‘తొలివలపు’ ఆడకపోవడానికి కారణాలు ఏమిటంటే: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 51)

ABN , First Publish Date - 2021-08-05T03:14:05+05:30 IST

మా శీనయ్య కొడుకు కోసం తయారు చేసిన కథ. ఐతే కొన్ని కారణాలవల్ల మా వాడు ఆ సినిమా చేయలేకపోతే ఆ కథ తీసుకుని గోపీచంద్‌ హీరోగా ‘తొలి వలపు’ చిత్రం తీశాం. సాయికుమార్‌ సోదరుడు రవిశంకర్‌ను విలన్‌గా పరిచయం చేశాం. సినిమా పెద్దగా ఆడలేదు. దానికి కారణాలు

‘తొలివలపు’ ఆడకపోవడానికి కారణాలు ఏమిటంటే: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 51)

గోపీచంద్‌ మా గురువుగారి అబ్బాయి. మొదటి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఇతను రెండోవాడు. కుర్రాడు బాగున్నాడు. మంచి హైట్‌. అందం ఉంది. వాయిస్‌ బాగుంది. హీరో కావడానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. నాగేశ్వరరావుగారు ఉన్నారు కనుక నిర్మాత కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అప్పటికే ఆయన నాతో ‘సగటు మనిషి’, ‘అమ్మాయి కాపురం’ చిత్రాలు తీశారు. రెండూ హిట్లే. అందుకే వెంటనే ‘‘ఓ కే. అలాగే.. ఎవరినో అడగటం ఎందుకు మన బేనర్‌లోనే హీరోగా పరిచయం చేద్దాం’’ అన్నాను. నాగేశ్వరరావుగారు సరేనన్నారు. గోపీచంద్‌ కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. నా దగ్గరకు వచ్చేముందు గోపీచంద్‌ను వెంటబెట్టుకుని కొంతమంది దగ్గరకు నాగేశ్వరరావు వెళ్ళారని తర్వాత నాకు తెలిసింది. ఒంగోలుకు చెందిన నిర్మాతలే ‘‘సినిమాల్లోకి ఎందుకు, హాయిగా వ్యాపారాలు చేసుకోవచ్చు కదా’’ అని నిరుత్సాహపరిచారట. వాళ్లలా నేను మాట్లాడకుండా ‘‘హీరోగా పరిచయం చేద్దాం’’ అనడం గోపీచంద్‌కు మానసికంగా ఎంతో ధైర్యం వచ్చినట్టైంది. అతనికి తగిన కథ కోసం వెదకడం ప్రారంభించాం.


ఆ సంఘటన స్ఫూర్తితో...

‘స్నేహితులు’ సినిమా విడుదలైన తర్వాత మా శ్రీనివాసరెడ్డి కొత్త సినిమా సన్నాహాలు ప్రారంభించాడు. హీరోల జోలికి పోకుండా వాళ్ల అబ్బాయినే హీరోగా పరిచయం చేయాలని డిసైడ్‌ అయ్యాడు. నేనూ సరేనన్నాను. రోజూ కథలు వింటూ ఉండేవాడిని. ఒక లైన్‌ నాకు బాగా నచ్చడంతో ఆ రచయితకు అడ్వాన్స్‌ ఇప్పించాను మా శీనయ్యతో. వాడికి కూడా ఆ స్టోరీ లైన్‌ బాగా నచ్చింది. మేడ్చల్‌లో నిజంగా జరిగిన ఒక సంఘటన స్ఫూర్తితో తయారు చేసిన కథ అది. హైదరాబాద్‌ చుట్టుపక్కల చాలా ఫామ్‌ హౌసులున్నాయి కదా. వాటిల్లో ఒకదాంట్లో భార్యాభర్తలు కేర్‌ టేకర్లుగా ఉండేవారు. ఓ సారి అక్కడ దొంగతనం జరిగింది. వచ్చిన దొంగలు తమ పని పూర్తి చేసుకొని, వాచ్‌మన్‌ భార్యను రేప్‌ చేసి వెళ్లిపోయారు. అప్పట్లో ఆ సంఘటన సంచలనం సృష్టించింది. దొంగల భయంతో ఫామ్‌ హౌసుల్లో పనిచేయడానికి చాలామంది ముందుకు వచ్చేవారు కాదు.


