రెండో సినిమాకు దారేది?

ABN , First Publish Date - 2021-07-12T00:34:34+05:30 IST

కొత్తగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన యువ దర్శకులకు మొదటి సినిమా ఎంత ముఖ్యమో, రెండో సినిమా కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ద్వితీయ విఘ్నం గట్టెక్కితే తర్వాత అంతా సజావుగా జరుగుతుందని నమ్మకం.

రెండో సినిమాకు దారేది?

కొత్తగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన యువ దర్శకులకు మొదటి సినిమా ఎంత ముఖ్యమో, రెండో సినిమా కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ద్వితీయ విఘ్నం గట్టెక్కితే తర్వాత అంతా సజావుగా జరుగుతుందని నమ్మకం. అందుకే  దర్శకుల కెరీర్‌కు రెండో సినిమా అత్యంత కీలకం. కానీ ఆ సక్సెస్‌ అంత ఈజీగా వరించదు. మొదటి సినిమాతో చక్కని విజయం అందుకొని చేతిలో కథలు ఉండి కూడా రెండో సినిమా ప్రారంభించని యువ దర్శకులు ఎందరో ఉన్నారు. వారి కథేంటో చూద్దాం...


సుకుమార్‌ శిష్యుడు సానా బుచ్చిబాబు ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఆ సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన పంజా వైష్ణవ్‌ తేజ్‌, నిత్యాశెట్టిలకు వరుసగా అవకాశాలు దక్కాయి. దర్శకుడు బుచ్చిబాబు మాత్రం రెండో సినిమాకు సంబంధించి గుడ్‌ న్యూస్‌ చెప్పలేదు. ఆయనకు ఆఫర్లు అయితే ఉన్నాయి. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు అడ్వాన్‌ ఇచ్చాయని కూడా వార్తలొచ్చాయి. త్వరలో బుచ్చిబాబు రెండో సినిమా వార్త చెప్పాలని ఆశిద్దాం. 


హీరోగా బిజీ..

సినిమా మీద ప్యాషన్‌తో వ్యాపారాలను పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు విష్వక్సేన్‌. ఆయన హీరోగా నటించి, దర్శకనిర్మాతగా రూపొందించిన ‘ఫలక్‌నుమా దాస్‌’. తొలి చిత్రంతో హీరోగానూ, దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత విష్వక్‌ హీరోగా బిజీ అయ్యారు. ఆయన నటించిన ‘హిట్‌’ సినిమా విడుదల కాగా, ‘పాగల్‌’, ‘గామి’ చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. దర్శకుడిగా రెండో సినిమా కూడా చేస్తానన్నారు విష్వక్సేన్‌. ఇప్పటి వరకూ దాని గురించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. 

కథ వేటలో...

‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘కార్తికేయ’ చిత్రాలకు ఛాయగ్రాహకుడిగా పని చేసి దర్శకుడిగా మారారు కార్తీక్‌ ఘట్టమనేని. ఆ తర్వాత ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే ఆ చిత్రం ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా తర్వాత ఛాయగ్రాహకుడిగా తన పనిలో బిజీ అయపోయారు. ‘డిస్కోరాజా’, ‘నిన్నుకోరి’, ‘ప్రేమమ్‌’, ‘రాధ’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ వంటి హిట్‌ చిత్రాలకు ఛాయగ్రాహకుడిగా పని చేసి గుర్తింపు పొందారు. అయితే దర్శకత్వంపై ఉన్న మక్కువ మాత్రం ఆయనకు పోలేదు. మరో మంచి కథతో సినిమా తీసే ప్రయత్నాల్లో కార్తీక్‌ ఉన్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. 


‘మను’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఫణీంద్ర నారిశెట్టి, ‘డియర్‌ కామ్రేడ్‌’తో భరత్‌ కమ్మ, 'భానుమతి రామకృష్ణ'తో శ్రీకాంత్‌ నగోటి దర్శకులుగా పరిచయమై ఫర్వాలేదనిపించుకున్నారు. అయితే వీరి నుంచి కూడా రెండో సినిమాకు సంబంధించన ప్రకటన ఇంకా రాలేదు. 

                            

Updated Date - 2021-07-12T00:34:34+05:30 IST