అరె... మా కథే చెప్పాడ్రా అనాలి!

ABN , First Publish Date - 2021-09-26T05:43:24+05:30 IST

సామాజిక అంశాలను కథా వస్తువులుగా చేసుకొని కమర్షియల్‌ విజయాలు అందించడం శేఖర్‌ కమ్ములకు కొట్టిన పిండి. ఒక మంచి కాఫీలాంటి ‘ఆనంద్‌’ను పరిచయం చేసినా.. అవినీతి రాజకీయానికి ముగింపు పలికే ‘లీడర్‌’ను తెరపైకి తీసుకువచ్చినా....

అరె...  మా కథే చెప్పాడ్రా అనాలి!

సామాజిక అంశాలను కథా వస్తువులుగా చేసుకొని కమర్షియల్‌ విజయాలు అందించడం శేఖర్‌ కమ్ములకు కొట్టిన పిండి. ఒక మంచి కాఫీలాంటి ‘ఆనంద్‌’ను పరిచయం చేసినా.. అవినీతి రాజకీయానికి ముగింపు పలికే ‘లీడర్‌’ను తెరపైకి తీసుకువచ్చినా.. రెక్కల గుర్రం మీద వచ్చే రాజకుమారుడిని ‘ఫిదా’ చేసి ఊర్లో హాస్పిటల్‌ పెట్టించినా.. శేఖర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘‘ఇప్పటి దాకా నేను తీసిన సినిమాలు ఒక ఎత్తు.. లవ్‌ స్టోరీ ఒక ఎత్తు’’ అంటున్న శేఖర్‌.. ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలలోకి వెళ్తే...


నిర్భయ లాంటి సంఘటనలు ఇకపైనా జరుగుతూనే ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు మీరు కొవ్వొత్తుల ర్యాలీలు తీసి, నల్ల బ్యాడ్జిలు పెట్టుకొని, ప్రోగ్రామ్‌ చేసి మీ ఇంటికెళతారు. అక్కడ మీ అమ్మ, అక్క ఉంటారు. వారికి ఏదో ఒక పనిలో సాయం చేయండి. పెళ్లి లాంటి విషయాల్లో మీ సోదరి ఆలోచనలకు మీ మద్దతు తెలపండి. క్లాస్‌లో అమ్మాయిల మీద గాసిప్స్‌, డ్రస్సింగ్‌ మీద కామెంట్లు చే యడం అబ్బాయిలు మార్చుకోవాలి. నిర్భయకు మీరిచ్చే నిజమైన నివాళి అదే. నీ పక్కన ఉన్న అమ్మాయిలను నువ్వు గౌరవిస్తే సమాజంలో మార్పు వస్తుంది. దీన్నొక చదువులా విద్యార్థులకు చెప్పాలి. 


గతంలో నేను కూడా చాలా తప్పులు చేశా. అమ్మాయిల మీద అరిచాను. అందరిలానే ఆలోచించి ఇంజనీరింగ్‌ చేసి అమెరికా వెళ్లాను. ఇప్పుడు సినిమా మాధ్యమం ద్వారా మంచి ఏదో చెప్పగలుగుతున్నాను. 


మీ చిత్రాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళల స్థితిగతుల్లో ఎలాంటి మార్పులొచ్చాయి?


మహిళల జీవితాల్లో చదువు పెనుమార్పులు తీసుకువచ్చింది. విద్య వల్ల వారికి ఆర్థిక స్థిరత్వం వచ్చింది. మధ్యతరగతి కుటుంబాల్లోని అమ్మాయిల అభివృద్ధికి చదువు ఒక ముఖ్య కారణం. ఎక్కడో ఎందుకూ.. మా ఇంట్లోనే తీసుకుందాం. నా కన్నా మా అక్కావాళ్లు ఎక్కువ చదువుకున్నారు. అయితే మన సమాజం అమ్మాయిల పట్ల చూపించే పక్షపాత ధోరణిలో కొంత వరకే మార్పు వచ్చింది. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ వివక్ష కనిపిస్తుంది. అమ్మాయిల కన్నా అబ్బాయిలకు ఎక్కువ చదువు చెప్పిస్తారు. ఎక్కువ తిండి పెడతారు. ఈ ధోరణి పోవాలంటే ఇంకో రెండు తరాలు పడుతుందేమో! మనం ప్రస్తుతం ఉన్నది సంధికాలం. 


చాలా సందర్భాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు  ప్రగతి సాధిస్తున్నారు కదా..


