున్నాయని చెప్పారు. కాగా, ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావెద్‌ ఆశ్రఫ్‌ మాట్లాడుతూ... భారతీయ సినిమాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌ ఒక ముఖ్యవేదికగా నిలుస్తుందని తెలిపారు. తద్వారా అంతర్జాతీయ సహకారంతో భారత్‌ ప్రపంచ సినిమా చిత్రీకరణ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వతంత్ర భారతావని సాధించిన ప్రగతికి సినిమా రంగం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి మాట్లాడుతూ...  కరోనా సవాళ్లను అధిగమించి చలన చిత్ర నిర్మాణంతో పాటు సాంస్కృతిక రంగం సాధించిన పురోగతిని భారత పెవీలియన్‌ ద్వారా ప్రదర్శిస్తు న్నామని చెప్పారు. ఇక ప్రాంతీయ సినిమాపై దృష్టిపెట్టడంతో సినిమా నిర్మాతలతో పాటు దేశ సినిమా రంగం సరైన దిశలో పయనిస్తోందని సీబీఎఫ్‌సీ చైర్మన్‌, రచయిత, కవి ప్రసూన్‌ జోషి అన్నారు. మంచి సినిమాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ ఉత్సవాలు ప్రపంచ సినీ రంగాన్ని ఒక్కతాటిపైకి తీసుకొస్తాయన్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.