డబ్బింగ్‌ సిరీస్‌కు డబ్బులే డబ్బులు!

ABN , First Publish Date - 2021-11-28T08:18:34+05:30 IST

తెలుగులోకి డబ్‌ అవుతున్న ఇతర భాషా చిత్రాలు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సినిమాలు హిట్‌ కొడుతున్నాయి.....

డబ్బింగ్‌ సిరీస్‌కు డబ్బులే డబ్బులు!

తెలుగులోకి డబ్‌ అవుతున్న ఇతర భాషా చిత్రాలు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి.  సినిమాలు హిట్‌ కొడుతున్నాయి. ఆ మధ్య కొంతకాలం డబ్బింగ్‌ సినిమాల గురించి ఎవరూ  పెద్దగా పట్టించుకోవకపోయినా, ద్విభాషా చిత్రం అనే పేరుతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవు తూ స్ట్రయిట్‌ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అలాగే శాటిలైట్‌ ఛానెళ్లులో సీరియల్స్‌కు ఆదరణ పెరిగిన తర్వాత హిందీ, తమిళ సీరియల్స్‌ తెలుగులోకి అనువాదమై మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి.  ఇప్పుడు వెబ్‌సిరీస్‌ల వంతు.


అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి దిగ్గజ ఓటీటీ సంస్థలు మొదలుకొని చిన్న ప్లాట్‌ఫామ్‌లు కూడా డబ్బింగ్‌ సిరీస్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ దక్కించుకున్న పలు వెబ్‌సిరీస్‌లను ప్రాంతీయ భాషల్లో డబ్‌ చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒరిజినల్‌ సీరీస్‌ నిర్మించడానికి  కోట్లలో ఖర్చవుతోంది. అలా కాకుండా ఒక భాషలో తీసిన సిరీస్‌ను చాలా తక్కువ ఖర్చుతో ఇతర భాషల్లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నారు. ఉన్న చందాదారులను కాపాడుకుంటూ కొత్తవాళ్లకి గాలం వేస్తున్నాయి. తద్వారా ఈ డబ్బింగ్‌సిరీస్‌లను మంచి ఆదాయ మార్గంగా ఓటీటీ సంస్థలు  మార్చుకుంటున్నాయి. 


‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ సిరీస్‌తో ఇండియాలో వెబ్‌సిరీస్‌లకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ‘మనీ హెయిస్ట్‌’లాంటివి వెబ్‌సిరీస్‌ కల్చర్‌ను ఇక్కడి ప్రేక్షకులకు అలవాటు చేశాయి.  అలాగే హిందీలో వచ్చిన ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’, ‘మీర్జాపూర్‌’, ‘పాతాళ్‌లోక్‌’, ‘స్కామ్‌ 1992’ కూడా  ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇంగ్లీష్‌, హిందీ భాషలు తెలిసిన ప్రేక్షకులకు మాత్రమే ఇవి చేరువయ్యాయి. అయితే భాష అర్ధంకానీ ప్రేక్షకులు మాత్రం మొదట్లో వీటికి దూరంగానే ఉన్నారు.  ప్రాంతీయ భాషల ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో  చందాదారులుగా చేర్చుకొనే ఉద్దేశ్యంతో ఓటీటీ సంస్థలు ప్రముఖ వెబ్‌సిరీస్‌లను తెలుగులో డబ్‌ చేసి  అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల  ఓటీటీల్లో క్రమంగా డబ్బింగ్‌ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది.  


వెబ్‌సిరీస్‌ హిట్టయితే సీజన్ల మీద సీజన్లు తీయవచ్చు. చందాదారుల సంఖ్య పెరుగుతుంది. కొంచెం లేటుగా అయినా తెలుగులో డబ్‌ చేసి వదులుతున్నారు. హిందీ, ఇంగ్లీష్‌,కొరియన్‌, ఫ్రెంచి వెబ్‌సిరీస్‌లను కూడా ఓటీటీ సంస్థలు తెలుగులో డబ్‌ చేస్తున్నాయి. 


