సినిమా రివ్యూ (Cinema Review) : F3

ABN , First Publish Date - 2022-05-27T19:32:42+05:30 IST

సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వస్తోందంటే.. ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. రెండో భాగం ఎలా ఉంటుంది? కథ ఏమై ఉంటుంది? నటీనటుల పెర్ఫార్మెన్స్, కామెడీ ఏ స్థాయిలో ఉంటుంది? అనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది.

సినిమా రివ్యూ (Cinema Review) : F3

చిత్రం : ఎఫ్ 3

విడుదల తేదీ : మే 27, 2022

నటీనటులు : వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్,  మురళీ శర్మ, వై.విజయ, అన్నపూర్ణ, ప్రగతి, రఘుబాబు, వెన్నెల కిశోర్, పృధ్వీ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆలీ, వడ్లమాని, గోపరాజు రమణ, ప్రదీప్, శ్రీనివాసరెడ్డి, స్టంట్స్ శివ తదితరులు

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సినిమాటోగ్రఫీ : సాయిశ్రీరామ్

నిర్మాత : దిల్ రాజు

కథ - స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : అనిల్ రావిపూడి

సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వస్తోందంటే.. ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. రెండో భాగం ఎలా ఉంటుంది? కథ ఏమై ఉంటుంది? నటీనటుల పెర్ఫార్మెన్స్, కామెడీ ఏ స్థాయిలో ఉంటుంది? అనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. అలా ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘ఎఫ్ 3’. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అయినా.. అవే పాత్రలతో,  సరికొత్త కథతో .. మొదటి భాగాన్ని మించిన ఎంటర్ టైన్ మెంట్‌తో తెరకెక్కించామని ముందునుంచి చెప్పుకొస్తున్నారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే టీజర్, సింగిల్స్, ట్రైల‌ర్‌తో మరింతగా హైపు క్రియేట్ అయింది. ఈ రోజే (మే 27) థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని ఏమేరకు అందుకుంది? వెంకీ (Venky), వరుణ్‌ (Varun)ల కామెడీ ఏ స్థాయిలో వర్కవుట్ అయింది అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (F3 Movie Review)


కథ

డబ్బుపై వ్యామోహంతో అత్యాశకు పోయి, అడ్డమైన వ్యాపారాలు చేసి నిండా అప్పుల్లో కూరుకుపోతాడు వెంకీ (వెంకటేశ్). తనో పెద్ద కోటీశ్వరుడ్ని అయిపోయినట్టు కలలు కంటూంటాడు వరుణ్ (వరుణ్ తేజ్). చేతిలో చిల్లి కాసుండదు. మరో పక్క తమన్న, మెహ్రీన్ ఫ్యామిలీ రోడ్డు పక్కన ఒక హోటల్‌లో పుణుకులు, బజ్జీలు వేసి జీవిస్తుంటారు. వీళ్ళకి కూడా డబ్బుపై బోలెడంత పేరాశ. ఇంకో పక్క నిజాయితీగా డ్యూటీ చేస్తూ కమీషనర్ కుట్రకు బలైపోయి.. నిజాయితీగా ఉండలేక లైఫ్ లో సెటిలైపోదామనే ఆలోచనలో ఉంటాడు పోలీస్ నాగరాజు (రాజేంద్రప్రసాద్).ఈ నేపథ్యంలో వీరందరూ కలిసి ఒక క్రైమ్‌లో ఇరుక్కుంటారు. దాన్నుంచి బైటపడడానికి డబ్బే ప్రధానం అని నమ్ముతారు. ఇదిలా ఉంటే.. చిన్నప్పుడే తప్పిపోయిన వారసుడి కోసం వెతుకుతుంటాడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద ప్రసాద్ (మురళీశర్మ). తన కొడుకును తిరిగి రమ్మనమని ప్రకటనిస్తాడు. దాంతో ఆ పెద్దాయన ఆస్తికి వారసులమైపోడానికి ఒకరికి తెలియకుండా ఒకరు ఆయన బంగ్లాలోకి ప్రవేశిస్తారు. దాంతో వారిలో ఆయన తన కొడుకెవరు? అనే కన్ఫ్యూజన్‌లో ఉంటాడు. ఈ క్రమంలో ఆయన ఏం చేశాడు? ఇంతకీ వారు చేసిన క్రైమ్ ఏంటి? చివరికి ఆనంద్ ప్రసాద్ వారసుడు అక్కడికి తిరిగి వస్తాడా? అనేదే మిగతా కథ. (f3 movie Review)


