ఆ పది నిమిషాలు అస్సలు మిస్ అవ్వొద్దు
ABN , First Publish Date - 2022-01-11T09:50:31+05:30 IST
‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు గల్లా అశోక్‌ని ‘హీరో’గా తీర్చిదిద్దాడు...

‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు గల్లా అశోక్‌ని ‘హీరో’గా తీర్చిదిద్దాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ‘‘హీరో అవ్వాలనుకునే ఓ కుర్రాడి కథ ఇది. అందుకే ఆ పేరు పెట్టాం. పక్కా కమర్షియల్ సినిమా ఇది. రెండు గంటల పాటు నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమాలోని తొలి పది నిమిషాలూ అస్సలు మిస్ అవ్వొద్దు. ఆ ఎపిసోడ్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇంత వరకూ ఎవరూ టచ్ చేయని విషయాన్ని ఈసినిమాలో చెప్పాం. అశోక్ కి ఇది తొలి సినిమా. అయినా సరే, చాలా బాగా నటించాడు. అసలు కొత్తవాడన్న ఫీలింగే రాదు. తన కామెడీ టైమింగ్ చాలా బాగా నచ్చుతుంది. డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు. నిధి అగర్వాల్ చాలా ప్రొఫెషనల్‌గా నటించింది. గ్లామర్‌గా ఉంటూనే కథలో కీలకమైన పాత్ర తనది. నాకు కౌబాయ్ సినిమాలంటే ఇష్టం. ఆ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కౌబాయ్ అనగానే తెలుగువాళ్లకు కృష్ణగారే గుర్తుకు వస్తారు. మా సినిమాని ఆయన చూశారు. ‘బాగా తీశారు’ అని మెచ్చుకున్నార’’న్నారు.