సినిమా చూసిన తర్వాత.. సూపర్ స్టార్ నాపై చూపిన ప్రేమ చాలు: ‘పెద్దన్న’ డైరెక్టర్ శివ

ABN , First Publish Date - 2021-11-04T03:23:15+05:30 IST

నాకు సినిమా అంటే సెలెబ్రేషన్స్. సందడిగా ఉండాలనే అలా తీస్తాను. పండుగకు అందరూ సినిమాకు వెళ్తున్నామంటే.. అలాంటి సినిమానే తీయాలి. మాది ఉమ్మడి కుటుంబం. పెద్ద వాళ్ల నుంచి చిన్న వాళ్ల వరకు అందరూ వెళ్లేవాళ్లం. అలాంటి సినిమాను ఇప్పుడు తీయడం నాకు..

సినిమా చూసిన తర్వాత.. సూపర్ స్టార్ నాపై చూపిన ప్రేమ చాలు: ‘పెద్దన్న’ డైరెక్టర్ శివ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘పెద్దన్న’. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు శివ మీడియాకు చిత్ర వివరాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైమ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ గారితో పని చేశాను.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అలాగే ఫస్ట్ టైం సన్ పిక్చర్స్, సురేష్ బాబుగారి వంటి వారితో పని చేశాను. సినిమా షూటింగ్ అంతా కూడా ఎంతో సరదాగా నడిచింది. ఇక సినిమా విడుదల అవుతోందని ఎంతో సంతోషంగా ఉంది. నేను డైరెక్ట్ చేసిన విశ్వాసం సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు రజినీకాంత్‌గారు పిలిచి.. ‘నాతో ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నావ్?’ అని అడిగారు. సూపర్‌స్టార్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పాను. సూపర్ స్టార్ సినిమా అంటే ఏంటి? అని నవ్వుతూ అడిగారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో కమర్షియల్‌గా ఉంటే అది సూపర్ స్టార్ సినిమా అని చెప్పాను. సరే అలాంటిదే చేద్దాం అన్నారు. ఫస్ట్ నెరేషన్‌లోనే కథ బాగా నచ్చింది. అలా సినిమా మొదలైంది. సన్ పిక్చర్స్, కళానిధి మారన్, కావ్యా మేడంలతో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీద వారికున్న నమ్మకమే నన్ను నడిపించింది. చాలా రోజుల తరువాత మళ్లీ ఫుల్ ఫిల్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది.


షూటింగ్ జరిగినన్నీ రోజులూ రజినీకాంత్‌గారూ సరదాగా ఉన్నారు. మంచి సీన్లు చేస్తే.. అందరి ముందే ప్రశంసించేవారు. సినిమా బాగా తీస్తున్నాడని అన్నారు. అయితే కొంత సినిమాను ఎడిట్ చేసి చూపించాను. నా సినిమా చూసినట్టు అనిపిస్తోందని రజినీకాంత్‌గారు అన్నారు. ఆ తరువాత సినిమా మొత్తం చూశారు. బయటకు వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోను. ఎంతో సంతృప్తితో ఆయన అలా చేశారు. అదే నాకు అతి పెద్ద ప్రశంస. ఈ చిత్రంలో చాలా మంది యాక్ట‌ర్స్‌ ఉన్నారు. చెప్పుకుంటూ వెళ్తే పెద్ద కాస్టింగ్ ఉంటుంది. నయనతార, మీనా, కుష్బూ, జగపతి బాబు ఇలా చాలా మంది ఉన్నారు. అన్ని పాత్రలు చాలా బాగా వచ్చాయి. నాకు సినిమా అంటే సెలెబ్రేషన్స్. సందడిగా ఉండాలనే అలా తీస్తాను. పండుగకు అందరూ సినిమాకు వెళ్తున్నామంటే.. అలాంటి సినిమానే తీయాలి. మాది ఉమ్మడి కుటుంబం. పెద్ద వాళ్ల నుంచి చిన్న వాళ్ల వరకు అందరూ వెళ్లేవాళ్లం. అలాంటి సినిమాను ఇప్పుడు తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కుష్బూ, మీనా గారు కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం సంతోషంగా అనిపించింది. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.


సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు. కానీ రజినీకాంత్‌గారు సినిమా చూశాక వచ్చి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన సంతోషాన్ని, ప్రేమను అలా వ్యక్తపరిచారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. నేను ఆయనకి వీరాభిమానిని. ఓ అభిమానిలానే సినిమాను తీశాను. అయినా మనం చేసేది ఏం ఉండదు. అంతా దేవుడే చేస్తాడు. మనం ఓ పరికరం మాత్రమే. నేను చిన్నప్పటి నుంచి నేను అలానే అనుకుంటాను. అభిమానులు రజినీకాంత్ గారిని ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అలా ఈ సినిమాలో ఉంటారు. ఆయన నుండి కోరుకునే మాస్, యాక్షన్ అన్నీ రకాలుగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేలానే కనిపిస్తారు. చంద్రముఖి సినిమా నుంచి రజినీకాంత్, నయనతారల కాంబినేషన్ బాగుంది. విశ్వాసం సినిమాలో నయనతార అద్భుతంగా నటించారు. రజినీకాంత్‌గారు, నయనతార, నేను కలిసి చేస్తే బాగుంటుందని అనుకున్నాను. నయన్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఆమె కథ చెప్పగానే ఓకే చెప్పారు.


ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నాకు ఈ ముగ్గురు నిర్మాతలు చాలా బాగా తెలుసు. సురేష్ బాబుగారితో అయితే ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నా ‘శౌర్యం’ కథ ఆయనకే మొద‌ట చెప్పాను. నా కెరీర్‌‌లో ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సునీల్ గారు, దిల్ రాజు గారు కలిసి సినిమాను విడుదల చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. రేపు ఈ సినిమా విడుదలయ్యాక, ఫలితాన్ని చూశాక అంతా హ్యాపీగా ఉంటారని భావిస్తున్నాను..’’ అన్నారు.

Updated Date - 2021-11-04T03:23:15+05:30 IST