నా సినిమాల్లో విడుదలవ్వని సినిమా అదొక్కటే: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 52)

నాగేశ్వరరావుగారితో, చిరంజీవిగారితో సినిమాలు తీసిన భీమవరపు బుచ్చిరెడ్డిగారి ఆధ్వర్యంలో ఆయన స్నేహితుడు ఏబీ జగన్మోహనరావు ఓ సినిమా తీయాలని నా దగ్గరకు వచ్చారు. వినోదభరితమైన ఓ మలయాళ చిత్రం కొన్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మాతృకలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి స్ర్కిప్ట్‌ తయారు చేశాం. ఆకాశ్‌ హీరో, ప్రత్యూష హీరోయిన్‌. ‘ఇదేం ఊరురా బాబోయ్‌’ అని సినిమా టైటిట్‌ నిర్ణయించాం. మంచి కామెడీ సినిమా. కమెడియన్లు అందరూ ఉన్నారు. షూటింగ్‌ దాదాపు పూర్తయిన తరుణంలో ఆకస్మికంగా ప్రత్యూష చనిపోవడం ఆ సినిమాకు శాపంగా మారింది. ప్రత్యూష మరో వారం, పదిరోజులు పనిచేసి ఉంటే ఆ సినిమా పూర్తయ్యేది.


వేరే హీరోయిన్‌ను పెట్టుకుని మళ్లీ మొదటి నుంచి సినిమా తీసే స్థోమత నిర్మాతకు లేదు. అలాగని డూప్‌ను పెట్టి సీన్లు షూట్‌ చేసే అవకాశం లేదు. అందుకే అర్థాంతరంగా ఆ సినిమా అలా అగిపోయింది. నేను ఇంతవరకూ 51 చిత్రాలకు దర్శకత్వం వహించాను. వాటిల్లో విడుదల కాకుండా మిగిలిన సినిమా ‘ఇదేం ఊరురా బాబోయ్‌’ ఒక్కటే! ఏదోఒక రకంగా మేనేజ్‌ చేసి ఆ సినిమాను పూర్తి చేయవచ్చు. కానీ నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలు రావడం కూడా ఆ సినిమా ఆగిపోవడానికి మరో కారణం. డైరెక్టర్‌ను ‘కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌’ అంటుంటారు. కానీ షిప్‌ ఉంటేనే కదా కెప్టెన్‌తో అవసరం. ఏదో ఒకరకంగా సినిమాను పూర్తి చేయాల్సిన బాధ్యత నిర్మాతదే. ఐతే ప్లానింగ్‌ లేక కొందరు, మిస్ యూజ్‌ చేసి మరికొందరు సినిమాను దెబ్బతీస్తుంటారు. ‘ఇదేం ఊరురా బాబోయ్‌’ కథ అలా ముగిసింది.

కన్నడంలో ఒకే ఒక్క సినిమా!

తెలుగు సినిమా కాకుండా నేను కన్నడంలో కూడా ఒక సినిమాకు దర్శకత్వం వహించాను. గతంలో అల్లు అరవింద్‌గారు కన్నడంలో ఒక సినిమా చేయమని ఆఫర్‌ ఇచ్చినా తెలుగు చిత్రాలతో నేను బిజీగా ఉండటంవల్ల చేయలేకపోయాను. ‘తొలి వలపు’, ‘దీవించండి’ చిత్రాల తర్వాత నా సినిమాల సంఖ్య తగ్గడం మొదలైంది. ఆ తర్వాత ‘ఇదేం ఊరురా బాబోయ్‌’ సినిమా చేసినా అది విడుదల కాలేదు. అవకాశాలు తగ్గి నేను ఖాళీగా ఉన్న సమయంలో ‘సూర్యుడు’ సినిమా తీసిన మేడికొండ మురళీకృష్ణగారు తన మిత్రుడు వైజాగ్‌ రాజును వెంటబెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. నా దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా తీయాలని వారి ప్లాన్‌. హీరో విష్ణువర్ధన్‌ను అడిగితే ఆయన సినిమా చేయడానికి అంగీకరించారు. అయితే ఆయన ఒక పట్టాన కథ ఓకే చెయ్యరు.


కథాచర్చలకే ఆరు నెలలు సమయం సరిపోయింది. చివరకు పోసాని కృష్ణమురళి ఓ కథ చెప్పాడు. అది ఆయనకు నచ్చింది. ‘రాజా నరసింహ’ ఆ చిత్రం పేరు. కన్నడంలో నేను దర్శకత్వం వహించిన ఏకైక సినిమా అదే. కన్నడంలో నంబర్‌వన్‌ హీరో విష్ణువర్ధన్‌తో ఆ సినిమా చేయడం నేను మరచిపోలేని విషయం. ఆయన తెలుగు చక్కగా మాట్లాడేవారు. రమ్యకృష్ణ, రాశి హీరోయిన్లు కావడం, మిగిలిన నటీనటులందరూ తెలుగులో మాట్లాడటం వల్ల కన్నడ సినిమా చేస్తున్న ఫీలింగ్‌ కలగలేదు నాకు. ‘రాజా నరసింహ’ పెద్ద హిట్‌.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.