సినిమా రివ్యూ : ఈటి

Twitter IconWatsapp IconFacebook Icon
సినిమా రివ్యూ : ఈటి

చిత్రం : ఈటి 

విడుదల తేదీ : మార్చ్ 10, 2022

నటీనటులు : సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్, శరణ్య, సత్యరాజ్, వినయ్ రాయ్, ఇళవరసు, జయప్రకాశ్, సూరి, హరీశ్ పేరడి, రెడిన్ కింగ్‌స్లే, పుగళ్, దేవదర్శిని, మధుసూదనరావు, వేలా రామ్మూర్తి, సిబి భువనచంద్రన్, శరణ్ శక్తి, సుబ్బు పంచు తదితరులు

ఛాయాగ్రహణం : ఆర్.రత్నవేలు

ఎడిటర్ : రూబెన్

సంగీతం : డి.ఇమాన్

నిర్మాణం : సన్ పిక్చర్స్

దర్శకత్వం : పాండిరాజ్

హీరో సూర్య తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు.  ప్రతీ తమిళ చిత్రాన్ని అదే రోజు తెలుగులోనూ విడుదల చేయడం అతడు ఎప్పటినుంచో కొనసాగిస్తున్నాడు. గత రెండు చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా, జైభీమ్’ లను అన్ని భాషల్లోనూ అదే రోజు విడుదల చేసి మంచి సక్సె్స్ సాధించిన సూర్య.. చాలా రోజుల తర్వాత తన తాజా చిత్రం ‘ఎదర్కుమ్ తునిందవన్’ ను ‘ఈటీ’ అనే అబ్రివేటెడ్ రూపంగా పలు భాషల్లో ఈరోజే (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల చేశాడు. తెలుగులో ‘ఎవరికీ తలవంచడు’ అనే పేరు పెట్టి.. దాన్ని ఈటీగా విడుదల చేశారు. మరి ఈ సినిమాతో సూర్య హ్యాట్రిక్ హిట్ సాధించాడా? సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుంది అనే విషయాలు రివ్యూలో చూద్దాం.   

కథ

కృష్ణమూర్తి (సూర్య) లాయర్. ఒక గ్రామంలో తల్లి (శరణ్య), తండ్రి (సత్యరాజ్ ) తో సామాన్యజీవితం గడుపుతుంటాడు. తమ గ్రామానికీ, పక్క గ్రామానికి ఒక విషయంపై గొడవ జరిగి రాకపోకలు ఆపేస్తారు. అలాగే .. ఈ ఊరు అమ్మాయిల్ని ఆ ఊరు వాళ్ళకి, ఆ ఊరు అమ్మాయిల్ని ఈ ఊరువాళ్ళకి సంబంధాలు కలుపుకోడం కూడా మానేస్తారు. ఈ క్రమంలో సూర్య పక్క గ్రామం అమ్మాయైన ఆదిరా (ప్రియాంకా అరుళ్ మోహన్ )తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది.  కొన్ని నాటకీయ పరిమాణాల మధ్య ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఈ క్రమంలో సూర్య గ్రామానికి చెందిన కొందరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడమో, యాక్సిడెంట్ లో చనిపోవడమో జరుగుతుంది. దీని వెనుక రాజకీయంగా పలుకుబడి కలిగిన కామేశ్ (వినయ్ రాయ్ ) కారణమని తెలుస్తుంది. చిన్నతనంలోనే తన అక్క మానభంగానికి గురై చనిపోవడంతో.. అప్పుడు ఏమీ చేయలేకపోయామన్న బాధతో కష్టపడి లాయర్ అయిన కృష్ణమూర్తి తమ గ్రామంలోని అమ్మాయిలు తమ అక్కలా బలైపోకూడదనే ఉద్దేశంతో కామేష్ ను చట్టపరంగా శిక్షించాలని తీవ్రంగా ప్రయత్ని్స్తాడు. చివరికి కృష్ణమూర్తి కామేష్ ను ఎలా శిక్షించాడు? దానికోసం అతడు ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ 

ఈ సినిమాకి ఎంచుకొన్న కాన్సెప్ట్ మంచిదే. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. వారిని ట్రాప్ చేయడానికి నేరస్తులు టెక్నాలజీని వాడుకొనే విధానం.. వారికి తెలియకుండా వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో బైటపెడతానని బ్లాక్ మెయిల్ చేసి వారిని బలిపశువుల్ని చేయడం.. ఈ అంశాలతో ఆడపిల్లల్లో అవేర్ నెస్ కలిగించాలనే ఉద్దేశంతో దర్శకుడు ఈ కథాంశాన్ని ఎంచుకోవడం అభినందనీయం. అయితే ఇలాంటి కథాంశానికి స్ర్కీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ గా ఉండాలి. ఆసక్తికరమైన మలుపులతో ఆద్యంతం కూర్చోబెట్టగలగాలి.  ఈ సినిమాలో అదే మిస్ అయింది. చెప్పాలనుకున్న పాయింట్ ను తెరమీద ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు.  సీరియస్ విషయాన్ని సిన్సియర్‌గా చెప్పడానికి బదులు..  కథాంశంలో కామెడీని బలవంతంగా ఇరికించడం వల్ల దర్శకుడి ప్రధాన లక్ష్యం దెబ్బతింది. దాంతో కథాకథనాలు కుంటుబడ్డాయి. అరవ అతితో ప్రధమార్ధం అంతా బోరింగ్ గా సాగుతుంది. హీరో ఫ్యామిలీ మెంబర్స్, హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆసక్తిగా ఉండడంతో సకండాఫ్ పై ఉత్సుకత కలుగుతుంది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కదిలిస్తాయి. అయితే కొన్ని సీన్స్ రొటీన్ ఫీల్ ను కలిగిస్తాయి. 


లాయర్ కృష్ణ మూర్తిగా సూర్య తనదైన శైలిలో నటించి మెప్పించాడు. చక్కటి ఎమోషన్స్ ను పలికించాడు. అలాగే. యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. ఆదిరా గా ప్రియాంకా అరుళ్ మోహన్ పర్వాలేదనిపిస్తుంది. సూర్య తండ్రిగా సత్యరాజ్ , తల్లిగా శరణ్య తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హీరోయిన్ తండ్రిగా ఇళవరసు సీరియస్  కామెడీని బాగా పండించాడు. ఇక విలన్ గా వినయ్ రాయ్.. డిటెక్టివ్ తరహాలోనే పాలిష్డ్ విలనీని ఇందులోనూ కంటిన్యూ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇమాన్ సంగీతం, రత్నవేలు కెమేరా పనితనం మెప్పిస్తాయి. మొత్తం మీద ఈటీ సినిమా సూర్య స్థాయికి తగ్గ సినిమా కాదని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్స్‌ని, అరవకామెడీని ఇష్టపడే వారికి ఈ ఈటీ సినిమా బెటర్ ఆప్షన్.

ట్యాగ్ లైన్ : రొటీన్ థ్రిల్లర్ 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.