అబ్బాయి అయితే కుటుంబాన్ని ఉద్ధరిస్తాడనే భ్రమలు ఇప్పటికే పోయాయి. అమ్మాయి అయితే బాగా చూసుకుంటుందనుకుంటున్నారు. వరకట్నాలు  కూడా చాలావరకూ తగ్గాయనుకుంటున్నాను. మహిళల సమానత్వం, స్వావలంబన దిశగా మన మాజంలో కొంత పురోగతి కనిపిస్తోంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ సమానమే అనే దశకు సమాజం త్వరలో వస్తుంది. అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నా అమ్మాయిలు పురోగమిస్తున్నారు. ఆ దిశగా మహిళల కోసం పని ప్రదేశాల్లో, ప్రభుత ్వ విధానాల్లో, సమాజంలో కొన్ని సానుకూల మార్పులు జరుగుతున్నాయి. వంట, ముగ్గులు వేయడం లాంటి కొన్ని పనులు అమ్మాయిలు మాత్రమే చేయాలి... అబ్బాయిలు చేయకూడదనేది ఉంది. కానీ కరోనా సమయంలో మన హీరోలు వంట చేశారు. అమ్మాయిలను వస్తువులుగా చూసే ధోరణి ఇంకా ఉంది. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వాడకపోయినా కూడా నేను ఒక అమ్మాయిని అనే భావన ఆమెలో రావాలి. దీనికోసం సాహిత్యం, సినిమా రంగాల్లో ఎక్కువ కృషి జరగాలి. కొన్ని అంశాలను చాలా బలంగా చెప్పాలి. నిర్భయ తర్వాత నేను ఐ కేర్‌ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశాను. 


మహిళలకు మీ సినిమాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తారు కదా? ఎందుకు? 


నేను బలంగా చెప్పాల్సిన సబ్జెక్ట్‌ ఉందని అనిపించినప్పుడే సినిమా తీస్తాను. నా మొదటి సినిమా నుంచి ఇదే పంథా అనుసరిస్తున్నాను. ముందు కథ, దానిని ఎలివేట్‌ చేసే పాత్రలు సిద్ధం చేసుకుంటాను. అవినీతి లేని నాయకత్వం గురించి చెప్పాలనుకున్నప్పుడు ‘లీడర్‌’, పెళ్లయ్యాక కూడా పుట్టినింట ఉండాలనుకునే యువతి గురించి చెప్పాలనుకున్నప్పుడు ‘ఫిదా’ కథలు తయారయ్యాయి. క్యారెక్టర్‌లోకి వెళ్లి నేను నమ్మింది నిజాయితీగా రాస్తాను. దర్శకుడిగా నేను నమ్మే విలువలే నా సినిమాల్లోనూ కొంత ప్రతిఫలిస్తాయి. మన సినిమాలతో అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి. అందుకే మహిళల పాత్రలకు ప్రాధాన్యం ఇస్తా. 


సినిమా తీయడంలో మీ టార్గెట్‌ ఏమిటి? 

చాలా కష్టపడి సినిమా తీస్తాం. అది అనుకున్న విధంగా ప్రేక్షకుల కు చేరాలి. నా వాయి్‌సను బలంగా చెప్పడంతో పాటు వారు చూసేలా తీయాలనేది నా లక్ష్యం. 


ఒక సినిమా తెరకెక్కించేముందు మీరు ఏం ఆశిస్తారు? 


‘అరె.. మా కథను చెప్పాడ్రా’ అన్న ప్రేక్షకుడి ప్రశంస నాకు సంతృప్తినిస్తుంది. ‘లవ్‌స్టోరి’ సినిమా ద్వారా నేను కోరుకునేది అదే. ఇంకా దేశంలో 40 కోట్ల మందికి అవకాశాలు లేవనే పాయింట్‌ను ‘లవ్‌స్టోరి’ ద్వారా చెప్పాలని ప్రయత్నించాను. అలాగే అమ్మాయిలు చాలామంది తమ బాధను పైకి చె ప్పుకోలేకపోతున్నారు. అలాంటివారికి ఈ సినిమా ఒక భరోసానిస్తుంది. సినిమా అంటే ఇదిరా అని నలుగురూ గొప్పగా చెప్పుకునేలా నా సినిమా ఉండాలి. 


వెట్రిమారన్‌, పారంజిత్‌ లాంటి దర్శకులు తమిళంలో సామాజిక అంశాలతో సినిమాలు తీసి కమర్షియల్‌ విజయాలు అందుకున్నారు. తెలుగులో ఎందుకు సాధ్యం కావడం లేదు? 