అమెజాన్‌ ప్రైమ్‌

యావద్దేశంతో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన వెబ్‌సిరీస్‌ ‘మీర్జాపూర్‌’. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలయిన ఈ సిరీస్‌ తొలి సీజన్‌ పలు భాషల్లో డబ్‌ అయింది. ఇతర భాషల కన్నా తెలుగులో సూపర్‌హిట్‌ అయుందని చెప్పాలి. దీనికి కారణం డబ్బింగ్‌ పర్‌ఫెక్ట్‌గా కుదరటమే.  వెబ్‌సిరీస్‌ డబ్బింగ్‌లో ‘మీర్జాపూర్‌’ కొన్ని ప్రమాణాలను సెట్‌ చేసిందని చెప్పవచ్చు. అసభ్యకరమైన సంభాషణలు మోతాదుకు మించి ఉన్నా మన ప్రేక్షకులు ఆదరించారు. సెకండ్‌ సీజన్‌ ను కూడా తెలుగులో చూడాలని ప్రేక్షకులు తహతహలాడారు. సెకండ్‌ సీజన్‌ రిలీజ్‌ ప్రకటించగానే తెలుగులో కూడా విడుదల చేయాలని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దాంతో కొంత ఆలస్యంగా తెలుగు, తమిళంలో ‘మీర్జాపూర్‌’ సీజన్‌ 2ను విడుదల చేశారు. 


- రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘ద ఫర్‌గాటెన్‌ ఆర్మీ’ వెబ్‌సిరీస్‌ తెలుగులో డబ్‌ అయింది. బ్రిటిష్‌ ఆర్మీ తరపున జపాన్‌పై పోరాడేందుకు సింగపూర్‌ వెళ్లిన ఇండియన్‌ సోల్జర్స్‌ ఆ యుద్ధంలో జపాన్‌ చేతికి బందీలుగా చిక్కాక ఏం జరిగిందనేది కథ. బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఈ వెబ్‌సిరీస్‌ను ప్రొడ్యూస్‌ చేశారు. సైనికుల ధీరోదాత్తత, యుద్ధ సన్నివేశాలు, 1940 నాటి యుద్ధ వాతావరణం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.  అమెజాన్‌  ప్రైమ్‌ సంస్థ  తెలుగులో డబ్‌ చేసిన  ఈ సిరీస్‌ మంచి ఆదరణ లభించింది. 


- వెబ్‌సిరీస్‌లను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన ఘనత నిస్సందేహంగా ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీస్‌దే. దేశాన్ని కాపాడే ఎక్సట్రార్డినరీ హీరో  కథలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ గూఢచారిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈ సిరీస్‌ సీజన్‌ 1, 2 ప్రైమ్‌లో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. సమంత లీడ్‌రోల్‌ చేయడంతో సీజన్‌ 2కు తెలుగు, తమిళ భాషల్లో మరింత ఆదరణ దక్కింది,వీటితో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ రూపొందించిన తొలి హిందీ వెబ్‌సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ తెలుగులో డబ్‌ అయింది. మాధవన్‌ లీడ్‌రోల్‌లో నటించిన ‘బ్రీత్‌’ , ‘పాతాళ్‌లోక్‌’తో పాటు ఇంగ్లీష్‌ వెబ్‌సీరీస్‌ ‘జాక్‌ ర్యాన్‌’, సూపర్‌ హీరోస్‌ టీవీ షో ‘ద బాయ్స్‌’, ‘డామ్‌’, బ్రెజిలియన్‌ వెబ్‌సిరీస్‌ ‘ద లాస్ట్‌ హవర్‌’ లాంటి పలు పాపులర్‌ వెబ్‌సిరీస్‌లను తెలుగులో డబ్‌ చేసింది ప్రైమ్‌ సంస్థ. 