విశ్లేషణ 

కామెడీలో సరికొత్త వెర్షన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనుడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకూ ఆయన అన్నిరకాల జోనర్స్‌లోనూ సినిమాలు తీసినా.. తన ప్రధాన బలం కామెడీని మాత్రం వదలిపెట్టలేదు. దాంతోనే ఆయన వరుసగా హిట్స్ కొట్టి అజేయ దర్శకుడు అనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ తీస్తే ఆ వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. ప్రేక్షకుల అంచనాలకు మించిన స్థాయిలో ‘ఎఫ్ 3’ చిత్రంలో హిలేరియస్ కామెడీని వర్కవుట్ చేశారు. కాకపోతే ‘ఎఫ్ 2’ చిత్రంతో పోల్చుకుంటే.. ఇందులో కథ అంతగా ఉండదు. కానీ నవ్వులకు మాత్రం ఏమాత్రం లోటుండదు. చిన్న స్టోరీ లైన్ తో తెరపై భారీ తారాగణంతో క్షణక్షణం నవ్వించడం అనిల్ రావిపూడికి మాత్రం చెల్లింది. అనిల్ ప్రతీ సినిమాలోనూ ప్రతీ పాత్రధారికీ ఓ మ్యానరిజం, రిపీటెడ్ గా వచ్చే ఒక థీమ్ లాంటిది ఉంటుంది. ఇందులోనూ దాన్ని అద్భుతంగా వర్కవుట్ చేశారు. అయితే ఎఫ్ 2 చిత్రంతో పోల్చుకుంటే దీనికి బోనస్ ఏంటంటే.. వెంకటేశ్ కు రేచీకటి, వరుణ్ తేజ్ కు నత్తి.. దాంతో వచ్చే డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకుల్ని పొట్టచెక్కలు చేస్తాయి. అలాగే.. ‘హిమ్మత్‌వాలా’ హిందీ సినిమాలోని తకతయ్యా తకతయ్యా హో.. అనే సాంగ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే మూర్ఛ సీన్స్ అన్నీ బ్రహ్మాండంగా పేలాయి. 


‘ఎఫ్ 2’ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ఇంటి ఎపిసోడ్  తరహాలో.. సెకండాఫ్ నుంచి కథ మురళీ శర్మ బంగ్లాకు షిఫ్ట్ అవుతుంది. పెద్దాయన్ను ఇంప్రెస్ చేయడానికి వెంకీ అండ్ టీమ్ పడే పాట్లు, ఒకరిని ఒకరు బకరాలు చేయాలనుకొనే సీన్స్, మగవేషంలో వచ్చిన తమన్నాతో ఒకమ్మాయి ప్రేమలో పడే సీన్, వారసులుగా వచ్చిన వారందరూ బుల్ తో చేసే ఫైట్ సీన్.. మరో పక్క కారు, కారులో ఉండే డబ్బు, వజ్రాలు కొట్టేసి..వాటిని డూప్లికేట్ అనుకొని తక్కువ రేట్ కు అమ్మేసే సత్య సీన్స్, పెద్దాయన్ను చంపాలనుకొని ఒక రౌడీ షీటర్ ను పృధ్వి బృందం..  ఆ బంగ్లాలోకి పనిమనిషిగా ప్రవేశపెట్టే సీన్, ఆట బొమ్మల నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ భలేగా నవ్విస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వెంకీ నారప్ప గెటప్ లోనూ, వరుణ్ వకీల్ సాబ్ గెటప్ లోనూ చేసే కామెడీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇక వారసులుగా వచ్చిన వెంకీ అండ్ టీమ్ కు మురళీ శర్మ ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. (f3 movie Review)


వెంకీగా విక్టరీ వెంకటేశ్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.  రేచీకటి మ్యానరిజమ్‌తో హిలేరియస్ గా నవ్విస్తాడు. అలాగే వరుణ్ తేజ్ నత్తి, దాంతో పాటు వేసే డ్యాన్సింగ్ మూమెంట్స్ బాగా నవ్విస్తాయి. తమన్నా, మెహ్రీన్ గ్లామర్ అపీరెన్స్, వారిచ్చే శాస్త్రీ బామ్ ట్రీట్ మెంట్ మంచి వినోదాన్ని అందిస్తాయి. ఇక ప్రగతి, వైవిజయ, అన్నపూర్ణ, ప్రదీప్ కలయికలో వచ్చే సీన్స్ అయితే చెప్పనక్కర్లేదు. అందరూ అద్భుతమైన కామెడీని పండించారు. రాజేంద్రప్రసాద్,  పాలబేబీగా ఆలీ, సునీల్, వెన్నెల కిషోర్,  రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ, సంపత్ రాజ్ తమ తమ పాత్రలతో చెలరేగిపోయారు. ‘ఎఫ్ 2’ తో పోల్చుకొని ‘ఎఫ్ 3’ చిత్రం కథాకథనాల్ని అంచనా వేస్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. చివరలో అనిల్ రావిపూడి బస్ డ్రైవర్‌గా  కనిపించి.. ఎఫ్ 4 ఉన్నట్టు చెప్పడం కొసమెరుపు. మొత్తానికి ఈ సమ్మర్ లో ‘ఎఫ్ 3’ చిత్రం అందించే వినోదానికి ప్రేక్షకులు బాగా రిలీఫ్ అవుతారని చెప్పుకోవచ్చు. (f3 movie Review)  

ట్యాగ్ లైన్ : మోర్ ఫన్.. మోర్ ఫ్రస్ట్రేషన్ 

Updated Date - 2022-05-27T19:32:42+05:30 IST