దానికి నేను కూడా బాధ్యుణ్ణే. అలాంటి సినిమాలు చూసే అలవాటును ప్రేక్షకుల్లో చంపేశాం. ‘పలాస’, ‘కంచరపాలెం’ లాంటి చిత్రాలతో మూస ధోరణికి కొంచెం భిన్నంగా వెళ్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా ఆడితే ఇదొక ట్రెండ్‌ అవుతుంది. భవిష్యత్తులో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చిత్రాలు రావాలి. ఆ దిశగా కొత్త మార్పుకు ‘లవ్‌స్టోరి’ నాంది అవుతుందని ఆశిస్తున్నా. 


మీ తదుపరి చిత్రం ధను్‌షతో చేస్తున్నారు? 


అన్ని రకాలపాత్రల్లో ధనుష్‌ అలవోకగా ఒదిగిపోతాడు. టెన్త్‌క్లా్‌స చదివే విద్యార్థిలా, డెబ్బయ్యేళ్ల ముసలి వ్యక్తిలా కనిపించగలగడం అతని ప్రత్యేకత. అతనొక నిజమైన నటుడు. నేను స్టోరీ చెప్పగానే ‘చేద్దాం’ అన్నాడు. అంత త్వరగా అంగీకరిస్తాడనుకోలేదు.  ‘నువ్వు స్పెషల్‌ సినిమాలు చేశావు. కథ కూడా స్పెషల్‌గా ఉంది. చేద్దాం’ అన్నాడు. ఇది పాన్‌ ఇండియా చిత్రం. తెలుగు, తమిళం, హిందీలో చేస్తున్నాం. 


తెలుగు సినిమా వివిధ దశల్లో కథ, డైలాగ్స్‌, విజువలైజేషన్‌ డామినేట్‌ చేశాయి. 


నేను సినిమాలు ఎక్కువగా చూడను. నాపైన ఎవ్వరి ప్రభావం ఉండదు. నా చుట్టూ ఉన్న సమాజంలో నేను చూసిన ఏదైనా సమస్యను ప్రస్తావిస్తూ దృశ్యకావ్యంలా మలుస్తాను కాబట్టి నాకు కమర్షియల్‌ హిట్లు వచ్చాయి. నాకు అన్నీ వచ్చని చెప్పి ఏమీ తెలియని సబ్జెక్ట్‌ను సినిమాగా తీయలేను. సినిమా చూసినవాళ్లలో ఇది నా కథే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నాకు వచ్చిన భాషలో నేనే రాస్తాను. నేను త్రివిక్రమ్‌ అంత గొప్పగా రాయలేను. నా సినిమా ద్వారా నిజాయితీగా నేను అనుకున్నది చెప్పగలుగుతున్నాను. అందుకే ఇప్పుడు ఇదొక స్టైల్‌ జానర్‌ అయింది. 


ఒకే జానర్‌లో వరుసగా తీస్తూ కొత్తదనం చూపించడం సులువు కాదు కదా? 


అవును. అనుకరణ అంటే నాకు చాలా భయం. గత చిత్రాల ఛాయలు ఎక్కడా కనపడకుండా మా టీమ్‌ జాగ్రత్తలు తీసుకుంటుంది. మా టీమ్‌ నా బలం. అందులో ఏదైనా తప్పు చేస్తే నన్ను నిలదీస్తారు. దాంతో నన్ను నేను రీచెక్‌ చేసుకుంటాను. 


మీరు దేనికి ఎక్కువ భయపడతారు?


నా నైతికతకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తారేమోననేది నా భయం. ఒక సినిమాలో విద్యార్థి టీచర్‌కి లైన్‌ వేయవచ్చని చెప్పడం సమంజసమా అని ప్రశ్న ఉత్పన్నమయితే? ‘నేను ఇది’ అని చెప్పాక మాటమీద నిజాయితీగా నిలబడడం కత్తి మీద సాము. తప్పటడుగు వేస్తానేమోనని ఎక్కడో భయం. తప్పుగా సందేశం ఇచ్చావు అని ఎవరైనా అడిగితే నేను విఫలమయినట్టే. 


కొవిడ్‌ టైమ్‌లో మీరు నేర్చుకున్న పాఠం? 