ఆ పాయింట్‌ మీద వర్క్‌ చేసిన కథ అది. సినిమా కథ విషయానికి వస్తే ఓ ఇంట్లో తండ్రీ కూతుళ్లుంటారు. ఓ రోజు వారి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. వచ్చిన దొంగ తండ్రిని కట్టేసి, దొంగతనం చేసి వెళ్తూ పెద్ద కూతురు (మాధురీ సేన్‌ ఆ పాత్ర పోషించింది)ను రేప్‌ చేస్తాడు. అప్పటికే ఆమెకు పెళ్ళవుతుంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిస్తే ఆమె సంసారం నాశనం అవుతుందని రెండో కూతురు (స్నేహ) తనే రేప్‌కు గురయ్యానని అందరికీ చెబుతుంది. అదే రోజు రాత్రి హీరో స్నేహ వాళ్లింట్లో తన బైక్‌ పెడతాడు. దొంగ ఆ బైక్‌ను కూడా దొంగిలిస్తాడు. తెల్లారి హీరో వాళ్లింటికి వచ్చి బైక్‌ గురించి అడిగితే అతను బైక్‌ అక్కడ పెట్టలేదని తండ్రీకూతుళ్లు వాదిస్తారు.


చివరకు పోలీసుల వరకూ విషయం వెళ్లి రేప్‌ జరిగిన విషయం బయటపడుతుంది. అక్కకు జరిగిన దారుణాన్ని కడుపులోనే దాచుకుని తనే రేప్‌కు గురయ్యానని ధైర్యంగా అందరికీ చెబుతుంది స్నేహ. చాలా మంచి సబ్జెక్ట్‌. మా శీనయ్య కొడుకు కోసం తయారు చేసిన కథ. ఐతే కొన్ని కారణాలవల్ల మా వాడు ఆ సినిమా చేయలేకపోతే ఆ కథ తీసుకుని గోపీచంద్‌ హీరోగా ‘తొలి వలపు’ చిత్రం తీశాం. సాయికుమార్‌ సోదరుడు రవిశంకర్‌ను విలన్‌గా పరిచయం చేశాం. సినిమా పెద్దగా ఆడలేదు. దానికి కారణాలు అనేకం. అవన్నీ నేను చెప్పను. గోపి సినిమాలో చాలా అందంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌లో రెండు పాటలు తీశాం. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు నాగేశ్వరరావుగారు. ‘తొలి వలపు’ చిత్రం బాగా వచ్చింది.


ప్రారంభంలో బిజినెస్‌పరంగా మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ నాగేశ్వరరావుగారు అమ్మలేదు. ఎక్కువ రేట్లు చెప్పేవాడు. కొత్త హీరో సినిమాను ఎక్కువ రేట్లకు ఎవరు కొంటారు? అందరూ వెనక్కి వెళ్లిపోయారు. నేను చెప్పినా ఎవరూ పట్టించుకొనేవారు కాదు. చివరకు బిజినెస్‌ కాకపోవడంతో మయూరి సంస్థ ద్వారా విడుదల చేశారు. ‘మంచి సినిమా’ అని ఫస్ట్‌ డే టాక్‌ వచ్చింది. సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ కాదు కానీ ‘సినిమా బాగుంది.. కొత్త హీరో బాగున్నాడు’ అనే పేరు వచ్చింది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడంవల్ల క్రమంగా సినిమా డ్రాప్‌ అయింది. మంచి పబ్లిసిటీ చేసి ఆడించుకోవాల్సిన సినిమాను కిల్‌ చేశారు. గోపీకి హిట్‌ ఇవ్వాలని ఇంత తపనపడితే చివరకు ఇలా జరిగిందేమిటా అని బాధపడ్డాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-08-05T03:14:05+05:30 IST