కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్‌ లేనట్టేనా?

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై యువ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ - హీరో కార్తీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఖైదీ’. ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం రెండో భాగం నిర్మించాలన్న ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. కానీ, ఇపుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే, ఈ చిత్ర నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభుపై కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. తన కథను చోరీ చేసి ‘ఖైదీ’ చిత్రాన్ని నిర్మించారని, అందువల్ల తనకు రూ.4 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కేరళ రాష్ట్ర హైకోర్టు.. నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభుకు నోటీసులు జారీ చేసింది. పైగా ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి అనువదించరాదని, రీమేక్‌ కూడా చేయరాదనీ, రెండో భాగం (సీక్వెల్‌) కూడా తీయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 


కాగా, గత 2019లో వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించడమే కాకుండా నిర్మాతకు కాసుల పంట పండించింది. హీరో కార్తీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, కేరళ రాష్ట్రంలోని కొల్లం ప్రాంతానికి చెందిన రాజీవ్‌ రంజన్‌ అనే వ్యక్తి కోర్టుకెక్కడంతో ఈ చిత్రానికి చిక్కులు ఉత్పన్నమయ్యాయి. గత 2007లో పుళల్‌ జైలులో తనకు ఎదురైన సంఘటలను ఒక కథగా రాసి.. ఆ కథను నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభుకు వినిపించానని, కథ నచ్చడంతో సినిమా తీద్దామని చెప్పి రూ.10 వేల అడ్వాన్స్‌ కూడా ఇచ్చారని, ఆ తర్వాత ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొనడంతో ఈ చిత్రం ఇపుడు వివాదంలో చిక్కుకుంది. 


ఇదిలావుంటే, తమకు కేరళ హైకోర్టు నోటీసులు పంపించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై డ్రీమ్‌ వారియర్‌ నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందించారు. కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టు మీడియాలోనే వార్తలు వస్తున్నాయని, తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆ సంస్థ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.