‘ఎంత మంచివాడ‌వురా’ రివ్యూ

ABN , First Publish Date - 2020-02-02T00:26:08+05:30 IST

హీరోగా, నిర్మాత‌గా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ వ‌చ్చిన హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తొలిసారి న‌టించిన కుటుంబం క‌థా చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. గుజరాతీ

‘ఎంత మంచివాడ‌వురా’ రివ్యూ

బ్యాన‌ర్‌: శ్రీదేవి మూవీస్‌, ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌

నిర్మాతలు: ఉమేష్‌ గుప్త‌, సుభాష్ గుప్త‌

సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్,

సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌

సంగీతం: గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: రామాంజ‌నేయులు

సెన్సార్‌: యు

 

హీరోగా, నిర్మాత‌గా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ వ‌చ్చిన హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తొలిసారి న‌టించిన కుటుంబం క‌థా చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. గుజరాతీ సినిమాకు ఇది రీమేక్‌. జాతీయ అవార్డు ద‌క్కించుకున్న శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. పిల్ల‌ల‌కు దూరంగా ఉండే త‌ల్లిదండ్రుల మాన‌సిక వేద‌న‌ను శ‌త‌మానం భ‌వ‌తిలో..., పెళ్లి ప్రాముఖ్య‌త గురించి శ్రీనివాస క‌ల్యాణం చిత్రంలో చూపించిన ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాతో ఏం చెప్పాల‌నుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు యాక్ష సినిమాలే చేసిన క‌ల్యాణ్‌రామ్‌ని ఎంత కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే క‌థ చ‌దివేయాల్సిందే...

క‌థ‌:

బాలు(నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌)కి బందువులు, బంధుత్వాలు అంటే ఇష్టం. అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో బాలు అనాథ అవుతాడు. బంధులంద‌రూ అత‌న్ని ఒంట‌రివాడిని చేస్తారు. ఆ స‌మ‌యంలో నాన్న స్నేహితుడు(న‌రేశ్‌) అత‌న్ని ఆద‌రిస్తాడు. ఓ హాస్ట‌ల్‌లో చేర్చి ఏదైనా స‌హాయం కావాలంటే అడ‌గ‌మ‌ని చెబుతాడు. చిన్న‌ప్ప‌ట‌టి నుండి బాలు మ‌న‌స్త‌త్వాన్ని ఇష్ట‌ప‌డ్డ నందు(మెహ‌రీన్‌) ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాల‌ని అనుకోవాల‌నుకుంటుంది. బాలుని హీరో అని పిలుస్తూ అత‌నితో షార్ట్ ఫిలింస్ నిర్మిస్తుంటుంది. అయితే బాలు ఒక్కొక్క‌సారి క‌న‌ప‌డ‌కుండా పోతుంటాడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న అనుమానంగా ఉండ‌టంతో నందు త‌న స్నేహితుల స‌హాయంతో ఆరా తీయిస్తే బాలు త‌న‌కు బంధువులే కానీ వ్య‌క్తుల‌తో బంధుత్వాలు క‌లుపుకుంటూ ఉంటాడ‌ని తెలుసుకుంటుంది. అదే విష‌యాన్ని అడిగితే బాలు అస‌లు విష‌యం చెబుతాడు. అస‌లు బాలు ఏం చెబుతాడు? బాలు వేర్వేరు పేర్ల‌తో బంధుత్వాలు ఎందుకు క‌లుపుకుంటూ ఉంటాడు? వీటి వ‌ల్ల బాలు ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటాడు? చివ‌ర‌కు బాలు జీవితం ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది?

 

విశ్లేష‌ణ‌:

బంధువులు, బంధుత్వాలు మ‌న‌లోని బాధ‌ను, ఒంట‌రిత‌నాన్ని దూరం చేస్తారు. అనే ఓ పాయింట్‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఎంత‌మంచివాడ‌వురా`. గ‌తంలో ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన శ‌త‌మానం భ‌వ‌తి జాతీయ స్థాయి అవార్డు ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో త‌ల్లిదండ్రుల‌ను కొడుకులు విడిచిపెట్టి విదేశాల్లోనే ఉంటే వారు ప‌డే మాన‌సిక బాధ‌ను చూపించాడు. త‌ర్వాత `శ్రీనివాస‌క‌ల్యాణం` చిత్రంలో పెళ్లి గొప్ప‌త‌నాన్ని చెప్పిన స‌తీశ్‌.. ఈసారి ఒంటిరిగా ఉండేవాళ్లు, వాళ్ల మ‌న‌సులోని బాధ‌ను దూరం చేసుకోవ‌డానికి బంధాలు కావాల‌నుకున్న‌ప్పుడు అలాంటి బంధాల‌ను క‌ల్పిస్తే ఎలా ఉంటుంది. మ‌న చుట్టూ ఉన్న‌వారిని న‌వ్వుతూ ప‌ల‌క‌రించాలి.. బంధుత్వం అనేది ర‌క్త సంబంధాన్ని బ‌ట్టే కాకుండా మ‌న‌సుని బ‌ట్టి కూడా ఏర్ప‌డుతుంద‌ని చెప్పే చిత్రంగా దీన్ని మ‌లిచాడు. అయితే దర్శ‌కుడు ఎక్క‌డా ఎక్కువ ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సినిమాను న‌డింపించ‌లేదు. అహ్లాదంగా న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు యాక్ష‌న్ సినిమాల‌నే చేస్తూ వ‌చ్చిన హీరో క‌ల్యాణ్ రామ్ పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంలో న‌టించాడు. తన పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశాడు. ఇక అత‌న్ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకోవాల‌నే వ్య‌క్తిగా మెహ‌రీన్ చ‌క్క‌గా న‌టించింది. ఇక న‌రేశ్‌, శ‌ర‌త్‌బాబు, ప‌విత్ర‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజీవ్ క‌న‌కాల‌, విజ‌య్ కుమార్ త‌దిత‌రులు వారివారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.

 

గోపీ సుంద‌ర్ పాట‌లు ఆక‌ట్టుకునేలా లేవు. నేప‌థ్య సంగీతం ఓకే. రాజ్‌తోట సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్ర‌తి స‌న్నివేశం రిచ్‌గా, నేచుర‌ల్‌గా బావుంది. శ‌త‌మానం భ‌వ‌తి, శ్రీనివాస క‌ల్యాణం చిత్రాల్లో విల‌నిజాన్ని చూపించ‌ని ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాలో విలనిజాన్ని కూడా యాడ్ చేశాడు. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బావున్నా.. దాన్ని స్లో నెరేష‌న్‌లో తెర‌కెక్కించ‌డంతో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి సినిమా భారంగా న‌డుస్తున్న‌ట్లు అనిపిస్తుంది.

బోట‌మ్ లైన్‌: నెమ్మ‌దిగా న‌డిచే ‘ఎంత మంచివాడ‌వురా’

రేటింగ్‌: 2.5/5

Updated Date - 2020-02-02T00:26:08+05:30 IST