ఎంఎక్స్‌ ప్లేయర్‌

డిజిటల్‌ ప్రపంచంలో ఎదురయ్యే నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘లిమిట్‌ లెస్‌’ సినిమా సక్సెసవ్వడంతో దాన్నే సిరీస్‌గా తీశారు. ఐదు భాగాలు ఎంఎక్స్‌ ప్లేయర్‌లో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఇదే ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘హై’ వెబ్‌ సిరీస్‌ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 


జీ 5

తమిళ వెబ్‌సిరీస్‌ ‘ఫింగర్‌ టిప్‌’ వెబ్‌సిరీస్‌ను జీ 5 తెలుగులో  విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘కాఫిర్‌’ వెబ్‌సిరీస్‌ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘కోడ్‌ ఎం’ సిరీస్‌ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు తెలుగులో ఉన్నాయి. స్పానిష్‌ సిరీస్‌ ‘పాబ్లో ఎస్కోబార్‌’ను తెలుగులో రెండు  సీజన్లుగా విడుదల చేశారు. 

నెట్‌ఫ్లిక్స్‌లో 

బ్రిటిష్‌ వెబ్‌సిరీస్‌ ‘బి హైండ్‌ హర్‌ ఐస్‌’, స్పానిష్‌ సిరీస్‌ ‘మనీహెయిస్ట్‌’ మొత్తం ఐదు సీజన్లు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. 


హాట్‌స్టార్‌లో

హిందీలో వచ్చిన ‘క్రిమినల్‌ జస్టిస్‌’ సిరీస్‌,  బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే తెరకెక్కించిన ‘స్పెషల్‌ ఆప్స్‌’ హాట్‌స్టార్‌లో తెలుగులో రిలీజ్‌ చేశారు. ‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌ను ఆరు భాషల్లో విడుదల చేశారు. 


సోనీలివ్‌

ఓటీటీల్లో చివరి స్థానంలో ఉన్న సోనీ లివ్‌కు ‘స్కామ్‌ 1992’ ఒక్క సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.ప్రతీక్‌గాంధీ పెర్‌ఫార్మెన్స్‌. ఐఎండీబీ రికార్డులను బ్రేక్‌ చేసింది.  మొత్తం 10 ఎపిసోడ్స్‌. తెలుగులో సహా మరో నాలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ‘మహారాణి’ సిరీస్‌ కూడా తెలుగులో డబ్‌ చేయగా మంచి ఆదరణ దక్కింది. 


డబ్బింగ్‌ కంటెంట్‌తో 

విస్తరణ వ్యూహంలో డబ్బింగ్‌ కంటెంట్‌ ఓటీటీలకు మంచి ఆయుధంగా మారింది. ఇప్పటికే మెట్రో నగరాల్లో విద్యావంతులైన వారు ఓటీటీలకు అలవాటుపడ్డారు. తదుపరి దశలో ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో  సబ్‌స్ర్కైబర్ల సంఖ్యను పెంచుకోవడం ఓటీటీ వేదికలకు లక్ష్యంగా  మారింది. మాతృభాష తప్ప ఇతర భాష తెలియని ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే కంటెంట్‌ ఇస్తే తప్ప చందాదారుల సంఖ్య పెరగదు. అందుకే వారిని ఆకట్టుకోవడానికి తమ వెబ్‌సిరీస్‌లను ప్రాంతీయ భాషల్లోకి డబ్‌ చేసి అందిస్తున్నాయి. దీనివల్ల మారుమూల పల్లెల్లో కూడా చందాదారులు పెరుగుతున్నారు. కంటెంట్‌ను డబ్‌ చేసి అందిస్తే ఒరిజినల్స్‌కు దక్కినంతగా ఆదరణ దక్కుతోంది. ప్రాంతీయ భాషలకు చెందిన ఓటీటీ సంస్థల పోటీని తట్టుకోవడానికి దిగ్గజ సంస్థలు డబ్బింగ్‌ మార్గం పట్టడానికి మరో కారణం.

Updated Date - 2021-11-28T08:18:34+05:30 IST