ఇంట్లో భార్య మృతదేహం పెట్టుకుని ఆయన షూటింగ్‌కి వచ్చారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 54)

‘ఆలయం’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో రెండు దుర్ఘటనలు జరిగి, మా మనసుల్ని బాధపెట్టాయి. ఒకటి మా అమ్మగారు చనిపోవడం, రెండు తిలక్‌గారి భార్య చనిపోవడం. ఆ బాధ దిగమింగుకుని ఆయన షూటింగ్‌కు వచ్చి మమ్మలందరినీ ఆశ్చర్యపరిచారు. సెట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం ఆయనకు అలవాటు లేదు. సైలెంట్‌గా ఉండేవారు. అందుకే సాయంత్రానికిగానీ ఈ విషయం నాకు తెలియలేదు. ఇంట్లో భార్య మృతదేహం అలాగే ఉంది. కానీ ఆయన వచ్చి నటిస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత వెంటనే ఆయన దగ్గరకువెళ్లి ‘‘సారీ గురువుగారు’’ అన్నాను. ‘‘నిజమేనయ్యా.. జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఏడుస్తూ అక్కడే కూర్చుంటే ఏం ప్రయోజనం? ఇక్కడికి వస్తే మీ పనికి ఇబ్బంది కలగదు కదా. అందుకే వచ్చాను’’ అన్నారు. వృత్తి పట్ల అంత అంకితభావం కలిగిన వ్యక్తి ఆయన.


ఇక సినిమా విషయానికివస్తే, ‘ఆలయం’ బాగా వచ్చింది. తొలికాపీ వచ్చింది. ‘‘నేను వెళ్లి ఏ డిస్ర్టిబ్యూటర్నైనా అడగనా’’ అని మా నిర్మాతను అడిగాను. ‘‘వద్దు అంకుల్‌.. నేను అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను’’ అన్నాడు. ఆ తర్వాత సురేశ్‌బాబు దగ్గరకువెళ్లి సినిమా డిస్ట్రిబ్యూషన్‌ గురించి మాట్లాడాడు. ‘‘సినిమాకు మూడుకోట్ల రూపాయలు ఖర్చు అయింది. అందులో కోటి రూపాయలు శాటిలైట్‌ హక్కులరూపంలో వచ్చాయి. మా నిర్మాతకు రెండుకోట్లు పెద్ద లెక్కకాదు. రిలీజ్‌ డేట్‌ ఇచ్చేశాం. థియేటర్ల లిస్ట్‌ అడిగావా అంటే ‘‘సురేశ్‌బాబు మంచి థియేటర్లు ఇస్తానన్నాడు’’ అని చెప్పాడు. తీరాచూస్తే సెంటర్‌లో ఉన్న థియేటర్లు కాకుండా ఎక్కడో దూరంగా ఉండే థియేటర్లు ఇచ్చారు. సినిమాకు టాక్‌ బాగుందిగానీ కలెక్షన్లు లేవు. ఎక్కడో మారుమూల థియేటర్‌ ఇవ్వడంవల్ల జనం అక్కడికి వెళ్లడం కష్టం. పబ్లిసిటీ బాగా చేశారు. తర్వాత పట్టించుకోలేదు.

అనూప్‌వాళ్ల నాన్నగారికి సినిమా బాగా నచ్చింది. కొడుకును పిలిచి ‘‘సినిమా బాగుంది. మంచి థియేటర్‌లో వేసి పబ్లిసిటీ చేస్తే తప్పకుండా ఆడుతుంది’’ అని తనే చిక్కడపల్లిలోని శ్రీనివాస థియేటర్‌ బుక్‌ చేసి అందులో రిలీజ్‌ చేశారు. 39 రోజులు ఆ థియేటర్‌లో ఆడింది. ‘ఆలయం’ తర్వాత సినిమాలంటే ఆసక్తి సన్నగిల్లింది. మంచి సినిమాకు మంచి నిర్మాత, ప్రాపర్‌ రిలీజ్‌ లేకపోతే కష్టం. మంచి నిర్మాత లేకపోతే సినిమా చేయకూడదని ఒకరకమైన డిప్రషెస్‌లోకి వెళ్లిపోయాను. అప్పటికే నేను సైడ్‌ ట్రాక్‌లోకి వెళ్లిపోయాను. కొత్త తరం వస్తోంది. దానికి ఆహ్వానం పలకాలి. అభిరుచి, తపన కలిగిన నిర్మాత వస్తే తప్ప సినిమాజోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. తెలిసిన నిర్మాత అయితే ఓకేగానీ కొత్తనిర్మాత అంటే నాకు భయం. సినిమా తీయగలడో లేదో, పూర్తి చేయగలడో లేదో, తీసినా రిలీజ్‌ చేయగలిగే సామర్థ్యం ఉంటుందో లేదో అని అనేకరకాల అనుమానాలు నాకు. పిల్లలు సెటిలయ్యారు. వాళ్ల పెళ్ళిళ్ళు ఇతర కార్యక్రమాలతో బిజీ అయ్యాను. ఆ సమయంలో సినిమాల గురించి ఆలోచనే రాలేదు. మధ్యలో కొంతమంది కొత్త నిర్మాతలు వచ్చారు కానీ రిస్క్‌ ఎందుకని నేనే ధైర్యం చేయలేదు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.