డబ్బు సర్వస్వం కాదు, ఎవరూ శాశ్వతం కాదని అనుభవపూర్వకంగా తెలిసింది. తోటి వారితో మరింత మానవత్వంతో మెలగాలి అని తెలుసుకున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు తోచిన సాయం అందించాను. సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పించాను.  ఆ సమయంలో మా తండ్రిగారిని కోల్పోవడం తీరని లోటు. అప్పటికి ‘లవ్‌స్టోరి’ 30 శాతం చిత్రీకరణ మిగిలే ఉంది. యూనిట్‌కు ఇన్స్యూరెన్స్‌ చేయించి షూటింగ్‌ చేశాం. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ ఎవ్వరూ ఇళ్లకు వెళ్లలేదు. 


ఖాళీ సమయం ఎలా గడుపుతారు?


ఖాళీ సమయం చాలా అరుదుగా దొరుకుతుంది. పిల్లలతో ఆడుకుంటాను. ట్రావెల్‌ చేయడం చాలా ఇష్టం. 


తమిళ, మలయాళ తరహాలో మన దగ్గర సినిమాలు రావడం లేదు. ఎందుకు?


దానికి కొంచెం సమయం పడుతుంది. రొటీన్‌ కథలు చెపితే ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. వారికి బోర్‌ కొడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కొత్త ఐడియాను ఆదరిస్తున్నారు. స్టార్‌హీరోలు నటిస్తే మరింత వేగంగా మార్పువస్తుంది. 


సినిమాల నిర్మాణంపై సోషల్‌ మీడియా ప్రభావం ఎలా ఉంది?


పదివేల ఖర్చుతో ఐ ఫోన్‌తో సినిమా తీసి చూపిస్తే నిర్మాతకు నమ్మకం వస్తుంది. ఫిల్మ్‌ మేకర్స్‌కు అవకాశం ఇస్తారు. ఇప్పుడు సినిమాల ప్రచారం నుంచి అన్ని విషయాలపై సోషల్‌ మీడియా ప్రభావం ఉంది. ఇది ఒకందుకు మంచిదే. శ్రమ తగ్గుతుంది.  


మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు?


హిందీలో గురుదత్‌. తెలుగులో బాపు గారు. కానీ నా మేకింగ్‌ బాపు గారి మేకింగ్‌లా ఉండదు. నాదైన శైలిలో ఉంటుంది. ఫిల్మ్‌మేకర్‌గా టెక్నిక్‌కన్నా కూడా కథపైన ఆధారపడతాను. కథతో నేను అనుభూతి చెందితే బాగా తీయగలుగుతాను. మంచి అవుట్‌పుట్‌ వస్తుంది. 


సినిమా విభాగాల్లో బాగా నచ్చేది?


రైటింగ్‌.. సినిమా పూర్తయినప్పుడు కన్నా రాయడం పూర్తయినప్పుడు ఎక్కువ ఆనందపడతాను. మంచి కథ ముఖ్యమే కాదు అది దొరకడం కూడా చాలా కష్టం. ఒక్కసారి రాయడం పూర్తయితే చాలు సినిమా తీయడం సులువు. అదీగాక ఇప్పుడు నిర్మాతలు, మార్కెట్‌ గురించి ఒత్తిడి లేదు. స్టోరీ ఐడియానే నా  గ్రేటెస్ట్‌ స్ట్రెంత్‌, కిక్‌, హ్యాపీనెస్‌.


లవ్‌స్టోరీ సినిమా ద్వారా మీరు ప్రధానంగా చెప్పదలుచుకున్నది? 


నా సినిమా అంటే  డైరెక్టర్‌ వాయిస్‌. నా వాయిస్‌. నాకు అలవాటులేనిది, తెలియనిది ఇక్కడ ఒకటి ఉంది అని ‘ఫిదా’ ద్వారా చెప్పాను. ‘లవ్‌స్టోరి’లో దాన్ని ఇంకా బ్రేక్‌ చేశాను. కులం, జాత్యాహంకారం తప్పు, అలాంటివి ఉండకూడదని తెలుసు. వివక్షకు గురయిన వ్యక్తికే ఆ బాధ తెలుస్తుంది. వారి బాధలోని గాఢతను అర్థం చేసుకోగలం తప్ప మనం అనుభవించలేం. దాన్నొక సినిమాగా తీసి, ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ బాధను కొంత వరకే ప్రతిఫలించగలను. దేనిపైనా మనకు పరిపూర్ణ అవగాహన ఉండదు. కానీ మనం గ్రహించిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కుల, లింగవివక్ష అనే రెండు సామాజిక అంశాలను తీసుకొని, వాణిజ్యహంగులతో ‘లవ్‌స్టోరి’ రూపొందించాను. 


