అమెజాన్ ప్రైమ్‌లో 503వ చిత్రంగా విడుదలైన ‘ఏకమ్’ చిత్రం.. కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని అందరి దృష్టినీ ఆకర్షించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు చిత్ర దర్శకుడు వరుణ్ వంశీ. ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్ వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి- పూజ.ఎమ్ - శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘ఏకమ్’. ‘ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్’ అన్నది ఉపశీర్షిక. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి వంటివారు ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. రీసెంట్గా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. విడుదలైన పది రోజుల్లోనే ఈ చిత్రం టాప్-10లో స్థానం సంపాదించుకోవడం విశేషం.
పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా.. తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన ఈ చిత్రానికి ఇంత మంచి స్పందన వస్తున్నందుకు దర్శకుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఏకమ్’ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఏకగ్రీవంగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాతల పెట్టుబడిని సేఫ్‌గా వెనక్కి తెస్తుండడంతోపాటు... దర్శకుడిగా నాకు మరో సినిమా వచ్చేలా ఈ చిత్రం చేసింది. ప్రస్తుతం అమెజాన్‌లో టాప్ 10లో ఉన్న ఈ చిత్రం.. అతి త్వరలో మొదటి రెండు మూడు స్థానాల్లో సగర్వంగా నిలుస్తుందనే నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్‌తో పాటు.. ఈ చిత్ర రూపకల్పనలో తోడ్పాటుని అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.