‘‘సదా నన్ను నడిపే’ ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన చిత్రం. ‘గీతాంజలి’, ‘కలిసుందాం రా’ లాంటి ప్రేమకథా చిత్రాల తరహాలో సాగుతుంది’ అని ప్రతీక్ ప్రేమ్ కరణ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రతీక్ మాట్లాడుతూ...
దర్శకుడిని అవ్వాలనే కోరికతో పరిశ్రమకు వచ్చాను. కానీ అనుకోకుండా హీరోన య్యాను. 2017లో విడుదలైన ‘వానవిల్లు’ హీరోగా నా తొలిచిత్రం. తర్వాత ‘సదా నన్ను నడిపే’ కథ రాసుకున్నాను. మధ్యలో కొవిడ్ రావడంతో రెండేళ్ల జాప్యం జరిగింది.
కర్నాటకలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథ ఇది. ఎంతో ప్రేమించిన వ్యక్తి చివరి క్షణాల్లో ఉంటే, మిగిలిన ఆ కొన్ని రోజులు వారితో ఎలా గడుపుతాం అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. చివరి 25 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. కథ కన్నా ఎమోషన్‌కు ప్రేక్షకులు ఎక్కువ కనెక్టవుతారు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం కూడా నేనే అందించాను. ప్రస్తుతం ఒక సినిమా, వెబ్‌సిరీస్ చేస్తున్నాను.