ఆమిర్‌ఖాన్‌ దంపతుల విడాకులు

హిందీ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌, నిర్మాత-దర్శకురాలు కిరణ్‌ రావు వైవాహిక బంధానికి ముగింపు పలికారు. విడాకులు తీసుకుంటున్నట్టు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో విడాకులను వైవాహిక బంధానికి ముగింపులా చూడకుండా... కొత్త ప్రయాణానికి నాందిగా మాత్రమే చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆమిర్‌-కిరణ్‌ ఏమన్నారంటే... ‘‘మా పదిహేనేళ్లు కలిసున్నాం. ఈ కాలంలో జీవితానికి సరిపడా ఎన్నో ఆనందాలు, నవ్వులు, సంతోషాలను పంచుకున్నాం. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ ఉండటంతో మా బంధం మరింత బలపడింది. ఇప్పుడు మా జీవితాల్లో కొత్త ఆధ్యాయాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కొనసాగలేం. కానీ, ఒకరికొకరు కుటుంబంగా ఉంటాం. మా బిడ్డకు సహ తల్లితండ్రులుగా కొనసాగుతాం. కొంత కాలం క్రితం నుంచి విడిపోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాం. వేర్వేరుగా జీవిస్తాం. అదే సమయంలో బంధువులతో కలిసి జీవితాన్ని ఎలా పంచుకుంటాయో... అదే విధంగా జీవితాల్లో కలిసుంటాం. మా అబ్బాయి ఆజాద్‌ సంరక్షణ బాధ్యతలను ఉమ్మడిగా చూసుకుంటాం. సినిమాలు, పానీ ఫౌండేషన్‌ కోసం కలిసి పని చేస్తాం. మమ్మల్ని అర్థం చేసుకుని మాకెప్పుడూ అండగా ఉంటున్న మా కుటుంబాలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’ నిర్మాతల్లో కిరణ్‌ రావు ఒకరు. ఆమిర్‌, రాధికా చౌదరితో కలిసి నిర్మిస్తున్నారు. గతంలో ‘దంగల్‌’, ‘తలాష్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ వంటి ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌పై రూపొందించిన పలు చిత్రాలకు అతనితో పాటు నిర్మాతగా వ్యవహరించారు. కిరణ్‌ రావు దర్శకురాలిగా పరిచయమైన ‘ధోబీ ఘాట్‌’లో ఆయన నటించారు. ఆమిర్‌కు కిరణ్‌ రావు రెండో భార్య. వీరిద్దరిదీ ప్రేమ వివాహమే. గతంలో రీనా దత్తాతో ఆమిర్‌కు వివాహమైంది. ‘లగాన్‌’కు కిరణ్‌ రావు సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న సమయంలో స్నేహం చిగురించింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ‘లగాన్‌’ విడుదలైన తర్వాత రీనా దత్తాకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత మూడేళ్లకు కిరణ్‌ రావును పెళ్లాడారు. ఆమిర్‌-రీనా దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు జునైద్‌ ‘మహారాజా’తో హీరోగా పరిచయం అవుతున్నారు. కుమార్తె ఐరా ఓ నాటకానికి దర్శకత్వం వహించారు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.