అత్తను తీసుకువస్తానని హీరో వెళతాడు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 53)

రోజులు గడుస్తున్నాయి. వాటితో పాటు నా కెరీర్‌లో గ్యాప్‌ కూడా పెరిగిపోతోంది. నాతో అంతకుముందు సినిమాలు తీసిన నిర్మాతలు నిర్మాణానికి దూరంగా ఉన్నారు. నాతో సినిమాలు చేయడానికి కొంతమంది కొత్తవాళ్లు వస్తున్నారు కానీ రాజీపడి వర్క్‌ చేయలేక నేనే వద్దనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మా చిన్నబ్బాయి వంశీకృష్ణ స్నేహితుడు అనూప్‌ నాతో ఓ సినిమా తీయడానికి వచ్చాడు. అతను అంతకుముందు ఓ సినిమా తీశాడు. పెద్దగా ఆడలేదు. డబ్బుకు లోటు లేదు. ఈసారి ఎలాగైనా హిట్‌ సినిమా తీయాలనే తపనతో నా దగ్గరకు వచ్చాడు. పెద్ద హీరోలతో సినిమా తీసే స్థాయి ఉంది, కానీ లోబడ్జెట్‌లో అంటే మూడుకోట్ల రూపాయల్లో ఒక మంచి సినిమా తీయాలని అతని ఆలోచన. మా చిన్నబ్బాయి స్నేహితుడు, బాగా తెలిసిన వ్యక్తి. సినిమా అంటే ఆసక్తిగలవాడు కావడంతో నేను సరేనన్నాను. ఎన్నో రకాల కథలు విన్నాం. చివరకు భూపతిరాజా చెప్పిన కథ నచ్చింది. అనూప్‌కు, వాళ్ల నాన్నకూ బాగా నచ్చింది. నేను ఏ సినిమా చేసినా మొదట నా నిర్మాతకు కథ నచ్చాలి. తర్వాతే మిగిలింది ఏదైనా. మొదటినుండి చివరివరకూ అదే పద్ధతి పాటించాను. నిర్మాత, సాంకేతిక నిపుణులు ఓకే చేసిన సినిమాలు అధికశాతం విజయం సాధించాయి. ‘నాకు ఈ కథ నచ్చింది కనుక ఇదే తీద్దాం’ అని నేను ఏ నిర్మాతతో చెప్పలేదు. ఎందుకంటే నేను స్వతహాగా రచయితను కాదు. ఐతే కొన్ని కథలు చెబితే వాటిల్లో మంచివి ఎంపిక చేసుకునే తెలివితేటలు ఆ భగవంతుడు ఇచ్చాడు. ట్రీట్‌మెంట్‌ కోసం బాగా కష్టపడతాను.

ఆ పాత్రకు ఏయన్నార్‌ను అనుకున్నాం

ఈ కథలో తాత పాత్ర ఒకటుంది. ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావుగారు చేస్తే బాగుంటుందని మొదట అనుకున్నాం. కథ నచ్చి ఒకవేళ ఆయన నటించడానికి ఒప్పుకున్నా మేం వేసుకున్న బడ్జెట్‌ పెరగవచ్చు. పైగా కథను నడిపే కీలకపాత్రను మాత్రమే ఆయన అంగీకరిస్తారు. కానీ మా కథలో అందరూ హీరోలే. అందుకే నాగేశ్వరరావుగారిని కన్విన్స్‌ చేయలేం అనుకుని ఆ ఆలోచన విరమించుకున్నాం. ఇమేజ్‌లేని ఆర్టిస్ట్‌ కోసం ట్రై చేశాం. చివరకు సీనియర్‌ దర్శకుడు, నిర్మాత కె.బి. తిలక్‌ను ఆ పాత్రకోసం ఎంపికచేశాం. ‘‘నన్నే ఎందుకనుకున్నావు?’’ అని ఆయన నన్ను ప్రశ్నించారు.


నేను అంతా వివరంగా చెప్పి, ‘‘లైన్‌ వినండి గురువుగారూ, మీకు నచ్చితేనే చేయండి’’ అన్నాను. ఆయనకు కథ నచ్చింది. ఓకే అన్నారు. మినీ ఇండియాలాంటి ఓ ఇంట్లో జరిగే ఆసక్తికరమైన సంఘటనలతో ఆ చిత్రం రూపుదిద్దుకుంది. ఆ సినిమాకు ‘ఆలయం’ అని పేరు పెట్టాం. ఆ ఇంట్లోవాళ్లకు కులాలు, మతాల పట్టింపులు లేవు. స్వేచ్ఛకు కొదవేలేదు. ఇంట్లో అందరూ అరమరికలు లేకుండా కలసి ఉండాలి. అంతే. అయితే ఒకటే లోటు. ఆ ఇంటి పెద్ద కూతురు ఎవరినో ప్రేమించి పెళ్ళిచేసుకుని వెళ్లిపోతుంది. అందరితోపాటు ఆమె కూడా ఆ ఇంట్లో ఉంటే బాగుంటుందని ఆ ఇంటిపెద్ద బాధ పడుతుంటారు. ‘‘నేను ఆమెను తీసుకువస్తాను’’ అని హీరో చెప్పి, అత్త ఇంటికి వెళతాడు. అత్త కూతుర్ని లవ్‌ చేసి, అందరినీ ఇక్కడకు తీసుకు వస్తాడు. క్లుప్తంగా చిత్రకథ ఇదీ.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.