హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న డైరెక్ట‌ర్ విక్ర‌మ‌న్ కుమారుడు

కోలీవుడ్‌లోని ప్రముఖ దర్శకుడు విక్రమన్‌ కుమారుడు కనిష్క వెండితెర హీరోగా పరిచయం కానున్నారు. ఈయనను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకనిర్మాత, నటుడు కేఎస్‌.రవికుమార్‌ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ‘ప్లాట్‌ఫాం నెంబర్‌ 7’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన కేఎస్‌ రవికుమార్‌ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై కొత్త నటీనటులను వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ‘బిగ్‌బాస్‌’ ద్వారా గుర్తింపు పొందిన దర్షన్‌, లోస్లియాలతో ‘గూగుల్‌ కట్టప్పన్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తన వద్ద సహాయ దర్శకులుగా పనిచేసిన ఇద్దరు యువకులకు దర్శకులుగా అవకాశం కల్పించారు. అదేవిధంగా, ఇపుడు తనకు సినీ కెరీర్‌ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు విక్రమన్‌ కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇదిలావుంటే, కేఎస్‌ రవికుమార్‌ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అదృష్టంలేని వ్యక్తిగా ముద్రవేశారు. ఆ సమయంలో దర్శకుడు విక్రమన్‌ చేరదీసి... తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం కల్పించారు. విక్రమన్‌ దర్శకత్వం వహించిన సూపర్‌డూపర్‌ హిట్స్‌ సాధించిన ‘పుదు వసంతం’, ‘పురియాద పుదిర్‌’ చిత్రాలకు కేఎస్‌ రవికుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడుగా మారిన రవికుమార్‌ ఇక వెనక్కి తిరిగిచూడలేదు. ఇప్పుడు ఆయన నటుడుగా బిజీగా మారడంతో దర్శకత్వంపై దృష్టిని కేంద్రీకించలేకపోతున్నారు. అదేసమయంలో నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్‌పై కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.