మరీ ఇంత దారుణమా?.. వారిని శిక్షించాలంటున్న హీరోయిన్లు

తిరువనంతపురం: లాబ్రాడర్ ‘బ్రూనో’ అనే పెంపుడు శునకాన్ని కేరళలో దారుణంగా హింసించి చంపిన ఘటనపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాలీవుడ్ హీరోయిన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఓ పడవ వద్ద కూర్చున్న శునకాన్ని చూసిన ముగ్గురు యువకులు చేపలు వేటకు ఉపయోగించే గేలానికి దానిని తగిలించి కర్రలతో చావబాదారు.


వారి దెబ్బలకు తాళలేని శునకం ప్రాణాలు వదిలింది. దీంతో వారు ఆ శునకాన్ని సముద్రంలోకి విసిరేశారు. నిందితుల్లో ఒకడు శునకాన్ని చావబాదుతున్నప్పుడు వీడియో తీశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ పేరుతో ఆ వీడియోను షేర్ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ శునకం యజమానుల్లో ఒకరైన క్రీస్తురాజ్ ఆ దారుణ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

శునకంపై దాడిని తీవ్రంగా ఖండించిన బాలీవుడ్ హీరోయిన్లు తమ సంతాపం తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.


‘జస్టిస్ ఫర్ బ్రూనో’ పేర్లతో ట్వీట్లు చేస్తున్నారు. ఇది చాలా దారుణమని, దీని నుంచి నిందితులు తప్పించుకోలేరని నటి అలియాభట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. వారిని శిక్షించనంత వరకు ప్రజలు మారరని పేర్కొంది. నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని దిశా పఠానీ డిమాండ్ చేసింది.  ‘రాక్షసులు’ అని నిందితులను అనుష్కశర్మ అభివర్ణించింది. ఇది చాలా తీవ్రమైన నేరమని, చట్టప్రకారం నిందితులను శిక్షించాలని మలైకా అరోరా సహా మరెందరో బాలీవుడ్ నటీనటులు డిమాండ్ చేస్తున్నారు. 


కాగా, శునకం యజమాని త్రివేండ్రమ్‌లోని విళిన్నమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన కొందరు యువకులు ఇనుపరాడ్లతో ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటికొచ్చి బెదిరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో పోలీసులు  ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒక బాలుడు కూడా ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.