‘లవ్‌స్టోరి’ విషయంలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఆశిస్తున్నారు? 


ఈ సినిమా చూసినవాళ్లందరూ మారతారని నేను ఆశించడంలేదు. కుల వివక్షతో కొన్ని కోట్ల మంది అవకాశాలకు దూరమవుతున్నారనేది ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియాలి. ఆ తర్వాత వాళ్లు ఏం చేస్తారనేది వారిష్టం. అణగారిన వర్గాలకు చెందిన పల్లెటూరి యువకుడి కథ ఇది. అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కొని, బాగా చదువుకొని తన కలను నెరవేర్చుకోవడానికి నగరానికి వస్తాడు.  


ఇప్పుడు వస్తున్న తెలుగు చిత్రాల్లో ప్రతి పాత్రధారి అందంగా కన పడాలని చూస్తున్నారు.


తాతయ్య, నాయనమ్మ, అత్తయ్య లాంటి పెద్ద కుటుంబంలో వచ్చే ప్రతి పాత్ర కూడా అందంగా ఉండాలి. ఇలాంటి మైండ్‌సెట్‌ను నేను ‘ఫిదా’లో కొంత బ్రేక్‌ చేశాను. ఇండస్ట్రీ అంతా ఒక మూసలో పోతున్న తరుణంలో నాగచైతన్య లాంటి మెయిన్‌స్ట్రీమ్‌ హీరోను అణగారిన వర్గాల యువకుడి పాత్ర చేసేందుకు ఒప్పించాను. ఆ జీవితాలను ఎంతో కొంత చూపించాలి. సినిమా, రైటింగ్‌, మూసధోరణిని కొంత బ్రేక్‌ చేయాలి. ఎప్పుడూ కాలేజీ, వేలంటైన్‌ డే, హైదరాబాద్‌, సాఫ్ట్‌వేర్‌ మాత్రమే కాదు. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. 


సమాజంలో కులం లోతుగా పాతుకుపోయిన సమస్య. ఈ సినిమా ద్వారా  ఏదైనా పరిష్కారం  చూపారా? 


కులవివక్ష వేలాది ఏళ్లుగా వేళ్లూనుకొని ఉన్న సమస్య. ‘లవ్‌స్టోరి’లో దీనికి నేను పరిష్కారం చెప్పడం లేదు. ఆ సమస్యను  ఎత్తిచూపుతున్నాను. భగవంతుడి సృష్టిలో ఎక్కువ తక్కువ ఉండదు అని మనకు తెలుసు. కులం కారణంగా సాటి వ్యక్తిని చిన్నచూపు చూడకూడదని మనకు తెలుసు. కానీ దాన్ని మనం పాటించం. 


ఈ చిత్రానికి సంబంధించి మీరు ఎదుర్కొన్న పెద్ద సవాల్‌?


కుల వివక్ష, లింగ వివక్ష లాంటి రెండు పెద్ద అంశాలను కలిపి చెప్పడం కత్తిమీద సాము. తల వంచుకోవాల్సి వస్తుందేమో, ప్రేక్షకులకు ఎలా స్వీకరిస్తారనే భయం ఉండేది. కానీ ఇప్పుడు సినిమాపైన నమ్మకం ఉంది. ‘లీడర్‌’ సినిమాపై అప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్‌ ఇప్పుడు ‘లవ్‌స్టోరి’పై ఉంది. అణగారిన వర్గాలు చూసి ఆదరిస్తే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. 


ఈ సినిమాలో హీరోగా నాగచైతన్యను తీసుకోవడానికి కారణం? 


ఇమేజ్‌ లేదా మరొకటి చూసి నాగచైతన్యను తీసుకోలేదు. ఆయన సినిమాలు కూడా నేను ఎక్కువగా చూడలేదు. అతను ఓ మూమూ లు కుర్రాడిలా ఉంటాడు. ముఖంలో నిజాయితీ కనిపిస్తుంది. తెలంగాణ యాస పలకడానికి చాలా కష్టపడ్డాడు. పళ్లెంలో అన్నం కలపడం, వంట చేయడం, బైక్‌ నడపడం.. ఇలా ప్రతి చిన్నవిషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఆ పాత్రను డిజైన్‌ చేశాం. 


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌




Updated Date - 2021-09-26T05:43:24+05:30 IST